Thursday, January 9, 2025

లౌకిక మానవీయ సాహిత్య స్ఫూర్తి కె.సచ్చిదానందన్

- Advertisement -
- Advertisement -

నాకు ఈ భూమ్మీద ఇక తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే నాకు హెచ్చరిక వచ్చేసింది. ఇక నాకు మిగిలిన కాలాన్ని పూర్తిగా నేను రాయడానికే వినియోగించ దలుచుకున్నా. నా లాప్ టాప్‌తోనే గడపదలుచుకున్నా. నేను ఇప్పటిదాకా పనిచేస్తున్న అన్ని సంస్థల నుండి స్వచ్చందంగా వైదొలగుతున్నా. అయ్యప్ప పాణీకర్ ఫౌండేషన్, అత్తూర్ రవివర్మ ఫౌండేషన్, సాహిత్య అకాడెమీ, దేశీయ మానవికావేది తదితర అన్ని సంస్థల నుండి, విభిన్న సంస్థలు ఇంగ్లిష్ లో మలయాళంలో నాకు అప్పజెప్పిన వివిధ సంపాదక బాధ్యతలనుండీ వైదొలగుతున్నా. నాకు ఈ వయసులో అనూహ్యంగా వచ్చిన ఈ అనారోగ్యం వల్ల నా జీవితం ముందులా ఉండలేదు. ఉండబోదు కూడా. గత ఆరునెలల్లో సంకేతాలు ఎక్కువయ్యాయి. ఇక ఉపన్యాసాలు ఉండవు. ప్రయాణాలుండవు. ఇక నా రాతలకే పరిమితమవుతాను. కవిత్వం రాస్తాను, వ్యాసాలు రాస్తాను, కొన్ని నాటికలు, కథలు కూడా రాయాలి. చుట్టూ ఉన్న మనుషులకన్నా నా లాప్ టాప్ తోనే ఎక్కువ మాట్లాడుతానిక. అక్షరాలు మానవజాతి కనుగొన్న గొప్ప స్నేహితులు. వాటితో మనం అద్భుతాలు సృష్టించొచ్చు. ఇక ఆ పనిలోనే ఉంటాను. నా బహిరంగ జీవితానికిక స్వస్తి చెప్పబోతున్నాను. బుద్ధుడూ, క్రీస్తూ లాంటి మహామహులే తమ ఉపన్యాసాలతో ప్రపంచాన్ని మార్చలేకపోయారు, ఇక నేనెంత? అని ప్రముఖ మళయాళీ కవి కె. సచ్చిదానందన్ రెండు రోజుల కింద ఫేస్ బుక్ వేదికగా ప్రకటించారు. తాను కేరళ సాహిత్య అకాడెమీ అధ్యక్ష పదవి నుండి కూడా వెంటనే తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
ఆధునిక మలయాళీ కవిత్వ వైతాళికుడు కె. సచ్చిదానందన్ నుండి ఈ ప్రకటన వెలువడగానే, దేశవ్యాప్తంగా సాహిత్యకారులు, సాహిత్యప్రేమికులు హతాశులయ్యారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూనే, ఆయా సంస్థల్లో ఆయన లోటుని పూడ్చడం అంత తేలిక కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. మలయాళీ సాహిత్య రంగం, మొత్తంగా భారతీయ సాహిత్య రంగం విచారానికి లోనయింది. ఐతే కె.సచ్చిదానందన్ బహిరంగం గా వేదికలపై కనబడకపోయినా, సాహిత్యం సృష్టించడానికే పూర్తి కాలాన్ని గడుపుతారు అని తెలియడం కొంతలో కొంత సంతోషాన్ని కలిగించే విషయం.
ఆధునిక మళయాళీ సాహిత్యాన్ని, భారతీయ సాహిత్యాన్ని ప్రేమించే అందరికీ కె. సచ్చిదానందన్ చిరపరిచితమైన గొప్ప కవీ, సాహిత్యకారుడూ. ప్రగతిశీల మానవీయభావాల్ని ప్రేమించేవారికందరికీ తన కవిత్వం ద్వా రా, రచనల ద్వారా అత్యంత సన్నిహితులు. గత యాభై ఏళ్లుగా నిర్విరామంగా మళయాలం, ఇంగ్లీష్ భాషల్లో అపారమైన సాహిత్య సృష్టి చేస్తూ అనేక సాహిత్య సంస్థ ల్లో కీలక పాత్ర నిర్వహిస్తూ ప్రగతిశీల భావాలకు మకుటాయమానంగా నిలిచారు.
