ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
‘పింక్ పవర్ రన్ 2024’కు
ముఖ్యఅతిథిగా హాజరైన సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటంబం, సమాజం సంతోషంగా ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మహిళా సాధికారత కోసం రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోందని వివరించారు. సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘పింక్ పవర్ రన్ 2024’ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వైద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీఠవేస్తోందని అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు సుధారెడ్డి పౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని హాస్పిటల్స్ నిర్మించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తామని అన్నారు. మనమంతా కలిసి రాష్ట్ర మహిళలకు ఆరోగ్యకరమైన, మరింత సాధికారత గల భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సుధారెడ్డికి సిఎం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పింక్ పవర్ 5కె, 10కె రన్‌లో గెలుపొందిన వారికి సిఎం రేవంత్ రెడ్డి నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి పిఎసి ఛైర్మన్ అరికపూడి
గాంధీ, శాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి తదితరులు హాజరయ్యారు.
మారథాన్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు : ఎం.ఇ.ఐ.ఎల్, సుధా రెడ్డి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3,5,10కిలో మీటర్ల మారథాన్‌లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. బ్రెస్ట్ (రొమ్ము) క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ రన్ నిర్వహించినట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైన మారథాన్ ఓల్డ్ ముంబయి జాతీయ రహదారి, ఐఎస్‌బీ రోడ్, టిఎన్‌ఓ కాలనీ మీదుగా కొనసాగి తిరిగి స్టేడియంకి చేరింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది పిల్లల, పెద్దల వరకు అందరూ గులాబీ రంగు దుస్తుల్లో ముస్తాబై పక్షి రూపంలో భారీ మానవహారంగా ఏర్పడి గిన్నిస్ వరల్ రికార్డులో చేరేందుకు ప్రయత్నించారు. యువత ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంది.