Wednesday, February 26, 2025

‘ఎల్2 ఎంపురాన్’లో ప్రముఖ హాలీవుడ్ నటుడు

- Advertisement -
- Advertisement -

మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌ల బ్లాక్‌బస్టర్ కాంబో ‘ఎల్2 ఎంపురాన్’ అంటూ మార్చి 27న రాబోతోంది. 2019లో ఈ ఇద్దరూ కలిసి చేసిన లూసిఫెర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ లూసిఫర్‌కు సీక్వెల్ అయిన ‘ఎల్2 ఎంపురాన్’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఒక్కో పాత్రను తెలియజేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్ ఈ చిత్రంలో బోరిస్ ఆలివర్ అనే కీలక పాత్రను పోషించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఐకానిక్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో బ్రోన్ పాత్రను పోషించిన జెరోమ్ ఫ్లిన్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

జాన్ విక్ చాప్టర్ 3, సోల్జర్ సోల్జర్, బ్లాక్ మిర్రర్ వంటి అనేక ప్రాజెక్టుల్లో నటించిన జెరోమ్ ఫ్లిన్ ‘ఎల్2 ఎంపురాన్’ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. ఈ మేరకు జెరోమ్ ఫ్లిన్ మాట్లాడుతూ “మాలీవుడ్ కల్చర్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మాలీవుడ్ సంస్కృతిలో భాగం కావడం, ఇక్కడి రుచుల్ని ఆస్వాదించడం నిజంగా ప్రత్యేకమైంది. నాకు ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది. నా యవ్వనంలో నేను ఎక్కువగా ఇక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాల్ని తిరిగాను. ఇండియాలో గడిపిన తరువాత నా జీవితం పూర్తిగా మారిపోయింది.

ఈ సినిమాలో నటించడంతో మళ్లీ నేను నా ఇంటికి వచ్చినట్టు అనిపించింది”అని అన్నారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి చెప్పకుండా, ఖురేషి ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర అని, ప్రేక్షకులు అతని పాత్రను ఇష్టపడతారని ఆశిస్తున్నట్లు జెరోమ్ ఫ్లిన్ పేర్కొన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘ఎల్2 ఎంపురాన్’ లో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంద్రజిత్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయి కుమార్, బైజు సంతోష్ వంటి ప్రముఖులు నటించారు. సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ కలిసి లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపక్ దేవ్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ‘ఎల్2 ఎంపురాన్’ మార్చి 27న మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News