కేరళ రాష్ట్రంలో త్రిస్సూర్ జిల్లా లోని పుల్లూత్ అనే చిన్న గ్రామంలో 1946 లో కోయంపరంబత్ సచ్చిదానందన్ (కె.సచ్చిదానందన్) జన్మించారు. 1968లో పుల్లూత్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఇంగ్లిష్ ఉపాధ్యానిగా చేరి, తర్వాత 1970లో క్రైస్ట్ కాలేజీ, ఇరింజలకుడాలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసారు. 1992లో స్వచ్చందంగా పదవీ విరమణ చేసి కేంద్ర సాహిత్య అకాడమీ పత్రిక ఇండియన్ లిటరేచర్ పత్రికకు సంపాదకునిగా చేరారు. తర్వాత కేంద్ర సాహిత్య అకాడెమీ కి కార్యదర్శిగా ఎన్నికై 2006 దాకా కొనసాగారు. తన యాభై ఏండ్ల సాహిత్య ప్రస్థానంలో అనేక సాహితీ సంస్థల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో అనేక పదవులు విజయవంతంగా నిర్వహించారు.
1970లో ప్రచురించిన ‘కురుక్షేత్రం’ అనే సాహిత్యవ్యాసాల సంకలనం, ‘అంచుసూర్యన్’ (ఐదు సూర్యులు) అనే కవిత్వ సంకలనాలతో కె. సచ్చిదానందన్ సాహిత్య ప్రయాణం ప్రారంభమైంది. తన సుదీర్ఘ సాహిత్య ప్రయాణంలో 38 కవితా సంకలనాలు ప్రచురించిన కె. సచ్చిదానందన్, జాతీయంగా, అంతర్జాతీయంగా పద్దెనిమిది భాషల్లో తనే సాహిత్యాన్ని ప్రకటించారు. తన సాహిత్యాన్ని తానే ఇంగ్లిష్ లోకి అనువదించారు. తన సాహిత్యం అనేక ఇతర యురోపియన్ భాషల్లోకి కూడా అనువాదమైంది. సాహిత్య విమర్శ, వచన సాహిత్యం, నాటకాలు, యాత్రాచరిత్ర ఇంకా అనేక సాహితీ ప్రక్రియల్లో అపారమైన కృషి చేసి అనేక పుస్తకాలూ, సంకలనాలు వెలువరించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ తదితర అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందా రు. అనేక సంస్థలలో కీలకపాత్రల్లో పనిచేసారు. మళయాళ సాహిత్యరంగంలో మొత్తంగా భారతీయ సాహిత్య రంగంలో చెరగని ముద్ర వేశారు. 2011 లో నోబెల్ సాహిత్య బహుమతికి కూడా తన పేరు పరిశీలనలోకి వచ్చింది. 2007 లో కె,సచ్చిదానందన్ జీవితమూ, సాహిత్యం గురించి ‘సమ్మర్ రైన్’ అనే సినిమా కూడా నిర్మించారు. కె.సచ్చిదానందన్ కవిత్వం ‘శరీరం ఒక నగరం’ పేరుతో తెలుగులోకి ఎల్.ఆర్ . స్వామి అనువదించి సంకలనంగా తెచ్చారు.
