కరాచీ: ఐసీసీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ తొలి ఓవర్‌లోనే ఆ దేశ స్టార్ ఆటగాడు ఫకార్ జమాన్ ఫీల్డింగ్ చేస్తూ.. గాయపడ్డాడు. తొలి ఓవర్ వేసిన షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో మూడో బంతికి విల్ యంగ్ కవర్స్ మీదుగా షాట్ ఆడాడు. ఆ బంతిని ఆపేందుకు జమాన్ పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అలా పరిగెత్తుతూ జారిపడిన ఫకార్ కుడికాలికి గాయమై మైదానంలో విలవిలలాడాడు.
దీంతో ఫకార్‌ని మైదానం నుంచి తీసుకువెళ్లి.. అతని స్థానంలో కమ్రాన్ గులామ్‌ని సబ్‌స్టిట్యూట్‌గా తీసుకున్నారు. కాగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫకార్ గాయం గురించి స్పందించింది. ‘అతని కండరాల బెణికాయి అని.. అతన్ని వైద్యులు పరిశీలిస్తున్నారు. అతని ఆరోగ్యపై అప్‌డేట్‌ని త్వరలోనే ఇస్తాము’ అని పిసిబి పేర్కొంది. అయితే ఫకార్ గాయం నుంచి కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తుండగా.. అతని గాయం కానీ తీవ్రమై బ్యాటింగ్ చేయలేకపోతే.. జట్టు తీవ్ర పరిస్థితులు ఎదురుకోవాల్సి ఉంటుందని సీనియర్లు అంటున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ విల్ యంగ్(107) శతకంతో రాణించాడు. అతనికి టామ్ లాథమ్ మంచి భాగస్వామ్యాన్ని జోడించాడు. సెంచరీ చేసిన విల్ యంగ్ నజీం షా బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా.. టామ్ లాథమ్ అదరిపోయే షాట్‌లతో జట్టును భారీ స్కోర్ వైపునకు తీసుకువెళ్తున్నాడు. 46 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. క్రీజ్‌లో లాథమ్(95), గ్లెన్ ఫిలిప్స్(34) ఉన్నారు.