నకిలీ నోట్లంటూ వచ్చిన పుకార్లను కొట్టిపారేసిన ఆర్‌బిఐ
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో (*) గుర్తున్న నోట్లు నకిలీ అంటూ వస్తున్న పుకార్లను ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) కొట్టిపారేసింది. నంబర్ ప్యానెల్‌లో (*) గుర్తు కల్గిన కరెన్సీ నోట్లు చట్టబద్ధమైనవేనని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. 100 నోట్ల ప్యాకెట్‌లో ఈ స్టార్ గుర్తును వినియోగించినట్టు రిజర్వు బ్యాంక్ తెలిపింది. అయితే సోషల్ మీడియా పోస్టులపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ నకిలీ, తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొంది. సీరియల్ నంబర్ మధ్యలో నక్షత్రం గుర్తు ఉన్న రూ. 500 నోట్లు నకిలీవని వచ్చిన పోస్టులను ప్ర జలు పట్టించుకోకూడదని పిఐబి పేర్కొంది. 2016 డిసెంబరులో నోట్ల రద్దు తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) అటువంటి నోట్లను విడుదల చేసిందని పిఐబి తెలిపింది. 500 రూపాయల నోట్లలో స్టార్ గుర్తు (*)తో అప్పట్లో ఆర్‌బిఐ ప్రారంభించిందని పిఐబి పేర్కొంది.