కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్
మన తెలంగాణ/హైదరాబాద్ : హెచ్ సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రభుత్వం హైకోర్టులో మంగళవారం పిటి షన్ దాఖలు చేసింది. కృత్రిమ మేధ(ఎఐ) సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి ప్రచారం చేశారని పిటిషన్‌లో వెల్లడించింది. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు. మొత్తం 400 ఎకరాలకు సంబంధించిన నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పిం గ్స్ తయారు చేశారనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి జింకలు, నెమళ్లు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలు సృష్టించారని పిటిషన్‌లో వెల్లడించింది. నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. పిటిషన్‌పై ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
విచారణ వాయిదా.. ప్రతివాదులకు నోటీసులు…
అంతకు ముందు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై వట ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు భూముల వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, టిజిఐఐసిని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై మంగళ వారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు.
వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు ప్రసుత్తం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, కంచ గచ్చిబౌలి భూముల్లో పనులను ఆపేయాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేప ట్టొద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో నెల రోజుల్లో నిపుణుల కమిటీని వేసి, ఆరు నెలల్లో రిపోర్ట్ సమర్పించాలని పేర్కొంది. కంచ గచ్చిబౌలి ప్రాంతా న్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించాలని, ఏప్రిల్ 16లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే సిఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.