Monday, December 23, 2024

గట్టి మేల్ తలపెట్టిన దంపతులు

- Advertisement -
- Advertisement -

వొట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ అన్న అలనాటి సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు మాటలను ఆదర్శంగా తీసుకున్న పుణె నగరానికి చెందిన భారత వైమానిక దళ మాజీ అధికారి యోగేష్ చిథడే, ఆయన భార్య సుమేధా చిథడేలు దానిని త్రికరణ శుద్ధిగా ఆచరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్ అని మనందరికీ తెలుసు. హిమాలయాలలో తూర్పు కారాకోరం శ్రేణిలో 76 కిలోమీటర్లు పొడవు ఉన్న ఈ ప్రాంతం అతిశీతలమైన గాలులు, భారీ మంచు క్షేత్రాలు, అత్యల్ప ఆక్సిజన్ స్థాయిలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేసవిలో -35 డిగ్రీల కంటే తక్కువగా ఉండే ఉష్ణోగ్రత శీతాకాలంలో -55 డిగ్రీలకు పడిపోతుంది. పాకిస్తాన్ సైన్యం, అక్రమ చొరబాటుదారుల నుండి సియాచిన్‌ను కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం ఏటా వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేస్తుంటే, గడ్డకట్టే దుర్లభమైన శీతల వాతావరణంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పహారా కాసే మన జవాన్ల సాహసం, త్యాగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

2015లో పరమ వీర్ చక్ర అవార్డు గ్రహీత గౌరవ కెప్టెన్ బానా సింగ్ రక్షా బంధన్ సందర్భంగా చిథడే దంపతుల ఇంటిని సందర్శించినప్పుడు సముద్ర మట్టానికి 20 వేల అడుగులకు పైగా గల దుర్లభమైన ఆ యుద్ధ క్షేత్రంలో ప్రాణవాయువు (ఆక్సిజన్) గురించి భారత సైనికులు పడే అగచాట్ల గురించి వివరించారు. దాంతో సైనికుల పరిస్థితి గురించి ఎంతగానో చలించినవారు ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం కనుగొనాలనే దృఢ సంకల్పానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా ఈ దంపతులు అందుకు కార్యాచరణ మొదలు పెట్టి వెనుదిరిగి చూడకుండా 4 అక్టోబర్ 2019న మొదటి ఆక్సిజన్ ప్లాంటును, 15 ఏప్రిల్ 2022న రెండవ ప్లాంటును సియాచిన్ గ్లేసియర్‌లో స్థాపించి తొమ్మిది వేల మంది సైనికులతో పాటు మొత్తం ఇరవై వేల మందికి ప్రాణవాయువు అందిస్తున్నారు.

ఇక్కడ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ స్థాపనకు ముందు, ఒక్కొక్కటి 200 లీటర్ల బరువుండే భారీ ఆక్సిజన్ సిలిండర్లను మొదట చండీగఢ్ నుండి 30,000 అడుగుల ఎత్తులో ఉండే సియాచిన్ బేస్ క్యాంప్‌కు తరలించి ఆ తరువాత అక్కడి నుండి సైనికులు, ఇతర శ్రామికులు తమ వీపుపై వాటిని 22,000 అడుగుల ఎత్తులో ఉన్న ప్రధాన స్థావరానికి రవాణా చేసే వారు. కాగా చిథడే దంపతుల చొరవతో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు నెలకొల్పడంతో భారీ సిలిండర్‌లను తీసుకువెళ్ళడానికి అయ్యే ఖర్చు, శ్రమతో పాటు సమయం కూడా గణనీయంగా తగ్గింది. ఇతరులకు ఏదైనా సలహా ఇచ్చే ముందు దానిని మనం ఆచరించి చూపాలన్న నానుడిని అనుసరించి, సియాచిన్ గ్లేసియర్ వద్ద ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ఒక కోటి పది లక్షల వ్యయం అవుతుందని అంచనా వేసిన సుమేధా చిథడే, తన వంతుగా ఆమె తన ఆభరణాలను అమ్మి లక్షా ఇరవై ఐదు వేల రూపాయలను విరాళంగా అందించారు.

అంతేకాకుండా చిథడే దంపతులు ఈ లక్ష్యసాధన కోసం మహారాష్ట్రలోని పాఠశాలలు, కళాశాలలు, గృహ సముదాయాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విరాళాలు సేకరించారు. వారందరి సహాయ సహకారాలతో నిమిషానికి 224 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ప్లాంట్‌ను సియాచిన్ గ్లేసియర్‌లో స్థాపించగలిగామని పేర్కొన్నారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలైన సుమేధా 1999 నుండి సైనికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. చండీగఢ్ నుండి సియాచిన్‌కు ఆక్సిజన్ సిలిండర్లను తరలించడానికి ఎక్కువ సమయం పట్టడంతో పాటు రవాణా కోసం అధిక ఖర్చు వెచ్చించాల్సి రావడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సియాచిన్‌లోనే ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడం సముచితమని చిథడే దంపతులు భావించారు.దేశ భద్రత ప్రతి పౌరుడి విధ్యుక్త ధర్మమని, ఈ బృహత్ కార్యంలో ప్రతి భారతీయుడు పాలుపంచుకోవాలని, వీలయినంత తక్కువ మొత్తంలో అయినా సరే విరాళాలు అందివ్వాలని, ప్రతి పౌరుడు కేవలం ఒక్క రూపాయి విరాళంగా ఇచ్చినా అది చాలా పెద్ద మొత్తమవుతుందని వారు అభిప్రాయపడ్డారు.

