Sunday, December 22, 2024

ఒడిశాలో దారుణం: పెళ్లికాని దివ్యాంగుడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్

- Advertisement -
- Advertisement -

మల్కన్‌గిరి: అవివాహితుడైన ఒక దివ్యాంగుడికి అతడి అనుమతి లేకుండానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్(వ్యాసెక్టమి) చేసేశారు ఆరోగ్య శాఖ ఉద్యోగులు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా మథిలి బ్లాక్ పరిధిలోని అంబగూడ గ్రామంలో ఇటీవల ఈ దారుణం చోటుచేసుకోగా దీనిపై జిల్లా ముఖ్య వైద్యాధికారి(సిడిఎంఓ) శుక్రవారం విచారణకు ఆదేశించారు.

గ్రామస్తులు కథనం ప్రకారం..ఆగస్టు 3వ తేదీన మథిలి సబ్ డివిజనల్ ఆసుపత్రికి చెందిన ఆశా కార్యకర్తలతోపాటు ఆరోగ్య సిబ్బంది అంబగూడ, పరిసర గ్రామాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆరోగ్య శిబిరానికి తీసుకెళ్లారు. ఈ ఐదుగురు వ్యక్తులలో మూగ, చెవుడుతో బాధపడుతున్న గంగ దురువా అనే యువకుడు కూడా ఉన్నాడు.

ఆరోగ్య కార్యకర్తలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు సంబంధించి తమ టార్గెట్లు పూర్తిచేసుకునేందుకే ఈ పనిచేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే తన కుమారుడిని మథిలి సబ్ డివిజనల్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు ఆరోగ్య సిబ్బంది తనకు చెప్పారని గంగ తల్లి చంప తెలిపారు. ఆపరేషన్ తర్వాత గంగకు రూ. 2,000 నగదు చేతిలో పెట్టి ఇంటికి పంపించారని ఆమె చెప్పారు.

కొందరు సామాజిక కార్యకర్తలు ఈ తప్పిదాన్ని సిడిఎంఓ ప్రఫుల్ కుమార్ నంద దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ఉదంతం బయటపడింది. గంగ వివాహితుడని, అతని సమ్మతితోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశామని స్థానిక ఆశా కార్యకర్త తెలియచేసినట్లు సిడిఎంఓ వివరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, ఎవరైనా తప్పుచేసినట్లు తేలితే శిక్షను ఎదుర్కోక తప్పదని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News