Friday, September 20, 2024

ఆ జోష్ ఉంటుందా?

- Advertisement -
- Advertisement -

 IPL

 

ఐపిఎల్ కుదింపు ప్రతిపాదనలపై అభిమానుల అనుమానాలు

భారత్‌లో క్రికెట్ పట్ల ఉండే అభిమానం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఐదు రోజులు జరిగే టెస్టు మ్యాచ్‌లు చూడడానికి సైతం అభిమానులు స్టేడియాలకు పోటెత్తే వారు. ఆఫీసుల్లో ఉద్యోగులు పనులు మానేసి క్రికెట్ కామెంటరీ వినడానికి అంకితమై పోయే వారు. ఆ తర్వాత వన్డేలు, ఇటీవలి కాలంలో టి 20 మ్యాచ్‌లు రావడంతో అభిమానుల దృష్టి ఇప్పుడు వాటి వైపు మళ్లింది. మరీ ముఖ్యంగా 2008లో లలిత్ మోడీ బుర్రలో మెదిలిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నీ ఆలోచనతో దేశంలో క్రికెట్ స్వరూపమే మారిపోయిందని చెప్పాలి. ఇప్పుడది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. లక్షల్లో హాజరయ్యే జనం.. టీవీల్లో కోట్లాదిగా వీక్షించే ప్రేక్షకులు… ప్రతి బంతికీ సిక్పర్ పడితే బాగుంటుందనే ఉత్సాహం.. కళ్లు చెదిరే క్యాచ్‌లు.. చివరి బంతి దాకా తేలని ఫలితాలు.. నరాలు తెగే ఉత్కంఠను కలిగించే సూపర్ ఓవర్లు.. అన్నిటికన్నా మించి అర్ధరాత్రి దాకా ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో హోరెత్తే స్టేడియాలు.. ఇవే ఐపిఎల్ అనగానే మనకు గుర్తుకొచ్చే విషయాలు.

వేసవి వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రియుల కళ్లన్నీ ఐపిఎల్ కోసమే ఎదురు చూస్తుంటాయి. లీగ్ ఆరంభానికి కొన్ని వారాల ముందునుంచే ఐపిఎల్ జ్వరం మొదలవుతుంది. దాదాపు రెండు నెలల పాటు అలాగే కొనసాగుతుంది. అయితే ఈ సారి ఆ మజాను అభిమానులు కోల్పోయేలా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికాలో ఒకసారి, ఆ తర్వాత 2014లో పాక్షికంగా యుఎఇలో ఐపిఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తేనే ఎంతో వెలితిగా అనిపించింది అభిమానులకు . అలాంటిది ఈ ఏడాది కరోనా ధాటికి పూర్తిగా ఐపిఎల్ రద్దయిపోతుందేమోననిపిస్తోంది.

ఒక వేళ లీగ్ పూర్తిగా రద్దు కాకపోయినా.. టోర్నీని కుదించినా లేదా ఇంకేమైనా మార్పులు జరిగినా కళ తగ్గడం మాత్రం నిజం. ఐపిఎల్ అంటేనే ప్రేక్షకుల సందడి. స్టేడియాల్లో ప్రేక్షకుల అరుపులు, కేరింతలు, డ్యాన్స్‌లు, చీర్ లీడర్ల విన్యాసాలు, సంగీతాలు, కామెంటేటర్ల సెషల్ కామెంట్లు.. ఇలా మొత్తంమీద మ్యాచ్‌కి మించిన హడావుడి కనిపిస్తుంది. అయితే కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 15 తర్వాత ఒక వేళ మ్యాచ్‌లు జరిగినా ప్రేక్షకులను స్టేడియంలకు అనుమతిస్తారా? అనేది సమాధానం దొరకని ప్రశ్న. అసలు ప్రేక్షకులు లేకుండా బోసి పోయిన స్టాండ్‌లమధ్య స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుందో ఊహకు సైతం అందని పరిస్థితి.

