న్యూజిలాండ్ దేశంలో పర్యటిస్తున్న పాకిస్థాన్.. అక్కడ అత్యంత చెత్త ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే ఐదు టి-20ల సిరీస్‌లో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే పాక్ జట్టు విజయం సాధించగా.. తాజాగా వన్డేల్లో కూడా పాకిస్థాన్ కివీస్ ఆట ముందు తేలిపోయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ పాక్ ఓటమిపాలైంది. ఈ క్రమంలో జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ కెరీర్‌లోనే ఇంత చెత్త ప్రదర్శన లేదని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అయితే టి-20 సిరీస్ చేజారడంపై కొందరు మాజీలు పాక్ యువ టీంని ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు వన్డే సిరీస్ పోయినందుకు సీనియర్లను ఎందుకు అనడం లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా జట్టు సీనియర్ ఆటగాడు బాబర్ ఆజాం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి వన్డేలో 78 పరుగులు చేసిన బాబర్, రెండో వన్డేలో మాత్రం కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. దీంతో ‘సెంచరీ జస్ట్‌లో మిస్ అయింది.. ఇంకా కావాల్సింది.. 99 పరుగులు మాత్రమే’ అంటూ బాబర్‌ని ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. రెండో వన్డేలో అష్రఫ్ (73), నజీమ్ (51) అర్థ శతకాలు చేశారు కాబట్టే పాకిస్థాన్ 200 పరుగులు అయినా చేసిందని.. లేకుంటే పరమ చెత్త స్కోర్‌కి అలౌట్ అయ్యేదని అభిమానులు మండిపడుతున్నారు. కనీసం మూడో వన్డేలో అయినా.. కాస్త మంచి ప్రదర్శన చేసి గౌరవం కాపాడుకోవాలని సలహాలు ఇస్తున్నారు.