న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించిన దరిమిలా తమ పార్టీ ప్రజల వద్దకు సంపూర్ణ బలంతో వెళ్లి తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న ప్రజా సంక్షేమ, సామాజిక న్యాయ, ప్రగతిశీల అభివృద్ధికి సంబంధించిన హామీలను గురించి వివరిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు.
5 రాష్ట్రాలకు ఎన్నికలను ప్రకటించడంతో బిజెపి, దాని మిత్రపక్షాలకు వీడ్కోలు ప్రకటించినట్లేనంటూ ఖర్గే వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో కాంగ్రెస్ తన పూర్తి బలంతో ప్రజల వద్దకు వెళుతుందని ఆయన ఎక్స్(పూర్వ ట్విటర్) వేదికగా ప్రకటించారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, ప్రగతిశీల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలని ఆయన తెలిపారు.
ఈ ఐదు రాష్ట్రాలలో నవంబర్ 7 నుంచి నవంబర్ 30వ తేదీ మధ్యన వేర్వేరు తేదీలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికలను వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.