Thursday, January 23, 2025

కాళేశ్వరం ‘ప్రాణేశ్వరం’

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు ప్రతిపక్షాలే శనేశ్వరం

గోదావరి వరదల్లో లక్ష కోట్ల ప్రాజెక్టు
మునిగిందని దుష్ప్రచారం చేశాయి
రెండు పంపులు మునిగితే ఇక నీళ్లు
రావంటూ శాపనార్థాలు పెట్టాయి
వరదలపై బురద రాజకీయం చేశాయి
పంపుల మరమ్మతు చేసే
బాధ్యత ఏజెన్సీదే
మూడో వారంలో అన్నారం
పంపుహౌస్‌ను తిరిగి ప్రారంభిస్తాం
అక్టోబర్‌లో మేడిగడ్డ నుంచి
నీటి పంపింగ్
కాళేశ్వరం వల్లనే రాష్ట్రంలో పంటల
దిగుబడి పెరిగింది
శాసనమండలిలో మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో గతంలోఎన్నడూ లేనివిధంగా వరదలు సంభవించాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈసారి గోదావరి నదికి 24 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. 500 ఏళ్లల్లో ఇది అతిపెద్ద వరద అని చెప్పారు. వరదలపై బురద రాజకీయం చేసే పార్టీలు తెలంగాణలో ఉన్నాయని విమర్శించారు. ఇది ప్రకృతి వైపరిత్యం తప్ప మానవ తప్పిదం కాదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అసత్య ప్రచారం తగదన్నారు. శాసన మండలిలో రాష్ట్రంలో వరదలు, కాళేశ్వరం పంపుల మునక, వరద బాధితులకు సాయంవంటి అంశాలపై మండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రెండు పంపులు మునిగితే లక్ష కోట్ల ప్రాజెక్ట్ మునిగిందని అనడం ఏంటన్నారు. ఇక నీళ్లు రావు అని ప్రచారం చేశారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సస్యశ్యామలం చేశామని స్పష్టం చేశారు.

వరదలు ముమ్మాటికి ప్రకృతి వైపరిత్యమేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఏది జరిగినా పూర్తి బాధ్యత ఏజెన్సీదేనని తేల్చి చెప్పారు. మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించదన్నారు. అన్నారం పంప్ హౌస్‌ను ఈనెల మూడో వారంలో, అక్టోబర్ నెలాఖరులో మేడిగడ్డ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ వార్త ప్రజలకు సంతోషదాయకం. ప్రతిపక్షాలకు మాత్రం నా సంతాపం. వాళ్ల ఆశలు.. కలలు విఫలమయ్యాయన్నారు. కాళేశ్వరం ప్రజలకు ప్రాణేశ్వరమని పునరుద్ఘాటించారు. తెలంగాణకు ప్రతిపక్షాలు శనేశ్వరంలా దాపురించాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చాక మోటర్ వైండింగ్ దు కాణాలు,కన్వర్టర్లు, ఇన్వర్టర్ల దుకాణాలు బంద్. జనరేటర్లు కనబడుతున్నయా? అని ప్రశ్నించారు. ఇది కాదా తెలంగాణ సాధించిన ఘనత, 24 గంటల ఉచిత కరెంటు దేశంలో ఎవరన్నా ఇస్తున్నరా? అని ఆయన నిలదీశారు. కాళేశ్వరం వల్ల 3 కోట్ల టన్నుల పంట పండింది కదా ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి అని అన్నారు.

కాళేశ్వరం వల్ల డబ్బు వృధా అనిమాట్లాడుతున్నారు కాని డబ్బు ఆదా అయిందని వెల్లడించారు. దేశంలో ఎవ్వరు ఏ ప్రాజెక్టు కట్టినా ఆలస్యమయ్యేదని, 1980 లో స్టార్ట్ అయిన నర్మదా ప్రాజెక్టు 2018లో ప్రారంభమైంది. దీనికి 38 ఏళ్లు పట్టింది. కాని కాళేశ్వరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం వల్ల ఆదా చేశామని విపులీకరించారు. యాసంగికి రైతులకు ఎంత నీరు కావాలంటే అంతా ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సీడబ్ల్యూసీ అన్ని అనుమతులు ఇచ్చిందని..కానీ కేంద్రమంత్రులు ఏ అనుమతులు లేవని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ పూర్తి కాలేదని మొన్న ఓ కేంద్రమంత్రి చెప్పారని, డిపిఆర్ లేకపోతే ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వేగంగా అనుమతులు ఇచ్చామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని గుర్తు చేశారు. ఐనా బిజెపి నేతలు..కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరానికి నీరు రాలేదంటున్నారు. మళ్లీ తమ నియోజకవర్గంలో నీరు విడుదల చేస్తారని ఇదేం పద్ధతి అని అన్నారు.

రైతుల విషయంలో
తెలంగాణ రాష్ట్రం చేసినట్లు ఏ ప్రభుత్వం చేయలేదు

ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వరి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల నుంచి 2 కోట్ల 59 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. పంట కొనుగోళ్ల్లు 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి కోటి 20 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగిందని వెల్లడించారు. ఇది ఆర్బీఐ, కాగ్ ఆడిట్ చేసిన రిపోర్ట్ చెబుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేయడం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం తో పాటు, మిషన్ కాకతీయతో పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వడానికి ఇంత ఖర్చు చేయలేదన్నారు. ఇప్పటి దాకా తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్ కోసం 58 వేల 623 కోట్లు రైతులకు ఇవ్వడానికి, లిఫ్ట్ ఇరిగేషన్ కు విద్యుత్ కోసం ఇచ్చామన్నారు. రైతు బంధు కింద 9 సీజన్లలో 65 లక్షల మందికి 57,888 కోట్లు ఇచ్చామని తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే, తిన్నది అరగక చనిపోతున్నారని, ఎక్స్ గ్రేషియా కోసం చనిపోతున్నరని ఆనాటి ప్రభుత్వాలు హేళన చేశాయన్నారు.

కాని రైతులు ఆత్మగౌరవంతో జీవించేలా పని చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని తెలిపారు. మెక్రో ఇరిగేషన్ కోసం 2 లక్షల 99 వేల 514 మంది రైతులకు, 8 లక్షల 11 వేల 304 ఎకరాలకు 2108 కోట్ల ఖర్చుతో డ్రిప్, స్పింక్లర్స్ రైతులకు ఇచ్చామన్నారు. అదే రీతిలో పంటల కొనుగోలు కోసం. వరి కాకుండా పెసలు, మక్కలు, పప్పు దినిసులు, జొన్నలు,రక రకాల పంటలు మద్ధతు ధరకు కొన్నామని తెలిపారు. బయట మార్కెట్లో అమ్మితే సగం ధరే వచ్చేదని, అయినా సిఎం కెసిఆర్ పెద్ద మనసుతో రైతులకు నష్టం కలగకూడదని 9406 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు మద్ధతు ధర అన్ని పంటలకు ఇచ్చినామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వరద సమయంలో ములుగు, భద్రాద్రి, ఖమ్మం , మంచిర్యాల, నిర్మల్ జిల్లా కలెక్టర్లు, పోలీసులు, జిల్లా సిబ్బంది, వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడేలా పనిచేశారని, వారిని ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News