తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) నిర్వహిస్తున్న టిఎఫ్‌సిసి నంది అవార్డులకు దామోదర్ ప్రసాద్ మరియు సునీల్ నారంగ్‌కు ఎలాంటి సంబంధం లేదని టిఎఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ వివరించారు. టిఎఫ్‌సిసి నంది అవార్డులపై తప్పుడు ప్రచారం చేస్తున్న దామోదర్ ప్రసాద్ – సునీల్ నారంగ్‌లపై ఆర్‌కె గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టిఎఫ్‌సిసి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్.కె.గౌడ్ మాట్లాడారు. టిఎఫ్‌సిసి నంది అవార్డ్స్ పేరుతో సౌత్ ఇండియాలో ఆర్టిస్టులందరికీ అవార్డులు ఇస్తున్నామని, దీన్ని కాదనే హక్కు, విమర్శించే హక్కు దామోదర్ ప్రసాద్-సునీల్ నారంగ్‌లకు ఎవరిచ్చారని ఆర్‌కె గౌడ్ ప్రశ్నించారు.
టిఎఫ్‌సిసి పేరుతో ట్రేడ్ మార్క్(3471642 Dated 01-02-2017),టిఎఫ్‌సిసి నంది అవార్డ్స్ రిజిస్ట్రేషన్ (Reg.No.449/2023) చేయించామని అన్నారు. అంతేకాదు టిఎఫ్‌సిసి నంది ఈవెంట్స్ పేరుతో దుబాయ్ ప్రభుత్వం నుండి లైసెన్స్ (License No.11931177 Dated 31-5-2023) కూడా తీసుకున్నామన్నారు. దుబాయ్‌లో ఏర్పాటు చేసిన తన కంపెనీ ద్వారా సుమారు 30 నుంచి 40 మందికి వీసాలు ఇచ్చే అనుమతి కూడా సాధించామని చెప్పారు. సెప్టెంబర్ 28న ఆదివారం దుబాయ్‌లో టిఎఫ్‌సిసి నంది అవార్డుల వేడుక జరుగుతుందని తెలిపారు. ప్రముఖ నటులు మురళీ మోహన్, సుమన్, రోజారమణి, డైరెక్టర్ బి.గోపాల్, డైరెక్టర్ రేలంగి నరసిహారావు, ఎస్వీ కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్ర్రానిక్ మీడియా సలహాదారు అలీ చేతుల మీదుగా బ్రోచర్ విడుదల చేయడం జరిగిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం టిఎఫ్‌సిసి నంది అవార్డులకు అనుమతితో కూడిన లెటర్ (ప్రొసీడింగ్స్ నెంB1/76/2023 Dated 25-01-2023)కూడా ఇచ్చిందని తెలిపారు. ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన సునీల్ నారంగ్, ఆంధ్రాకు చెందిన దామోదర్ ప్రసాద్ కలిసి నిజమైన తెలంగాణ బిడ్డలపై తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు. టిఎఫ్‌సిసిలో అన్ని ప్రాంతాల వారు,బెంగళూరు, తమిళనాడు, ముంబయ్, అనంతపూర్, తిరుపతి, కడప, కర్నూలు, విజయవాడ, వైజాగ్ తదిత ప్రాంతాలవారితో పాటు అన్ని భాషల వారు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు అడ్డుపడినా, స్పాన్సర్స్ వచ్చినా రాకపోయినా తమ స్వంత ఆస్తులు అమ్మి అయినా టిఎఫ్‌సిసి నంది అవార్డుల ఫంక్షన్ దుబాయ్‌లో ఘనంగా నిర్వహిస్తామని, ఇప్పటికే స్వంత ఖర్చులతో దుబాయ్‌లో అవార్డు ఫంక్షన్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా తెలుగు ఖ్యాతి ప్రపంచమంతా తెలిసేలా దుబాయ్‌లో ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా భవంతిపై టిఎఫ్‌సిసి నంది అవార్డుల ప్రకటన వేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఎఫ్‌సిసి వైస్ ప్రెసిడెంట్ ఎ.గురురాజ్ మాట్లాడుతూ.. టిఎఫ్‌సిసి నంది అవార్డులకు ఎవరి దయా దక్షిణలు అవసరం లేదని, అవార్డ్స్ ఫంక్షన్‌ను ఎవరి సహకారం లేకుండా స్వంతంగా నిర్వహించగల సత్తా మాకు ఉందని తెలిపారు. టిఎఫ్‌సిసి సెక్రటరీ ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఫిలింఛాంబర్ ద్వారా దాదాపు 175 సినిమాలు సెన్సార్ అయ్యాయని, ప్రభుత్వాల సహకారం ఉంది కాబట్టే ఛాంబర్ విజయవంతంగా నడుస్తోందని మాకు ఇతరుల సహకారం అక్కర్లేదని పేర్కొన్నారు. నిర్మాత లక్ష్మీపతి మాట్లాడుతూ.. టిఎఫ్‌సిసి నంది అవార్డుల ద్వారా తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం టిఎఫ్‌సిసి చేస్తోందని, దీన్ని అభినందించాల్సిందిబోయి విమర్శించడం మంచిది కాదన్నారు. మరో వైస్ ప్రెసిడెంట్ నెహ్రూ మాట్లాడుతూ.. టిఎఫ్‌సిసి ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని అదేవిధంగా టిఎఫ్‌సిసి నంది అవార్డులను కూడా దిగ్విజయంగా నిర్వహిస్తామని తెలిపారు.
- Advertisement -