మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని బేగంబజార్ వ్యాపారి నీరజ్ హత్య కేసులో నిందితుల తల్లిదండ్రులు శుక్రవారం నాడు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. నీరజ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న తమ పిల్లలకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా హెచ్‌ఆర్‌సికి విజ్ఞప్తి చేశారు. తమ పిల్లలు ఆరుగురిని రిమాండ్‌కు తరలించారని అనంతరం వారిని విచారణ పేరుతో కస్టడీకి తీసుకున్నారని తెలిపారు.
వారిని లాకప్ డెత్, ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారని అనుమానముందని హెచ్‌ఆర్‌సి దృష్టికి తీసుకెళ్లారు. నీరజ్ హత్య ఘటనలో ప్రమేయం లేని వారిపైనా కేసులు పెడుతున్నారని, పోలీసు కస్టడీలో చట్టబద్ధంగా విచారణ చేయాలని హెచ్‌ఆర్‌సికి విన్నవించారు. ఈ విషయంపై అనతికాలంలో నగర సిపిని కూడా కలుస్తామని వారు తెలిపారు.
పెరుగుతున్న నిందితుల సంఖ్య
బేగంబజార్ నీరజ్ పన్వార్ పరువు హత్యకేసులో నిందితుల సంఖ్య పెరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయ్, సంజయ్ అనే ఇద్దరు నిందితులను కోర్టు 4 రోజుల కస్టడీకి అనుమతించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. నీరజ్ హత్య కేసులో షాహినాయత్ గంజ్ పోలీసులు ఇప్పటివరకు 7 గురిని అరెస్ట్ చేశారు. నీరజ్ హత్యతో ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే విషయాలపై నిందితులను పోలీసులు ప్రశ్నించారు. ముఖ్యంగా నీరజ్‌ను హత్యకు సంబంధించి కుట్ర వివరాలను సేకరించేందుకు పోలీసులు విచారణ చేపడుతున్నారు.