Wednesday, January 22, 2025

కుటుంబ వ్యవస్థను పటిష్టం చేద్దాం

- Advertisement -
- Advertisement -

ఒక కుటుంబంలో తాత, అమ్మ మొదలు వారి పిల్లలు, వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి కుటుంబంలో ఉండేవి. ఇంటిలోని పెద్దకు అందరూ గౌరవం ఇస్తూ, ఆయన మాటే వినేవారు. ఆ కుటుంబాలలో పెద్దల సంరక్షణలో పిల్లలు ఆనందంగా ఉండేవారు. కష్టసుఖాలు సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులతో ఒంటరితనం అనే భావన లేకుండా ఆనందంగా గడిపిన కుటుంబాలెన్నో ఉన్నాయి. కానీ నేడు చూస్తే ఉమ్మడి కుటుంబాలుగా ఉన్న ఎన్నో కుటుంబాలు ఆధునిక ప్రపంచంలో చిన్న కుటుంబాలుగా మారాయి. ఆధునికత పెరగడం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కలసి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ను దెబ్బ తీసింది.

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 15న విశ్వవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, కుటుంబ విలువలను తెలియజేయడం కోసం, ఉమ్మడి కుటుంబాల అవసరం గురించి వివరించడం కోసం ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు. పూర్వకాలంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడం లేదు.

ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావ డం, పట్టించుకునేవారు లేకపోవడంతో విచ్చల విడిగా బతకడం, పిల్లలకు సంస్కృతి సాంప్రదాయం తెలియజేసే తాతలు, అమ్మలు లేకపోవడం, క్షణికావేశంలో నేరస్థులుకావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ బలహీనమవ్వడం మూలంగా సమాజంలో జరిగే నష్టాలను, తీవ్ర పరిణామాలను గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం 1993, మే 15న అంతర్జాతీయ కుంటుంబ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది.

కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం అనే అంశాన్ని వివరిస్తూ ప్రజా చైతన్యంకోసం ప్రపంచ వ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యతను వివరించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల మధ్య తిరిగి ప్రేమానురాగాలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవడానికి నిర్ణయించింది. కుటుంబ సమైక్యత గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, కుటుంబ పెద్దల నైపుణ్యాన్నీ, అనుభవాలను పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయంలో సరైన సహకారాన్ని అందించడం, కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం వంటి లక్ష్యాలతో ఈ రోజును జరుపుకుంటున్నాము.

కుటుంబ వ్యవస్థ మన సమాజం మనకు ఇచ్చిన ఒక గొప్ప అరుదైన కానుకగా భావించవచ్చు. కుటుంబం అనేది సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ ప్రత్యేకత కారణంగా కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేస్తూ వసుధైక కుటంబం అనే దిశలో ప్రయాణానికి తోడ్పడుతున్నది. సామాజిక, ఆర్థిక భద్రతకు ఒక సంపూర్ణ వ్యవస్థ కావడంతో పాటు, కొత్త తరానికి సంస్కారాలు, విలువలు నేర్చే ముఖ్యమైన మాధ్యమంగా కూడా కుటుంబం వ్యవహరిస్తుంది. కుటుంబ వ్యవస్థ వల్ల సమాజానికి మనం ఇచ్చే సందేశం ఎంతో గొప్పది. ప్రపంచ దేశాల్లో భారత దేశ కుటుంబ వ్యవస్థలా మరెక్కడా లేకపోవడం అనేది మన ధర్మం గొప్పతనంగా భావించవచ్చు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు, నాగరికత అభివృద్ధికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. పూర్వకాలం నుండి మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని చరిత్ర ద్వారా మనకు తెలిసిందే. మన దేశంలో ఉమ్మడి కుటుంబాల వారు ఆనందంగా ఉన్నారని మన చరిత్ర ద్వారా మనం తెలుసుకున్న నిజం. ఒక కుటుంబంలో తాత, అమ్మ మొదలు వారి పిల్లలు, వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి కుటుంబంలో ఉండేవి.