దాతృత్వం ఇంటి నుండే ప్రారంభమవుతుందని విశ్వసించే ఆమె, భారత సైన్యాన్ని తన స్వంత కుటుంబంగా భావిస్తుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా వారి కుమారుడు కూడా భారత సైన్యంలో సేవలందిస్తుండడాన్ని పేర్కొనవచ్చు. వేసవిలో కూడా -35 డిగ్రీల సెల్సియస్ ఉండే అక్కడి ఉష్ణోగ్రత కారణంగా సైనికులు స్నో బ్లైండ్‌నెస్ (ఎత్తైన పర్వత శ్రేణుల్ల్లో మంచుపైపడ్డ వెలుతురు అల్ట్రా వయొలెట్ కిరణాలుగా పరివర్తనం చెంది కళ్ళకు కలిగించే రుగ్మత) ఫ్రాస్ట్ బైట్ (చర్మం, అంతర్లీన కణజాలం గడ్డకట్టడం వల్ల కలిగే గాయం) కు గురయ్యే ప్రమాదంలో 35-40 అడుగుల లోతైన మంచు గుండా దూసుకుపోయే మన సైనికులు కుటుంబాలకు దూరంగా ఉంటూ కూడా అహర్నిశలు దేశ భద్రతను కాపాడడంలో ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించకపోవడాన్ని ఆమె శ్లాఘించారు.

ఇక్కడ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా సైనికులు ఉపయోగించే సిలిండర్లలో ఆక్సిజన్ తిరిగి నింపుకోవడానికి వెసులుబాటు కలిగిందని ఆమె తెలిపారు. తాను తన వద్ద ఉన్న అన్ని ఆభరణాలను విక్రయించలేదని, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, అవసరమైతే మొత్తం ఆభరణాలను విక్రయించి విరాళంగా ఇస్తానని అనడం ఆమె లోని దేశభక్తి, సైనికుల సంక్షేమం పట్ల ఆమెకు గల నిబద్ధతకు నిదర్శనం. 20 జూలై 2022న భర్త యోగేష్ చిథడే మరణించినప్పటికీ, సైనిక కుటుంబాల సంక్షేమార్థం తాను చేస్తున్న కృషిని ఏమాత్రం సడలనివ్వక సుమేధా చిథడే మే 2023 లో మిలిటరీ హాస్పిటల్ ఖడ్కీలోని సాయుధ దళాల అతిపెద్ద వెన్నెముక గాయం కేంద్రం కోసం సోల్జర్స్ ఇండిపెండెంట్ రిహాబిలిటేషన్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక సోలార్ వాటర్ హీటింగ్ ప్లాంట్‌ను, కంప్యూటరైజ్డ్ డైనమిక్ స్టెయిర్ ట్రైనర్‌లను అందించారు.ఆమె ఈ చర్య వెన్నెముక గాయాలతో పలు సందర్భాలలో ప్రాణాపాయ స్థితిలో అవస్థపడుతున్న మన ధైర్యశాలురైన సైనికుల జీవితాల్లో ఆనందం, ఉపశమనం కలిగించడానికి ఆమె పడుతున్న తాపత్రయం ప్రస్ఫుటమవుతుంది.

ప్రత్యేకమైన సోలార్ వాటర్ హీటింగ్ ప్లాంట్ స్థాపన వెన్నెముక సంబంధిత గాయాలతో బాధపడుతున్న సైనికుల సంరక్షణకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. కంప్యూటరైజ్డ్ డైనమిక్ స్టెయిర్ ట్రైనర్ తీవ్ర వైకల్యం ఉన్న రోగులకు శిక్షణ ఇవ్వడానికి, గాయం నుండి కోలుకుని స్థిరంగా నిలబడడానికి, నడకను పునఃప్రారంభించడానికి వీలుకల్పిస్తుంది. ఈ నూతన వసతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్, సోల్జర్స్ ఇండిపెండెంట్ రిహాబిలిటేషన్ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యురాలైన సుమేధా చిథడే, బృందం అచంచలమైన అంకితభావాన్ని ప్రశంసించారు. సైనికుల సంక్షేమం కోసం వారు చేస్తున్న అద్భుతమైన కృషిని ఆయన అభినందించారు. దేశ రక్షణ కోసం సరిహద్దులలో దుర్లభమైన వాతావరణ పరిస్థితులను సైతం లెక్క చేయక, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహించే సైనిక కుటుంబాల సంక్షేమం కోసం చిథడే దంపతులు చేపడుతున్న కార్యక్రమాలు ప్రజా బాహుల్యంలోకి వెళ్లాలని, అది మరింత మంది ప్రజలకు ప్రేరణ కలిగించి హమ్ యహా జాగేంగే తో వో వహా చైన్ సే సోయేంగే (మనం ఇక్కడ మెలకువగా ఉంటే అక్కడ వారు ప్రశాంతంగా నిద్రిస్తారు) అన్న స్ఫూర్తితో విధులు నిర్వహించే మన వీర సైనికుల కోసం తమ వంతు సహాయం చేస్తారని ఆశిద్దాం.

యేచన్ చంద్ర శేఖర్
8885050822

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News