సూర్యాపేట : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన రైతు ఉల్లెందుల లింగయ్య అదే గ్రామానికి చెందిన హౌసింగ్ ఉద్యోగి మాధగోని చంద్రయ్య గౌడ్ వేధింపులకు తాళలేక ఆదివారం తెల్లవారుజామున కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉల్లెందుల లింగయ్య మాదగోని చంద్రయ్య దగ్గర సుమారు 20 సంవత్సరాల క్రితం ఇంటి స్థలాన్ని అప్పటి మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. గత కొంత కాలంగా మేము అమ్మిన స్థలం కంటే ఎక్కువ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నావని గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించి 11లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా పెద్ద మనుషులు ఆరు లక్షలు ఇవ్వాలని తీర్మానం చేయగా అందుకు లింగయయ ఒప్పుకోలేదు.
శుక్రవారం లింగయ్య కొడుకు రాజకు చంద్రయ్య ఫోన్ చేసి ఆదివారం రోజు డబ్బు చెల్లించాలని లేకపోతే గోడ కూల్చి స్థలాన్ని తీసుకుంటానని బెదిరించడంతో లింగయ్య మనస్థాపానికి గురై పొలం దగ్గరకు వెళ్లి కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందడానికి ముందు రోజు గ్రామానికి చెందిన బొల్లం సైదులుతో లింగయ్య మాట్లాడుతూ తనను చంద్రయ్య బెదిరిస్తున్నాడని తనకు చావే శరణ్యమని చెప్పినట్లు తెలుస్తుంది. మృతి చెందడానికి ముందు లింగయ్య తన మృతికి చంద్రయ్య కారణమని ఉత్తరం కూడా రాసినట్లు గుర్తించారు. కొంత మంది విషయం బయటకు రాకుండా సెటిల్మెంట్‌కు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తొంది. పూర్తి ఆరోగ్యంగా ఉండి కూతురు పెళ్లి చేయాల్సిన లింగయ్య చావుకు కారణమైన చంద్రయ్యను అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు.