న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సంఘం సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో బీజేపీ చేర్చుతోందనీ దుయ్యబట్టారు. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపడతానని హెచ్చరించారు. తృణమూల్ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన దీదీ , భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్‌ను నియమించడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు . 2006 లో భూసేకరణ వ్యతిరేక ఆందోళనల సందర్భంగా చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను ఆమె గుర్తు చేశారు.
ఓటర్ల జాబితాను సరిచేసి, తప్పుడు ఓటర్లను తొలగించాలని, డిమాండ్ చేశారు. లేదంటే ఈసీ కార్యాలయం ముందు దీక్ష చేపడతానని అన్నారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు హర్యానా, గుజరాత్ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో చేర్చుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఢిల్లీ, మహారాష్ట్రల్లోనూ బీజేపీ ఈ తరహా వ్యూహాలను అమలు చేసిందన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిరూపిస్తే విజయం సాధించగలమని బీజేపీకి తెలుసునని, అందుకే తప్పుడు జాబితాను రూపొందించే పనిలో పడిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇక్కడ రావని, బయట వ్యక్తులు (బీజేపీ) బెంగాల్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని తాము అనుమతించబోమని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు 215 చోట్ల విజయం సాధిస్తామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.