Monday, January 20, 2025

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

famous fashion designer suicide in hyderabad

కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఇంట్లో సూసైడ్
ప్రముఖలకు డిజైనర్‌గా పనిచేసిన ప్రత్యూష

హైదరాబాద్: జీవితంపై విరక్తి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎమ్మెల్యే కాలనీలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ఉద్యోగ విరమణ చెందిన ఐఆర్‌ఎస్ అధికారి కృష్ణారావు కుమార్తె గరిమెళ్ల ప్రత్యూష ఫ్యాషన్ డిజైన్ కోర్సు అమెరికాలో పూర్తి చేసింది. 2013లో నగరానికి వచ్చి ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తోంది. దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూషది 30వ స్థానం. టాలీవుడ్, బాలీవుడ్, ప్రముఖులకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రత్యూష ఇంట్లో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి వాచ్‌మెన్ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బాత్‌రూంలో ఆత్మహత్య చేసుకుని ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రత్యూష మృతదేహం పక్కనే కార్బన్ మోనాక్సైడ్ సీసాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆవిరిలో కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానస్పద కేసుగా నమోదు చేసుకుని బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కావడంతో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని పోలీసులు తెలిపారు. గత కొంత కాలం నుంచి ప్రత్యూష మానసింగా ఒత్తిడికి గురవుతున్నదని ఆమె స్నేహితులు పోలీసులకు తెలిపారు. తన జీవితం ఇది కాదని, కోరుకున్నట్లుగా జీవితం కొనసాగడంలేదని స్నేహితురాలు రమ్యతో శనివారం తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత రెండు రోజుల నుంచి ప్రత్యూష ఇంటికి ఎవరెవరు వచ్చారనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ప్రముఖుల డిజైనర్…
దేశంలోని టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్ కావడంతో టాలీవుడ్,బాలీవుడ్ తారలు ప్రత్యూషతో దుస్తులను డిజైన్ చేయించుకున్నారు. దీపికా పదుకొనే, కీర్తి సురేష్, శృతిహాసన్, రకుల్‌ప్రీత్‌సింగ్, శ్రియ, నిక్కీగల్రానీ, కృతికర్భంద, ప్రణీత,మాదురిదీక్షిత్, జూహ్లీచావ్లా, ఉపాసన, నిహారిక, కాజోల్, రవీనాటాండన్, నేహాదూపియా, హుమా ఖురేషి,త్రిష, టెన్నిస్ స్టార్ సానియామిర్జా, పలువురు ప్రముఖులకు డ్రెస్‌లు డిజైన్ చేశారు. దక్షిణ భారతంలోని అందరు హీరోయిన్లకు ప్రత్యూష డ్రెస్‌లు డిజైన్ చేశారు. బంజారాహిల్స్‌లో ఆమెకు సొంత బోటిక్ ఉంది.

నేను కోరుకున్న జీవితం ఇదికాదు…
తాను కోరుకున్న జీవితం ఇది కాదని, తల్లిదండ్రులకు తాను భారం కాకూడదని సూసైడ్ నోట్‌లో ఆత్మహత్య చేసుకున్న ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష పేర్కొంది. పోలీసులకు డిజైనర్ ఇంట్లోని బెడ్‌రూములో సూసైడ్ నోట్ లభించింది. ప్రతి రోజు ఏడుస్తున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తల్లిదండ్రులు, స్నేహితులు తనను క్షమించాలని అందులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News