Wednesday, January 22, 2025

జాతీయ రాజకీయాల్లో రైతు అజెండా

- Advertisement -
- Advertisement -

భారత దేశం ప్రాథమికంగా గ్రామీణ, వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలో అత్యధిక ప్రజానీకం ఇప్పటికీ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థపై ఆధారపడి ఉన్నారు. దేశంలో ప్రజా ప్రతినిధులతో అత్యధికులు గ్రామీణ నేపథ్యం గలవారే. అయితే స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మన ప్రణాళిక వేత్తలకు ఏనాడూ ప్రాధాన్యత గల రంగంగా ఉండలేదు. అందుకు ప్రధాన కారణం ఇప్పటి వరకు దేశాన్ని ఏలుతున్న వారెవ్వరికీ జాతీయ రాజకీయాలను నిర్దేశిస్తున్న వారెవరికీ వ్యవసాయంపై, గ్రామీణ రంగంపై తగు అవగాహన లేకపోవడమే. ఇప్పటి వరకు గ్రామీణ నేపథ్యం గలవారెవ్వరూ ప్రధానమంత్రి కాలేరు. అటువంటి వారు కనీసం దేశాన్ని పరిపాలిస్తున్న రాజకీయ పార్టీలకు అధ్యక్షులు కూడా కాలేదు. అందుకే జాతీయ రాజకీయ అజెండాలో వ్యవసాయం లేదా రైతులు ఏనాడు కీలక భాగస్వామ్యం కాలేకపోతున్నారు.

ఇప్పటి వరకు రైతులుగా చెప్పుకొనేవారు ఇద్దరే ప్రధాన మంత్రులు కాగలిగారు. వారిలో మొదటిగా చరణ్‌సింగ్ పార్లమెంట్ విశ్వాసం పొందలేక రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ తర్వాత హెచ్‌డి దేవగౌడ్ సంవత్సర కాలం కూడా పదవిలో ఉండలేకపోయారు. వారిద్దరూ అవినీతి ఆరోపణలతో లేదా మరో తప్పు చేసి పదవి కోల్పోలేదు. విధానాల పట్ల నిబద్ధతే వారిని పదవికి దూరం చేసింది. దేశానికి రైతేవెన్నెముక అనిఅందరూ చెబుతూ ఉంటారు. కానీ మన ప్రణాళికలు ఏవీ రైతుల సాధికారికతకు ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు. అటువంటి పరిస్థితులలో కెసిఆర్ ప్రారంభించిన జాతీయ రాజకీయ పక్షం బిఆర్‌ఎస్ రైతు అజెండాగా జాతీయ రాజకీయాలలోకి రావడం హర్షణీయం. తాము కిసాన్ రాజ్యం తెస్తామని చెప్పడం ఆనందం కలిగిస్తుంది.

బిఆర్‌ఎస్ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో, అధికారంలో ఏ మేరకు భాగస్వామి కాగలదో వేరే విషయం. వ్యవసాయరంగ అంశాలపై, రైతు సాధికారికతపై జాతీయ స్థాయిలో ఒక చర్చను ప్రారంభించడానికి, అన్ని రాజకీయ పార్టీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరింపలేని పరిస్థితులు కల్పించడానికి దోహదపడగలదని ఆశిద్దాము. మొదటగా స్వాతంత్య్రం రావడానికి ముందే కాంగ్రెస్ లో వ్యవసాయ విధానం అవసరం అంటూ కిసాన్ అజెండాను ఆచార్య ఎన్‌జి రంగా ప్రతిపాదించగారు. 1930 దశకంలో ఆయ న ఉంచిన అజెండాలో అంశాలే ఇప్పటికీ దేశంలోని రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కావడం గమనార్హం. అంటే సుమారు వందేళ్లుగా విధానపరంగా రైతుల సమస్యలపై ప్రభుత్వాల దృష్టిలో మౌలిక మార్పులు రాలేదని స్పష్టం అవుతుంది.