నష్టం వందల కోట్లలో..
ఐపిఎల్‌లో ఒక సీజన్ పూర్తిగా రద్దయితే ప్రత్యక్షంగా 3 వేల కోట్ల రూపాయలు నష్ట వస్తుందని ఓ అంచనా. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించినా, మ్యాచ్‌ల వేళల్లో మార్పులు చేసినా నష్టం భారీగానే ఉంటుంది. ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతించని పక్షంలో టికెట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతారు. స్టేడియంలో ప్రకటనల ఆదాయానికీ నష్ట వాటిల్లుతుంది. మర్చెంటైజ్, ఇతర అమ్మకాలేవీ ఉండవు. ఆటగాళ్లు.. అభిమానులతో ముడిపడ్డ వాణిజ్య కార్యక్రమాలన్నిటికీ దూరమవుతారు. దానివల్ల ఫ్రాంచైజీల ఆదాయానికీ కోత పడుతుంది. ఇక మ్యాచ్‌ల సంఖ్యను తగ్గిస్తే ఆదాయంలో భారీగానే కోత పడుతుంది. సాయంత్రం 4 గంటలకు నిర్వహించే మ్యాచ్‌లకు ప్రేక్షకుల ఆదరణ తక్కువగా ఉంటోందన్న విమర్శల కారణంగానే ఈ సారి ఆ మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించారు.

ఏప్రిల్ రెండో వారంలో మొదలు కావలసిన ఐపిఎల్‌ను మార్చి చివరి వారంలోనే ప్రారంభించాలని నిర్ణయించడానికి అది కూడా ఒక కారణం. అయితే ఇప్పుడు టోర్నీ వాయిదాపడిన కారణంగా తిరిగి ఏప్రిల్ 15 తర్వాత ప్రారంభమైతే ఆ మ్యాచ్‌ల సంఖ్యను పెంచక తప్పదు. రాత్రి మ్యాచ్‌లు తగ్గుతాయి. ఆ మేరకు ఆదాయంలో కోత పడుతుంది. ఈ పరిణామాల కారణంగా బిసిసిఐకి ఐపిఎల్ ప్రసారదారయిన స్టార్ ఇండియా సంస్థ ఏటా చెల్లించే మొత్తాన్ని తగ్గించవచ్చు.

ప్రస్తుతం ఐపిఎల్ ప్రసారాల హక్కుల కోసం స్టార్ సంస్థ బిసిసిఐకి ఏటారూ.3,240కోట్లు చెల్లిస్తోంది. అంటే ప్రతి మ్యాచ్‌కి రూ.54 కోట్లు అన్న మాట. కరోనా ప్రభావం కారణంగా టోర్నమెంట్‌లో మార్పులు జరిగితే ఈ స్థాయిలో సొమ్ములు చెల్లించడం ఆ సంస్థకు గిట్టుబాటు కాదు. ఒక వేళ బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ చెప్తున్నట్లుగా టోర్నమెంట్‌ను కుదిస్తే ఎన్ని మ్యాచ్‌లు ఉంటాయి..వాటిని ఎలా నిర్వహిస్తారనే దాన్ని బట్టి చెల్లింపులు ఉండవచ్చు. ఏ విధంగా చూసినా కరోనా దెబ్బతో ఐపిఎల్‌కు వందుల.. వేల కోట్లలో నష్టం తప్పేలా లేదు.

మినీ ఐపిఎల్?
శనివారం ముంబయిలో ఐపిఎల్ ఫ్రాంచైజీ యజమానులు, బిసిసిఐ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో ఏడు ప్రత్యామ్నాయాల గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. మినీ ఐపిఎల్‌ను నిర్వహించడం అందులో ఒకటి. ఐపిఎల్‌లోని ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లతో ప్లే ఆఫ్ మ్యాచ్‌లు నిర్వహించడం ఇందులో ప్రధాన అంశం. అలాగే ఐపిఎల్‌ను కుదించి తక్కువ మ్యాచ్‌లతో నిర్వహించడం మరో ప్రత్యామ్నాయం. బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీతో పాటుగా కొంతమంది ఫ్రాంచైజీ యజమానులు కూడా ఈ రెండు ప్రతిపాదనలకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.

నెలాఖరులో మరోసారి సమావేశమై కరోనా వైరస్ ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని సమావేశానికి హాజరైన వారు అంటున్నారు. అయితే విదేశాల్లో టోర్నమెంటును నిర్వహించే అంశం సమావేశంలో ప్రస్తావనకే రాలేదని బిసిసిఐ అధికారి ఒకరు స్పష్టం చేయడం గమనార్హం. వాస్తవానికి మన దేశంలోకన్నా విదేశాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఐపిఎల్‌ను నిర్వహించడం కష్టమేనని చెప్పాలి. ఏది ఏమయినా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసినట్లయితే ఈ సారి ఐపిఎల్ జరిగినా మునుపటి జోష్ ఉండదనేది మాత్రం నిజం.

 

Fan suspicions over IPL compression proposals
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News