తన సాహిత్య ప్రయాణంలో ప్రధానంగా రాడికల్ లెఫ్టిస్ట్ భావజాలం తో ఉన్న సచ్చిదానందన్ ఒక దశాబ్దానికి పైగా తన ప్రాపంచిక దృక్పథాన్ని భావజాలాన్ని మరింత విస్తారం చేసారు. దోపిడీ, అణచివేత, పీడనాల పట్ల మౌలికాభిప్రాయాల్లో తేడాలేమీ లేకున్నా వర్గాన్ని దాటి కులాన్ని, జెండర్ ని, ఇతర అనేక వివక్షలనూ పరిగణన లోకి తీసుకుంటూ, మార్జినలైజ్డ్ సబాల్టర్న్ సమూహాల జీవితాల గురించి ఆకాంక్షల గురించి, పోరాటాల గురించి సాహిత్యం సృష్టించాలి అనే అభిప్రాయంతో ఉన్నారు. తానూ స్యయంగా సృష్టించారు కూడా. ఈ భూమీ, నీరు, గాలి అందరికీ చెందిందని, కేవలం మనుషులకు మాత్రమే కాదని, ఈ ప్రకృతిలో భాగమైన ప్రతి ప్రాణికి ఈ సహజసిద్ధమైన వనరులపై హక్కు ఉంటుందని, అవి అందరికీ సమానంగా చెందాలనే కామన్స్ తాత్విక దృక్పథం తో తానున్నట్టు ఒక ముఖాముఖిలో చెప్పారు. ఈ ప్రపంచాన్ని బలహీనుల దృష్టి నుండి, అణచివేతకు గురైన వారి దృష్టి నుండి చూడాలని అది మనుషులే కానక్కరలేదని తన అభిప్రాయంగా చెప్పారు.
కె.సచ్చిదానందన్ సాహిత్య అకాడెమీలు ప్రభుత్వము నుండి స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు. సాహిత్యకారులు అధికార కేంద్రాలకు దూరంగా ఉంటూ విమర్శనాత్మకంగా ఉండాలని, అది కేంద్రం లోనైనా, తన రాష్ట్రం లోనైనా తానూ అభిమానించే పార్టీ అయినా రచయిత విమర్శించే దృష్టిని, స్వతంత్రత ను కోల్పోకూడదని బలంగా నమ్మి ఆచరించారు. ఐతే గత కొన్ని దశాబ్దాలుగా రచయితకున్న ఆ జాగా క్రమేపీ కుంచించుకుపోతున్నదని కొంత ఆందోళన వ్యక్తం చేసారు కూడా.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న అసహనం, ద్వేషపూరిత భావజాలం ప్రజల సామాజిక జీవనం మీద చాలా ప్రభావాన్ని పడేస్తుందని, క్రమంగా ప్రజాస్వామిక జాగాలు కుంచించుకుపోయి వామపక్ష భావజాలం వెనుకంజ వేస్తుందని అభిప్రాయపడతారు సచ్చిదానందన్. దీనికి దేశంలో పెచ్చరిల్లుతున్న ఫాసిస్టు భావజాలం కారణమైనా, కొంత బాధ్యత వామపక్షవాదులపై కూడా ఉన్నదంటారు.
మెజారిటీ మార్క్సిస్టులు భారతీయ సంస్కృతిని, సంప్రదాయాన్ని, చరిత్రను సరిగా అర్థం చేసుకోలేదు. భారతీయ సమాజపు దేశీయ వాస్తవికతను అర్థం చేసుకోలేదు. ఎప్పుడూ వర్గం గురించే మాట్లాడారు, కులం గురించి చాలా తక్కువ మాట్లాడారు. విశ్వాన్ని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఆధ్యాత్మికత కూడా మానవజీవితానికి చాలా అవసరం. దాన్ని సరైన దృక్పథంతో భారతీయ సామాజిక సాంస్కృతిక నేపథ్యం లో వ్యాఖ్యానించాల్సి ఉండింది. మన జీవితాలలోని వ్యక్తిగత ఆధ్యాత్మికతను సామాజిక ఆధ్యాత్మికతతో సరిగా అనుసంధానించాల్సి ఉండింది. శ్రీ నారాయణ గురు, గాంధీ ఈ విషయం లో భిన్నంగా వ్యాఖ్యానించారు. ప్రజలు మతం పట్ల నమ్మకాల్ని ఎందుకు పెంచుకుంటారో, మతం ప్రజా జీవనంలో ఎందుకింత ముఖ్య పాత్ర నిర్వహిస్తుందో అర్థం చేసుకోవడంలో మార్క్సిస్టులు విఫలమయ్యారనే చెప్పుకోవాలి. వాళ్ళ ఆలోచనకు ఆ ప్రమాణం లేదనే చెప్పాల్సిఉంటుంది. మతం పాత్రను సరిగా అంచనా వేయకుండా, అవగాహనా చేసుకోకుండా, అన్ని అర్థాల్లో కులం నిర్వహించే పాత్రను అవగాహన చేసుకోకుండా భారతీయ సమాజపు నిర్దిష్టతను సాంస్కృతిక నేపథ్యాన్ని అంచనా వేయలేము. సరిగా ఇక్కడే మార్క్సిస్టులు విఫలమయ్యారు. దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకపోతే, మనం ఈ ఫాసిజాన్ని ఎదుర్కోలేము దాన్ని నివారించనూ లేము అంటారు. మార్క్సిస్టులు అంబెడ్కర్ ని పట్టించుకోకుండా పెద్ద పొరపాటే చేసారు. అంబేడ్కర్‌ని అర్థం చేసుకుని ఉంటే భారతీయ నిర్దిష్టత అర్థమయ్యేది. హిందూ మతమా, బౌద్ధం అర్థమయ్యేవి. మనకు సరైన సామాజిక, సాంస్కృతిక ప్రత్యామ్న్యాయం దొరికేది అని తన అభిప్రాయం.
