పెరుగుతున్న నిందితుల సంఖ్య
పోలీసుల పేరు చెప్పి దోచుకుంటున్న నిందితులు
గతంలో పట్టుబడ్డ నకిలీ పోలీసులు
హైదరాబాద్: పోలీసుల అవతారం ఎత్తి మోసాలు చేస్తున్న వారి సంఖ్య నగరంలో రోజు రోజుకు పెరుగుతోంది. పోలీసుల పేరు చెబితే చాలామంది బయభ్రాంతులకు గురవుతారనే నమ్మకంతో పోలీసులమని చెప్పి పలు నేరాలు చేస్తున్నారు. మల్కాజ్‌గిరిలో ఉన్న నిందితుడు గతంలో ఎసిపిగా విధులు నిర్వర్తిస్తున్నానని చెప్పి యూనిఫాం వేసుకుని బయటికి వచ్చేవాడు. నగరంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతు పోలీసు అన్ని చెప్పి పలు నేరాలు చేశాడు. డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామనని చెప్పి పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడు. నిందితుడిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి ఓ వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన సూడో పోలీసు ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నావని బెదిరించి బాధితుడు గ్రంధి శివానంద స్వామి నుంచి రూ.88,000 తీసుకున్నారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేయగా అందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఎఆర్ కానిస్టేబుల్ సాయికుమార్ ఉన్నాడు. తన స్నేహితులైన నలుగురితో కలిసి ముఠాను నడిపిస్తున్నాడు. వారి వద్ద నుంచి తుపాకీ, పోలీస్ యూనిఫాంను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని రామంతాపూర్‌లో ఉంటున్న రమావత్ నరేష్ పోలీసుగా పనిచేస్తున్నానని చెప్పి పలువురి వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నాడు. బస్టాప్‌ల వద్ద తిరుగుతు బెదిరించి ఉంగరాలు, చైన్లు చోరీ చేస్తున్నాడు. తాను పోలీసునని ఎవరికైనా చెబితే బ్రతకనివ్వనని బెదిరించేవాడు. నగరంలోని హుస్సేనీఆలంకు చెందిన సయిద్ తన్‌శీర్ హుస్సేన్ రజ్వి పోలీసుగా పనిచేస్తున్నానని చెప్పేవాడు.
నకిలీ ఐడి కార్డు, వాకీటాకీ పట్టుకుని తిరిగేవాడు. డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురు అమాయకులను నమ్మించి ఒక్కో వ్యక్తి నుంచి లక్ష నుంచి మూడు లక్షల వరకు డబ్బులు వసూలు చేశాడు. పదో తరగతి వరకు చదువుకున్న నిందితుడు గతంలో హోంగార్డు డ్రైవర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ పోలీసులు నిర్వహించిన పరీక్షలో ఎంపికకాలేదు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు నకిలీ పోలీసు అవతారం ఎత్తి ఎఎస్సైగా చెప్పుకుంటూ మోసాలు చేస్తున్నాడు. హఫీజ్‌పేట సమీపంలోని ప్రేమ్‌నగర్ బస్తీలో నివసం ఉంటే సృజన్‌కుమార్ నకిలీ పోలీసు అవతారం ఎత్తి పలువురు ప్రేమికులను లక్షంగా చేసుకుని నేరలు చేస్తున్నాడు. ఏకాంత ప్రాంతానికి బైక్‌పై వస్తున్న ప్రేమజంటలను టార్గెట్ చేసుకుని బెదిరించి వేలాది రూపాలయలు వసూలు చేస్తున్నాడు.
గతంలో పలుమార్లు అరెస్టయిన సృజన్‌కుమార్ ప్రవర్తన మార్చుకోకుండా పోలీసునని చెప్పి బెదిరిస్తున్నాడు. ఏజీ కాలనీ పరిధిలో ప్రేమికులు కారులో కూర్చుని మాట్లాడుకుంటుండగా వారి బెదిరించాడు. తాను పోలీసునని చెప్పి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు రావాలని బెదిరించాడు. ప్రేమికులను తీసుకుని ఎస్‌ఆర్ నగర్ చౌరస్తా వరకు రాగానే స్టేషన్‌కు వస్తే ఇబ్బందులు పడుతారని చెప్పి వారి వద్ద డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన బాధితులు ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పట్టుకున్నారు. ఇలా పలువురు నిందితులు పోలీసుల పేర్లు చెప్పి అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. కామారెడ్డికి చెందిన నిందితుడు నకిలీ పోలీసు పేరు చెప్పి పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎన్‌ఐఏను వదలని నిందితులు…
ఎపికి చెందిన గురువినోద్‌కుమార్ పోలీస్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేవాడు. పలుమార్లు పరీక్షలు రాసినా పోలీసు ఉద్యోగానికి ఎంపికకాలేదు. దీంతో తాను ఐపిఎస్‌కు ఎంపికయ్యాననిన ఎఎస్పిగా నేషనల్ ఇన్‌వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)లో పనిచేస్తున్నానని చెప్పి పలువురుని మోసం చేశాడు. రిటైర్డ్ మేజర్‌ను ఇలాగే నమ్మించి ఆయన ద్వారా పలువురు ఐపిఎస్ అధికారులను కలిశాడు. వారితో ఫొటోలు తీసుకుని వాటిని ఉపయోగించి హోటళ్లు, దేవాలయాలను సందర్శించేవాడు. డమ్మీ పిస్తోల్‌ను మేజర్ ఇంటి నుంచి చోరీ చేసి నిజమైనదని పలువురిని నమ్మించాడు. వినోద్‌కుమార్ నకిలీ పోలీసని తెలుసుకున్న మేజర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.