Friday, November 22, 2024

పరివార్ పాలిటిక్స్

- Advertisement -
- Advertisement -

ఎర్రబెల్లి ఫ్యామిలీలో ముగ్గురు మూడు పార్టీల నుంచి,  బాల్కొండలో మేనత్తతో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఢీ
గద్వాలలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల నుంచి బిజెపి డికె అరుణ ఫామిలీ, బంధువులు కొన్నిచోట్ల, సోదరులు కొన్నిచోట్ల

కుటుంబ రాజకీయాలపై విస్తృత చర్చ జరుగుతోంది. అధికార బి.ఆర్.ఎస్ మాత్రమే కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాని, అధికార, విపక్ష అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ కుటుంబ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. అధికార బిఆర్‌ఎస్ నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండగా ఆయన తనయుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు సిరిసిల్ల నుంచి, కెసిఆర్ మేనల్లుడు హరీశ్‌రావు సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్నారు.

బిఆర్‌ఎస్ పార్టీ నుంచే కాకుండా కాంగ్రెస్, బిజెపి నుంచి కూడా ఒకే కుటుంబంలోని సభ్యులు ఒకే పార్టీ నుంచి లేదా భిన్న పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఇందుకు ఎవరూ అతీతం కాదనడానికి అసెంబ్లీ ఎన్నికల ‘బరి’లో నిలిచిన వివిధ పార్టీల అభ్యర్థుల జాబితాను వడపోస్తే తేటతెల్లమవుతుంది. పరివార్ పాలిటిక్స్ కూడా చిత్ర, విచిత్రంగా వున్నాయి. కొందరు కుటుంబీకులు ఒకే పార్టీ నుంచి పోటీ చేస్తుండగామరి కొందరు భిన్న పార్టీల్లో అభ్యర్థులుగా నిలిచారు. మరి కొన్ని చోట్ల రక్త సంబంధీకులే ప్రత్యర్థులుగా నిల్చున్నారు. వివరాలు ఇలా వున్నాయి.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావ్ బిజెపి అభ్యర్థిగా, దయాకర్ రావు అల్లుడు మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంటే ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయడం ఇక్కడ విశేషం. మహబూబ్‌నగర్ జిల్లాలో బిజెపిలో జాతీయ స్థాయి నాయకురాలిగా వున్న డికె అరుణ మేన కోడలు డాక్టర్ పరిణికా రెడ్డి నారాయణపేట కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో వుండగా, అరుణ సోదరుడు చిట్టం రామ్మోహన్ రెడ్డి మక్తల్ బిఆర్‌ఎస్ అభ్యర్థిగా, అరుణ మేనల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలో వున్నారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మంత్రి బిఆర్‌ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డికి ప్రత్యర్థిగా ఆయన మేనత్త అన్నపూర్ణమ్మ బిజెపి నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో కుటుంబాల నుంచి పోటీ చేస్తున్న వారిలో ఉత్తమ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ నుంచి, ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీ చేస్తుండగా, కోమటి రెడ్డి కుటుంబంలో వెంకట్ రెడ్డి నల్లగొండ నుంచి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి, హైదరాబాద్ లోని మల్కాజ్‌గిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్ మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు నుంచి గడ్డం వివేక్, ఆయన సోదరుడు గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేస్తుండగా, ఆమె మేనల్లుడు పట్నం మహేందర్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నారు. మేడ్చల్ నుంచి మంత్రి మల్లారెడ్డి పోటీలో వుండగా, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తున్నారు.

(మిట్టపల్లి శ్రీనివాస్/మనతెలంగాణ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News