Friday, November 22, 2024

మ్యాచ్ గెలిచినా అభిమానులకు నిరాశే..

- Advertisement -
- Advertisement -

Fans were disappointed that day/night Test match ended in two days

 

అహ్మదాబాద్: భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన చారిత్రక డే/నైట్ టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోపే ముగియడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా పేరున్న ఇంగ్లండ్‌తో గులాబి బంతి సమరం ఆసక్తికరంగా సాగుతుందని అందరూ భావించారు. అయితే పిచ్ బౌలర్లకు సహకరించడంతో కనీసం రెండు రోజుల ఆట కూడా పూర్తి కాకుండానే మ్యాచ్ ముగిసింది. స్పిన్నర్ల హవా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇటు రవిచంద్రన్ అశ్విన్, అటు అక్షర్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడంతో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ తక్కువ స్కోరుకే పరిమితమైంది. రూట్, సిబ్లి, స్టోక్స్, బెయిర్‌స్టో వంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లతో కూడిన ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైంది.

తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అయితే 81 పరుగులకే ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ అక్షర్ పటేల్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. ఇక భారత్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి భారత్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. టీమిండియా 45 పరుగుల తేడాతో చివరి ఏడు వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 8 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించాడు. జాక్ లీచ్ కూడా నాలుగు వికెట్లతో చెలరేగి పోయాడు. అయితే భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్నా ఆనందం ఇంగ్లండ్‌కు ఎక్కువ సేపు నిలువలేదు. రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్, అశ్విన్ ధాటికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. దీంతో భారత్‌కు రెండో ఇన్నింగ్స్‌లో విజయం కోసం 49 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. దీన్ని టీమిండియా 7.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండానే ఛేదించింది.

ఊహించలేదు..

ఇక ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. కనీసం నాలుగు రోజుల ఆట సాధ్యమేనని విశ్లేషకులు సయితం అంచన వేశారు. కానీ పిచ్ అనూహ్యంగా ఉండడంతో బ్యాట్స్‌మెన్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక్క రోహిత్ శర్మ, జాక్ క్రాలీ తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా స్పిన్నర్ల ధాటికి ఎదురు నిలువలేక పోయారు. ఇక పిచ్ నుంచి లభించిన సహకారాన్ని ఇరు జట్లకు చెందిన స్పిన్నర్లు సద్వినియోగం చేసుకున్నారు. వరుస క్రమంలో వికెట్లు తీస్తూ బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించారు. ఇదిలావుండగా ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచిందనే ఆనందంకంటే మ్యాచ్ రెండో రోజుల్లోనే ముగియడం అభిమానులకు ఎక్కువ నిరాశ కలిగించింది.

భారత గడ్డపై జరిగిన రెండో డేనైట్ టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని అభిమానులు భావించారు. కానీ వారి అంచనాలు తారుమారు అయ్యాయి. గులాబి బంతి సమరం రెండు రోజుల్లోనే ముగియడంతో అభిమానులు నిరాశతో ఇంటిదారి పట్టారు. ఇంతకుముందు కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్ టెస్టు మ్యాచ్ కూడా రెండున్నర రోజుల్లోనే ముగిసింది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ అయితే కనీసం రెండు రోజుల పాటు కూడా పూర్తిగా సాగకుండానే ముగియడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News