తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు కెసిఆర్.. టిఆర్‌ఎస్ అంటే గుర్తొచ్చే పేరు కెసిఆర్.. కానీ తెలంగాణ భవన్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంఎల్‌సి మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో హరీష్‌రావు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ భవన్‌లో ఎవరున్నా లేకపోయినా.. శ్రీనివాస్ రెడ్డి ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా ఉండి పోయేవారని గుర్తు చేశారు. జల దృశ్యం కావొచ్చు.. తెలంగాణ భవన్ కావొచ్చు.. ఎక్కడైనా ఆయన సమయపాలన కచ్చితంగా పాటించేవారని చెప్పారు. జలదృశ్యం టు తెలంగాణ భవన్..ఇదీ శ్రీనివాస్ రెడ్డి ప్రస్థానం అని హరీష్‌రావు ప్రశంసించారు.
శ్రీనివాస్ రెడ్డి ఒక పుస్తకం రాయాలి
తెలంగాణ రావాలనే ఆకాంక్షతో శ్రీనివాస్ రెడ్డి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారని హరీష్‌రావు తెలిపారు. జలదృశ్యంలో పార్టీ పెట్టాక మూడో రోజు శ్రీనివాస్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి కలిసి కెసిఆర్‌ను పరిచయం చేసుకున్నారని, 1999లో వెటర్నరీ ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యాను.. 1969లో తెలంగాణ కోసం పోరాడి జైలుకు వెళ్లాను అని శ్రీనివాస్ రెడ్డి కెసిఆర్‌కు చెప్పారని గుర్తు చేశారు. అప్పుడే బాగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని రామ్మోహన్ రెడ్డి కెసిఆర్‌తో అన్నారని, ఆ నిమిషం నుంచే శ్రీనివాస్ రెడ్డి ఆఫీసు సెక్రటరీగా మారిపోయారని తెలిపారు. పార్టీతో 25 ఏండ్ల ప్రస్థానం శీనన్నది అని, ఆయనంటే అందరికీ గౌరవం అని వ్యాఖ్యానించారు. ఆయన ముఖంలో కోపం గానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ, పరుషపదజాలం కానీ ఆయన నోట ఎప్పుడూ వినలేదు. 25 ఏండ్లలో ప్రేమ, చిరునవ్వు, ఓపిక, మంచినతం చూశాను తప్ప కోపం చూడలేదు అని హరీశ్రావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కెసిఆర్ కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి అని పేర్కొన్నారు. కెసిఆర్ పోరాటం, ఆమరణ నిరాహార దీక్షను దగ్గరుండి చూశారని, 2001 నుంచి ఒడిదొడుకులు, రాష్ట్ర సాధనలో వ్యూహాలు, కృషి, జెఎసి ఏర్పాటుకు సాక్ష్యం కాబట్టి..శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుభవాలతో ఒక పుస్తకం రావాలని కోరారు. ఆయన కెసిఆర్‌కు ఎంతో నమ్మకంగా పని చేశారని చెప్పారని, ఆయన వెళుతేంటే కెసిఆర్ కూడా భావోద్వేగానికి లోనయయ్యారని చెప్పారు. శ్రీనివాస్‌రెడ్డికి తెలంగాణ భవన్‌లో, వరంగల్‌లో వీడ్కోలు సమావేశాలు ఏర్పాటు చేయాలని కెసిఆర్ ఆదేశించారని హరీష్‌రావు తెలిపారు.కెసిఆర్‌కు అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో శ్రీనివాస్ రెడ్డి ఒకరని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూధనా చారి అన్నారు. శ్రీనివాస్ రెడ్డి అమెరికా వెళ్లినా ఎప్పుడు ఏ అవసరమున్నా తమని సంప్రదించాలని,తాము కూడా యుఎస్ అప్పుడప్పుడు వచ్చి యోగ క్షేమాలు తెలుసుకుంటామని మాజీ డిప్యూటీ స్పీకర్,
ఎంఎల్‌ఎ పద్మారావు గౌడ్,మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు ప్రశాంత్ రెడ్డి,జగదీశ్ రెడ్డి అన్నారు. తనకు తగిన గుర్తింపు నిచ్చిన కెసిఆర్‌కు, బిఆర్‌ఎస్ పార్టీకి రుణపడి ఉంటానని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్,మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, బిఆర్‌ఎస్ నేతలు గొంగిడి సునీత, దేవీప్రసాద్, దాసోజు శ్రవణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, చిరుమళ్ల రాకేష్ కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులను బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులను మాజీ మంత్రి హరీష్ రావు వారి వాహనంలో కూర్చోబెట్టి తెలంగాణ భవన్ నుంచి సాదరంగా వీడ్కోలు పలికారు.