Saturday, January 11, 2025

కుటుంబ నియంత్రణ తారుమారు?

- Advertisement -
- Advertisement -

మొత్తం సంతానోత్పతి రేటును బాగా తగ్గించడంలో భారత దేశం గర్వించదగిన పాత్ర వహించింది. 1965లో ప్రతి మహిళ కనీసం ఐదుగురికి జన్మనివ్వగా 2022లో ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం అపురూపంగా మారింది. దీనిని బట్టి దేశం సంతానోత్పత్తిని ఎంత కనీస స్థాయికి తగ్గించగలిగిందో స్పష్టమవుతుంది. 1975 నుంచి 1977 వరకు ఎమర్జెన్సీ కాలంలో బలవంతంగా కుటుంబ నియంత్రణ చేయించేవారు. అది తప్ప ఎలాంటి క్రూర మైన చట్టాలు లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణను పాటించడం చెప్పుకోదగిన విశేషం.

చైనాలో ఒకే బిడ్డ విధానాన్ని దాదాపు 36 ఏళ్ల పాటు పాటించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారత్‌లో సంతానం భర్తీ రేటు 2.01 స్థాయికి పతనం కావడం బహుశా మంచి పరిణామం కాకపోవచ్చు. 2050 నాటికి మొత్తం సంతానోత్పత్తి రేటు 1.29 స్థాయికి బాగా దిగజారిపోవచ్చని లాన్సెట్ నివేదిక అంచనా వేసింది. అంటే ఆర్థికంగా భారత్ అభివృద్ధి చెందడం కన్నా ముందుగానే వృద్ధాప్యం లోకి చేరుకుంటుందని ఊహించవచ్చు. భవిష్య జనాభాను ఎదుర్కోడానికి పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు చేసినట్టు ఆరోగ్య సంరక్షణను పెంపొందిచడం, శ్రామిక శక్తికి తగిన శిక్షణ ఇవ్వడం, బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంతో సహా అనేక విధానాలు ఉన్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ఇటీవల వెలువరించిన ముగ్గురు పిల్లల ప్రమాణం జనాభాను ఎదుర్కొనే విధానాలు కావు. రెండేళ్ల క్రితం జనాభా నియంత్రణ పాటించాలని మోహన్ భాగవత్ ఇచ్చిన పిలుపుకు ఇప్పుడు ముగ్గురు సంతానం అనే పిలుపు తీవ్రవైరుధ్యం.

ఆనాడు హిందువులకు, ముస్లింలకు మధ్య సంతానోత్పత్తి రేటులో వ్యత్యాసంపై ఆయన సూచన చేశారు. ఇప్పుడు జనాభా అభివృద్ధి రేటు పతనం కావడం, జనాభా స్తబ్దత యొక్క పరిణామాన్ని భారత్ ఎదుర్కోవడం, సామాజిక ప్రమాదాన్ని చుట్టుముట్టిందని భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధిని వేగవంతం చేయడానికి జనాభా పెరుగుదలను ప్రోత్సహించడమే సులువైన మార్గంగా కనిపిస్తోందన్నభావం వ్యక్తమవుతోంది. నిర్దిష్టమైన స్కాండినేవియా దేశాలు, ఇతర ఐరోపా దేశాలు కొన్ని దశాబ్దాలుగా సంతానోత్పత్తి రేటు క్షీణతతో సతమవుతున్నాయి.ఆయా కుటుంబాలకు పిల్లల సంరక్షణ రాయితీలను అందిస్తున్నాయి. ఈ దేశాలు ఇప్పుడు సామాజిక ఆర్థిక పురోగతిని కొంతవరకు సాధించడం, సమర్థవంతమైన పాలనా విధానాలతో సామాజిక తిరోగమనం లేకుండా జనాభా అభివృద్ధి లక్షాలను సాధిస్తున్నాయి. ఉదాహరణకు ఆయా దేశాల్లో పేటర్నిటీ లీవ్ (పితృత్వ శెలవు) వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంటే బిడ్డ పుట్టిన తరువాత తండ్రికి ఉద్యోగం నుండి వచ్చే శెలవు సమయం. ఇది తండ్రులు లేదా కావలసిన తల్లిదండ్రులకు తమ కొత్త బిడ్డను చూసుకోవడానికి, అనుబంధం కోసం తీసుకోగల ఒక రకమైన శెలవు.

