Sunday, January 19, 2025

దొంగ పోలీసులు…

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డిసిప్లిన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న కొందరు కక్కుర్తితో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అక్రమార్గంలో డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి ఉన్న జీవితాన్ని బజారున వేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో చోటు చేసుకోవడంతో ఆ పోలీసులను విధుల నుంచి తొలగించినా కూడా మిగతా వారు మారడంలేదు. తమకు అవకాశం దొరికిన చోట అక్రమాలకు పాల్పడి ఉద్యోగం పోగొట్టుకుంటున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ దారిదోపిడీ కేసులో అరెస్టు కావడంతో పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బళ్లారి శ్రీనివాస్ ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓ ఇన్స్‌స్పెక్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ సులభంగా డబ్బులు సంపాదించాలని ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. దానికి ఎన్నికల సమయం చాలా అనుకూలమని భావించి ఈ నెల 26వ తేదీన మెహిదీపట్నంలోని ఓ సంస్థ ఉద్యోగి కారులో తీసుకుని వస్తున్న నగదును చోరీ చేశాడు.

సంస్థ యజమాని ఆదేశాల మేరకు బ్యాంకులో రూ.20లక్షలు డిపాజిట్ చేసేందుకు సంస్థ ఉద్యోగి ప్రదీప్ శర్మ కారులో వస్తుండగా తాజ్ కృష్ణ వద్ద శ్రీనివాస్ పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో వచ్చి కారును తనిఖీ చేయాలని చెప్పాడు. దీంతో ప్రదీప్ శర్మ కారు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తుండగా, శ్రీనివాస్ ముఠాలో మిగతా సభ్యులు అక్కడికి వచ్చి ప్రదీప్ శర్మ దృష్టి మరల్చి రూ.18లక్షలు కొట్టేశారు. కొద్ది దూరం పోయిన తర్వాత బాధతుడు డబ్బులు చూసేసరికి లేకపోవడంతో ఈ విషయం సంస్థ యజమానికి చెప్పాడు. యజమాని ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించారు. దానిలో పోలీస్ పెట్రోలింగ్ కారు కన్పించడంతో దానిని వివరాలు తెలుసుకుని బళ్లారి శ్రీనివాస్‌ను అదుపులో తీసుకుని విచారించగా దారిదోపిడీ విషయం బయటపడింది. వెంటనే కానిస్టేబుల్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి విషయం రాచకొండ పోలీసులకు చెప్పారు.

దీంతో రాబరీ కేసులో అరెస్టైన కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగిస్తూ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. కాగా నల్గొండలో ఓ కేసులో కూడా కానిస్టేబుల్ పాత్ర ఉండడంతో అప్పటి పోలీస్ ఉన్నతాధికారులు అతడిని సర్వీస్ నుంచి తొలగించారు. గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో సర్వీస్ నుంచి తొలగించారు. దీంతో మద్యానికి బానిసగా మారిన కానిస్టేబుల్ చోరీలు చేయడం ప్రారంభించారు. మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో సదరు కానిస్టేబుల్ చైన్ స్నాచింగ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఎన్నికల తనిఖీలే ఆయుధం…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కావడంతో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో రోడ్లపై ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు, బైక్‌లు, కార్లు, బస్సులు ఇలా అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దీనిని తమకు అవకాశంగా తీసుకోవాలని కొందరు ముఠాగా ఏర్పడి నగదును తరలిస్తున్న వారిని ఆపి తనిఖీల పేరుతో దోచుకుంటున్నారు. వాహనాల తనిఖీ అనేది కేవలం పోలీసులు మాత్రమే చేస్తారు, ఒక వేళా నగదు లభిస్తే వాటికి ఆధారాలు చూపించకపోతే పోలీసులు వాటిని సీజ్ చేసి దానికి సంబంధించిన రసీదు ఇస్తారు. మీరు తరలిస్తున్న నగదుకు సంబంధించిన ఆధారాలు ఉంటే సమర్పించి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకుని వెళ్లవచ్చని పోలీసులు స్పష్టంగా చెబుతారు. రసీదు ఇవ్వకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉంటే వారు పోలీసులు కాదని, అసలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News