అంతరర్జాతీయ సాహిత్యాన్ని, ముఖ్యంగా లాటిన్ అమెరికన్ సాహిత్యాన్ని, కవిత్వాన్ని మళయాళ ప్రజలకు తన విస్తృతమైన అనువాదాల ద్వారా అందుబాటులోకి తెచ్చిన కె.సచ్చిదానందన్, ఆ సాహిత్యంలో ఉండే సామాజిక సాంస్కృతిక నిర్దిష్టతను బలంగా ఎత్తి చూపిస్తారు. అది మనకు చాల అవసరమని తానూ బలంగా నమ్ముతారు. మన ఇతిహాసాల్లోంచి, పురాణాల్లోంచి, అనేక దృష్టాంతాలని, సామాజిక సాంస్కృతిక అంశాలను కొత్త దృక్పథంతో సబాల్టర్న్ దృక్పథంతో చూడాలి అని భారతీయ చరిత్రలో మార్జిన్స్ లోకి నెట్టివేయబడ్డ వాళ్ళ గురించి వాళ్ళ దృక్పథంతో సాహిత్యం సృష్టించాలి అని ఆయన అభిప్రాయపడతారు. వెల్లువలా ముంచెత్తుతున్న మతతత్వాన్ని సూడో దేశభక్తిని ఎదుర్కోవడానికి అవి గొప్ప సాధనాలని, వాటిని సాహిత్యంలో సమర్థవంతంగా తీసుకురావాలని కె.సచ్చిదానందన్ బలంగా నమ్మి ఆచరించారు. తానూ ఇటీవల ప్రకటించిన నా మాతృభూమి – ఇతర కవితలు అనే సంకలనంలో ఆ పని అద్భుతంగా చేసారు కూడా. తన కవితలను తానే అద్భుతంగా ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసారు కూడా.
బహిరంగ జీవితానికి ఆరోగ్య కారణాల రీత్యా దూరమైనా కె,సచ్చిదానందన్ సాహిత్య వ్యవసాయం ఆపలేదు. పైగా పూర్తికాలాన్ని దానికే కేటాయించబోతున్నారు కూడా. మనం ముందు, ముందు ఇంకా గొప్ప సాహిత్యాన్ని తన నుండి ఆశించవచ్చు. ఫాసిజం పెనుప్రమాదం ముంచుకురావడమే కాక సామజిక సాంస్కృతిక రంగాల్లో ప్రతి సంస్థలో ఫాసిస్టు భావజాలం, మెజారిటీ మతతత్వం, ద్వేషం, అసహనం, అప్రజాస్వామికత చొచ్చుకుపోయి భవిష్యత్తు ప్రమాదకరంగా మారిన ఈ సందర్భం లో ఆధునిక సాహిత్యకారుడూ, గొప్ప కవీ కె.సచ్చిదానందన్ కృషి మనకెంతో ఉత్తేజాన్ని, స్ఫూర్తినీ ఇచ్చి భవిష్యత్తు దిశా నిర్దేశం చేస్తుందనడం లో ఎటువంటి సందేహం లేదు.

నారాయణ స్వామి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News