మన దేశంలో ఈ విషయంలో అసమానత కనిపిస్తోంది. ప్రసూతి సంక్షేమం అసమానతతో పాటు అసమర్ధతతో ఉంటోంది. ముగ్గురు బిడ్డల ప్రమాణం ఆపదలతో నిండి ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి లెక్కలేని జనాభాతో దేశం సామాజిక ప్రయోజనాలను చాలా వరకు కోల్పోవడం జరుగుతోంది. ముఖ్యం గా ముగ్గురు పిల్లల్ని కనాలనే విధానం మహిళల హక్కులకు వ్యతిరేకం. సంతానాన్ని పొందడం, తరువాత వారిని సంరక్షించడం,పెంచిపెద్ద చేయడం ఇవన్నీ విచక్షణారహితంగా మహిళలపైనే భారమైన బాధ్యతలుగా ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. ఉన్నత చదువులు చదువుకోవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్న, ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా సంతానం పొందడంతో ఒకేసారి ఈ అవకాశాలన్నీ మహిళలకు దూరమైపోతున్నాయి.

పేద కుటుంబాలకు చెందిన, సంప్రదాయ విధానాలకు కట్టుబడిన మహిళల విషయం ఇంకా దారుణంగా ఉంటోంది. పిల్లలను కనే యంత్రాలుగా, వారికి చాకిరీ చేసే వ్యవస్థలుగా మిగిలిపోతుంటారు. భారత్‌లోని మహిళా కార్మికుల ప్రాతినిధ్యం కేవలం 37 శాతానికే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నకుటుంబాల్లో బాధ్యతల భారం వహించడంలో మహిళలే ముందుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముగ్గురు పిల్లల్ని కనిపెంచే కీలకమైన బాధ్యతను స్వీకరించడానికి సాధారణంగా మహిళలు ఇష్టపడరు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇద్దరికి మించి పిల్లలు ఉండకూడదన్న ఆంక్షలను రద్దు చేశారు.

పిల్లలు ఎక్కువ ఉన్న కుటుంబాలకు రాయితీలు కల్పించాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉంటోంది. రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజన అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. జనాభా తక్కువ ఉంటే ఆయా రాష్ట్రాలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం సరిగ్గా లభించదన్న అంశం ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను వెంటాడుతోంది. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు ఈ విషయంలో తర్జనభర్జన పడుతున్నాయి. ఈ భయాలు పూర్తిగా తప్పుకాకపోవచ్చు కానీ ప్రభుత్వాల పాలనా విధానాలలో ఈ మేరకు నిర్ణయాలను తక్షణం తీసుకోవాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. అందువల్ల జనాభా సుడిగుండం ఈ రాష్ట్రాల్లో అలజడి సృష్టించవచ్చు. అధిక సంతానవంతులైన కుటుంబాలను ప్రోత్సహించడం రాష్ట్రాలకు భారీ ఎదురుదెబ్బ. పాశ్చాత్య దేశాల్లో కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, మేక్రాన్, మస్క్, మెలోనీ, తదితర నేతలు, దక్షిణ కొరియా, జపాన్ ప్రభుత్వాలు కూడా సంతానోత్పత్తి రేటును పెంచుకోవాలని తాపత్రయ పడుతున్నారు. కానీ బలవంతంగా పిల్లల కోసం మహిళలను బానిసలుగా చేయడానికి ఆ దేశాల మహిళలు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News