స్వాతంత్య్రం తర్వాత ఆచార్య రంగా ప్రతిపాదించిన అంశాలపై నెహ్రూ ప్రోత్సాహంతో కాంగ్రెస్ ఓ కమిటీని నియమించినా, ఆ కమిటీ సిఫార్సులను కాంగ్రెస్ ఆమోదించ లేదు. ‘ఆచార్య రంగా పార్లమెంట్‌లో ఉన్నంత కాలం నేను రైతు సమస్యలను ఏ విధంగా నిర్లక్ష్యం చేయగలను?’ అంటూ మాట వరసకు నెహ్రూ భయం నటించినా ఆయన విధానాలు ఎన్నడూ వ్యవసాయానికి అనుకూలం కాదు. ఆచార్య రంగా తర్వాత వ్యవసాయ విధానాలపై అలుపెరుగని పోరాటం చేసింది చరణ్ సింగ్. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తొలి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ పిసి మహలనోబిస్‌ల ఆర్ధిక విధానాలను తీవ్రంగా ప్రతిఘటిస్తూ, గాంధీ ఆలోచనలతో ప్రభావితమై స్వాతంత్య్ర భారతంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రైతుల శ్రేయస్సు ప్రాతిపదికగా దేశం ముందుంచారు.

వ్యవసాయాన్ని, గ్రామీణ రంగాన్ని నిర్లక్ష్యం కావించి, పరిశ్రమలు, వాణిజ్యాలకు నెహ్రూ ఇస్తున్న ప్రాధాన్యతతో కాంగ్రెస్‌లో ఉంటూనే తీవ్రంగా విభేదించారు. స్వాతంత్య్ర భారతదేశంలో మొదటగా వ్యవసాయ రంగానికి కీలక ప్రాధాన్యత ఇవ్వాలని వాదించారు. బలమైన వ్యవసాయ రంగం లేకుండా పారిశ్రామిక రంగం అభివృద్ధికి నోచుకోలేదని ఆయన స్పష్టం చేశారు. నెహ్రూ రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పారిశ్రామికీకరణ ద్వారా వ్యవసాయ అభివృద్ధి సాధ్యం కాదని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రైతుల పిల్లలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 1939లోనే కాంగ్రెస్ పార్లమెంటరీ ప్యానల్ ముందు ప్రతిపాదన ఉంచారు.

ప్రధాన మంత్రిగా ఆయన ఒక సభలో పరిశ్రమలే అభివృద్ధికి దారితీస్తే బీహార్ దేశంలో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం అయి ఉండవలసింది, కానీ వ్యవసాయ ప్రాతిపాదిక గల పంజాబ్ కాదని ఈ సందర్భంగా చెప్పారు. రైతుల అనుకూల విధానాలకు రాజకీయంగా త్యాగాలకు సహితం వెనుకాడలేదు. నెహ్రూ ప్రతిపాదించిన ఉమ్మడి, సహకార వ్యవసాయాన్ని ఆచార్య రంగా, చరణ్ సింగ్ వంటి వారు తీవ్రంగా ప్రతిఘటించారు.ఆ తర్వాత ఇందిరా గాంధీ హయాంలో తీసుకొచ్చిన హరిత విప్లవం సహితం రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి, వ్యవసాయం గిట్టుబాటు ప్రవృతిగా మారడానికి దోహదపడ లేదు. కేవలం గ్రామాల నుండి సంపద పట్టణాలకు వలస వెళ్లేందుకే దారితీసింది.

వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతుధర ఇస్తే రైతుల పరిస్థితులు మెరుగవుతాయని రాజకీయ నాయకులు వాదిస్తుంటారు. కానీ అటువంటి దాఖలాలు ఏవీ లేవు. మద్దతు ధరలు కేవలం సుమారు 25 పంటలకు మాత్రమే ఉన్నాయి. వాటిల్లో కూడా మూడు, నాలుగు పంటలను మాత్రమే మద్దతు ధర లభించని పక్షంలో ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలుచేసి రైతులను ఆదుకోగల వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. ఆ వ్యవస్థలు సహితం ఆచరణలో రైతులుకు వ్యతిరేకంగా, దళారీలకు, వ్యాపారులకు అనుకూలంగా పని చేస్తూ, నిత్యం రైతులు నిలువు దోపిడీకి గురవడానికి దోహదం చేస్తున్నాయి. రైతు అనుకూల వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు గురించి ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఎగుమతి, దిగుమతి విధానాలు రైతు నడ్డి విరుస్తున్నాయి.