ఇంటిలోని పెద్దకు అందరూ గౌరవం ఇస్తూ, ఆయన మాటే వినేవారు. ఆ కుటుంబాలలో పెద్దల సంరక్షణలో పిల్లలు ఆనందంగా ఉండేవారు. కష్టసుఖాలు సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులతో ఒంటరితనం అనే భావన లేకుండా ఆనందంగా గడిపిన కుటుంబాలెన్నో ఉన్నాయి. కానీ నేడు చూస్తే ఉమ్మడి కుటుంబాలుగా ఉన్న ఎన్నో కుటుంబాలు ఆధునిక ప్రపంచంలో చిన్న కుటుంబాలుగా మారాయి. ఆధునికత పెరగడం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కలసి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ను దెబ్బ తీసింది. నేటి ఆధునిక ప్రపంచంలో రెండు కుటుంబాలు కాదు కదా రెండు మనసులు కూడా కలసి జీవించలేని పరిస్థితి నెలకొంది. డబ్బు సంపాదన కోసం కనీసం భార్యభర్తలు కూడా ఒక చోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకునే సమయం లేదంటే మన కుటుంబ వ్యవస్థ ఎంత బలహీన పడిందో అర్థం చేసుకోవచ్చు. అందరూ డబ్బు సంపాదించే యంత్రాలుగా మారి, తల్లి దండ్రులను చూసుకొనే తీరికలేక వృద్ధాశ్రమాలలో వేస్తున్నారు.

ఉమ్మడి కుటుంబాలలో కలిసిమెలిసి ఉండే మనసులు కానీ, మనుషులు కాని లేక, పెళ్లయిన వెంటనే వేరు కాపురాలు పెట్టుకుని జంటలుగా ఉండి కూడా మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఒంటరై పోతున్నారు. సలహాలు సూచనలు ఇచ్చే పెద్దవారు లేక, ఆపదలో ఆదుకునే ఆత్మీయులు రాక, కనీసం మనసులోని బాధలను పంచుకునే బంధువులు ఉండక, జీవితమంటే విసుగు వచ్చే స్థాయికి నేటి యువత వెళ్లిందంటే కారణాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కాపాడుకుంటూ, ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యతను గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ వ్యవస్థ ముఖ్యోద్దేశాలు పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, సంస్కృతిని వారికి అందజేయడం, ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంగా ఉండాలి.

ఆడవారు, మగవారు వేరు వేరు పనులు పంచుకొని జీవనాన్ని సాగిస్తూ శ్రమవిభజనకు ఒక ఉదాహరణగా ఉంటుంది. ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం దొరకని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఫోన్‌లోనో, మొబైల్‌లోనో యోగక్షేమాలు కనుక్కునే కుటుంబాలు కూడా ఉన్నాయంటే విచారకరం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మన దేశం పుట్టిల్లు. ఇప్పుడు అలాంటి ఉమ్మడి కుటుంబాలున్న వారిని వెతికినా దొరకడం లేదు. అనేక కుటుంబాలు వ్యక్తిగత, చిన్న చిన్న కారణాలతో విచ్ఛిన్నం కావడం మనం చూస్తున్నాం. అలాంటి తగాదాలను కుటుంబ పెద్దలుంటే సర్దిచెప్పి ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగించేవారు.

సమన్వయం లోపించడం వల్ల విడాకులు తీసుకున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. కాబట్టి ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యతను గుర్తించి వీలైనంత ఎక్కువ సమయాన్ని మనవలు మనవరాండ్రతో గడిపే అవకాశం తల్లిదండ్రులకిస్తూ నీతికథలు, పౌరాణిక కథలు చెప్పే అవకాశం ఇస్తూ కలిసి మెలసి ఉండి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను బలపరిచేలా చేద్దాం. గౌరవం, త్యాగం, సంయమనం, ప్రేమ, ఆత్మీయత, ఓర్పు, ఒకరికొకరు సహకరించుకోడం, సంతోషకరమైన ఉమ్మడి కుటుంబానికి మార్గాలుగా భావించి ఈ లక్షణాలను కుటుంబ సభ్యులందరు కలిగి వుండేలా కృషి చేస్తే ఆనంద జీవనం అందించవచ్చు. సమాజానికి విలువలు నేర్పడంలో ‘ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా’ మంచి సాధనాలు. కుటుంబ వ్యవస్థ గురించి మంచి కథనాలు ప్రచురించడం, అలాగే స్ఫూర్తిదాయకంగా చిత్రాలు తీయడం, ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం, చట్టాల రూపకల్పన చేసేటప్పుడు ప్రభుత్వాలు కుటుంబ వ్యవస్థ పటిష్టపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతైనా మార్పు వస్తుందని భావిద్దాం.

గడప రఘుపతిరావు
99634 99282

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News