లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 16 ఏళ్ల యువతి, 10 ఏళ్ల బాలుడు సహా ఓ కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే గురువారం హత్యకు గురయ్యారు. 50 ఏళ్ల వ్యక్తి, 45 ఏళ్ల ఆయన భార్య, వారి పిల్లల శవాలు గురువారం వారింట్లో కనుగొనబడ్డాయి. యువతి హత్యకు గురికాక ముందే అత్యాచారానికి గురై ఉంటుందని ఆ కుటుంబానికి చెందిన బంధువులు వాదిస్తున్నారు. ఈ నేరానికి పొరుగున ఉన్న అగ్ర కుల కుటుంబమే కారణమని కూడా వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు సామూహిక అత్యాచారం, హత్య ఆరోపణలను 11 మందిపై పెడుతూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వారిలో ఇప్పటి వరకు ఎనిమిది మందిని పట్టుకున్నట్లు ప్రయాగ్‌రాజ్ పోలీస్ చీఫ్ మీడియాకు తెలిపారు. కాగా ప్రశ్నించేందుకు కొందరిని కస్టడీలోకి తీసుకున్నట్లు కూడా ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకురాలు, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అయిన ప్రియాంక గాంధీ శుక్రవారం ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. ఆమె బాధితుల కుటుంబాన్ని పరామర్శించనున్నారని భావిస్తున్నారు.