రైతుల ఆదాయాలను 2022 నాటికి రెట్టింపు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన గడువు పూర్తయింది. కానీ, ఈ దిశలో ఏ మేరకు సాధించారో మాత్రం చెప్పలేకపోతున్నారు. ద్రవ్యోల్బణంను పరిగణనలోకి తీసుకొంటే గత ఆరేళ్లలో రైతుల ఆదాయం ఇది వరకన్నా పడిపోయినదని స్పష్టం అవుతుంది. మరోవంక, వారి రుణ భారం కూడా పెరిగింది. పెరిగిన వ్యవసాయ ఉత్పత్తుల ధరల కన్నా, వ్యవసాయ ఉపకరణాలు, ఎరువులు, వ్యవసాయ ఖర్చులు దాదాపు రెట్టింపు అయ్యాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులతో అనుసంధానం చేయమని దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నా ప్రభుత్వం పెదవి విప్పడం లేదు.

1991లో తీసుకొచ్చిన ఆర్ధిక సంస్కరణలు దేశంలో బిలియనీర్ల సంఖ్య పెంచడానికి, కొందరు పారిశ్రామిక వేత్తలు ప్రపంచంలోనే కుబేరులుగా మారడానికి దోహదపడిన, గ్రామీణ వ్యవసాయ రంగాలలో చెప్పుకోదగిన మార్పులకు దోహదపడలేదు. దేశ రక్షణ రీత్యా కీలకమైన రక్షణ రంగంలో కూడా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తున్న ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌లోకి మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. పొగాకు, పత్తి, మిరప, పసుపు వంటి వాణిజ్య పరమైన పంటల మార్కెట్‌లోకి విదేశీ వ్యాపారులను అనుమతిస్తే పోటీ పెరిగి రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.

అయితే స్వదేశీ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల వత్తిడులకు లొంగి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు.
ఉల్లి పాయలు నిత్యావసర ఆహార వస్తువులు కావు. పది రూపాయల ధర పెరిగి, రైతులకు కొంచెం ఎక్కువ ఆదాయం వస్తుంది అంటే, వెంటనే ప్రభుత్వం ఖంగారు పడిపోతుంది. విదేశాలకు ఎగుమతులు ఆపివేస్తుంది. ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటుంది. పర్యవసానంగా రైతులకు వచ్చే ఆదాయంకు గండి పడుతుంది. పత్తి, మిరప, పొగాకు వంటి పంటల విషయంలో సహితం రైతులకు అటువంటి దుర్భర అనుభవాలే ఎదురవుతున్నాయి. వ్యవసాయ రంగంలో మూడు దశాబ్దాల తర్వాత సంస్కరణలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సాహసించి, కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకు వస్తున్నారంటే అందరు స్వాగతించారు. అయితే చట్టాలలో కీలక అంశాలలో రైతుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మెగా వ్యాపారుల ప్రయోజనాలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారనే భయాలు వెల్లడయ్యాయి. అటువంటి భయాలను నివృతి చేసే ప్రయత్నాలు జరగలేదు.

అదే సమయంలో మినుములు ధరల కట్టడి పేరుతో విదేశాల నుండి దిగుమతులకు అనుమతి ఇవ్వడంలో రైతుల భయాలు మరింతగా పెరిగాయి. రైతులకు మంచి ధర వచ్చే సమయంలో ప్రభుత్వం ఎగుమతులు చేసే పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రభుత్వంలో రైతుల సమస్యలు అర్ధం చేసుకునే వారు లేరని విషయం స్పష్టమైంది. రైతులకు గిట్టుబాటు ధర లభించడం ద్వారా మాత్రమే వ్యవసాయంకు ప్రోత్సాహం లభించగలదు. అయితే ప్రభుత్వ విధానాలు అన్ని పట్టణాలలో గల ప్రజలకు కారుచవుకగా నిత్యావసర ఆహార వస్తువులు అందుబాటులో ఉంచడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రపంచంలో ఆహార వస్తువుల విషయంలో భారత దేశంలో వినియోగదారులకు సుమారు 800 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఈ సబ్సిడీని ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. తమ ఉత్పత్తులను కారుచవుకగా అమ్ముకొవడం ద్వారా రైతులు ఇస్తున్నారు. ప్రపంచంలో మరెక్కడా ఇంతటి దారుణమైన దోపిడీకి రైతులు గురికావడం లేదు. ఇటువంటి నిలువు దోపిడీ నుండి రైతులకు రక్షణ కల్పించాలి. అప్పుడు మాత్రమే దేశం సుభిక్షం కాగలదు. అందుకనే రైతు అజెండాగా జాతీయ రాజకీయాలలో ఓ మలుపుకు బిఆర్‌ఎస్ దోహదపడితే విప్లవాత్మక మార్పులకు దారి తీయగలదు.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News