Wednesday, January 22, 2025

రైతు కడుపు మండితే, సెటైర్లు ఇదిగో ఇలాగే ఉంటాయి…

- Advertisement -
- Advertisement -

నష్టపోయిన పంటకు పరిహారంగా ప్రభుత్వం ఇచ్చిన డబ్బును చూసి, ఓ రైతుకు వళ్లు మండింది. సెటైర్ల మీద సెటైర్లు వేసి, ప్రభుత్వ పెద్దలు మొహం ఎత్తుకోకుండా చేశాడతను.

మహారాష్ట్రలోని యావత్మల్ సమీపంలో శివానీ గ్రామానికి చెందిన దిలీప్ రాథోడ్ అనే రైతు పత్తి, సోయాబీన్ పంటలు వేశాడు. అయితే అకాల వర్షాలు దెబ్బతీయడంతో ప్రభుత్వం అతనికి పంట నష్టపరిహారం చెల్లించింది. అది ఎంతో తెలుసా? అక్షరాలా 52.99 రూపాయలు. ఎందుకూ పనికిరాని ఈ అరకొర సాయానికి కడుపు మండిన దిలీప్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు కురిపిస్తూ ఓ లేఖ రాశాడు. ఆ ఉత్తరంలో అతను వేసిన సెటైర్లు ప్రభుత్వాన్ని ఒక రకంగా ఇరకాటంలో పెట్టాయి. అతను యావత్మల్ పోలీస్ సూపరింటెండెంట్ ను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో ‘అయ్యా, నాలాంటి పేద రైతుకు ప్రభుత్వం అందించిన 52.99 రూపాయల భారీ పరిహారాన్ని తీసుకువెళ్లేందుకు మా ఇంట్లోని ఇనప్పెట్టెను ఎడ్లబండిపైకి ఎక్కించి, కలెక్టర్ ఆఫీసుకి తీసుకొచ్చాను. ఇక్కడ అందరి కళ్లూ నా డబ్బుపైనే ఉన్నాయి. అందువల్ల నా డబ్బును భద్రంగా మా ఊరికి తీసుకువెళ్లేందుకు కనీసం ఆరుగురు పోలీసులతో భద్రత కల్పించవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వంవారు అందించిన ఈ భారీ మొత్తాన్ని పంట రుణం చెల్లించేందుకు, జబ్బుతో ఉన్న నా భార్యకు చికిత్స చేయించేందుకు వాడుకుంటాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశీస్సులతో ఇన్సూరెన్స్ కంపెనీ నాకు 52.99 రూపాయల పరిహారాన్ని అందజేసినందుకు ధన్యవాదాలు’ అని రాశాడు.

ఈ ఉత్తరాన్ని ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే అనిల్ దేశ్ ముఖ్ విలేఖరులకు చూపించారు. యావత్మల్ ప్రాంతంలో దిలీప్ రాథోడ్ వంటి రైతులు ఎంతోమంది ఉన్నారని, వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే దేశ్ ముఖ్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News