Wednesday, January 22, 2025

నకిలీ పోలీస్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నకిలీ ఎస్సైని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి పోలీస్ యూనిఫాం, స్టార్లు, షూ, సాక్స్‌లు, క్యాప్, నేమ ప్లేట్, బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. వనపర్తి జిల్లా, కిలాఘన్‌పూర్ మండలం, దొంతికుంట తండా గ్రామానికి చెందిన కడావత్ సోమ్లా నాయక్(44) బంజారాహిల్స్‌లోని ఉదయ్ నగర్ కాలనీలో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇంటర్ వరకు చదివిన నిందితుడు తర్వాత ఆర్మిలో జిడి సోల్జర్‌గా ఎంపికయ్యాడు.

తర్వాత ఆరు నెలలు ట్రైనింగ్ చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చేశాడు. తర్వాత 2004లో నిర్వహించిన అస్సాం రైఫీల్స్ నియామకంలో జిడి సోల్జర్‌గా మళ్లీ ఎంపికయి, శిక్షణకు వెళ్లాడు, కానీ హైడ్రోసిల్ వ్యాధితో బాధపడుతుండడంతో శిక్ష పూర్తి చేయకుండానే ఇంటికి వచ్చేశాడు. హైదరాబాద్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో 2012 నుంచి ఎస్సైగా ఎంపికయ్యానని చెబుతూ తిరుగుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని తనకు తెలిసిన వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్, గౌరిశంకర్ కాలనీకి చెందిన ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.2లక్షలు తీసుకుని మోసం చేశాడు.

దీంతో బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాగే పలువురికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.11లక్షలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ నాగార్జున, ఎస్సైలు కరుణాకర్ రెడ్డి, అనంతచారి, నాగరాజు తదితరులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం మాసబ్ ట్యాంక్ ఫోలీసులకు అప్పగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News