మంగళూరు : ప్రముఖ కన్నడ నవల, నాటిక రచయిత, కవి కూడ్లు తిమ్మప్ప గట్టి సోమవారం మంగళూరులోని తన నివాసంలో మరణించారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. కేంద్ర సాహిత్య అకాడమీ, రాజ్యోత్సవ అవార్డుల విజేత అయిన గట్టి స్వస్థలం కేరళ కాసరగోడ్ జిల్లాలోని కూడ్లు. ఆయన 50 పైచిలుకు నవలలు, వ్యాసాలు, రెండు కవితలు, 50 పైచిలుకు నాటికలు రచించారు.
వాటిలో పిల్లల కోసం రాసిన సుమారు 30 నాటికలను వివిధ భాషల్లోకి అనువదించడమే కాకుండా ఆకాశవాణిలో ప్రసారం చేశారు. ఉడుపిలో కళాశాల లెక్చరర్‌గా కొంత కాలం పని చేసిన తరువాత గట్టి ఇథియోపియాకు వెళ్లారు. అక్కడ ఆయన ఒక ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆయన ఇంగ్లండ్‌లోని ట్రినిటీ, ఆక్స్‌ఫర్డ్ కాలేజీల నుంచి ఇంగ్లీష్‌లో డిప్లొమాలు కూడా పొందారు. భారత్‌కు తిరిగి వచ్చిన అనంతరం ఆయన అధ్యాపక వృత్తిని విడనాడి దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుకు సమీపంలోని ఉజిరెలో వ్యవసాయం చేపట్టారు.