కిస్తీ కట్టలేదని ఐసిఐసిఐ అధికారుల
దారుణం బ్యాంక్‌లోనే పురుగుల
మందు తాగి ఆత్మహత్య చేసుకున్న
రైతు దేవ్‌రావు ఆదిలాబాద్‌లో ఘటన
మనతెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి: బ్యాం క్ అధికారుల వేధింపులు, నిర్లక్ష్యంతో ఓ రైతు ప్రాణాన్ని బలితీసుకున్న విషాద సం ఘటన ఆదిలాబాద్ పట్టణంలో శనివారం కలకలం రేపింది. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…బేల మండలం, రేణిగుడా గ్రామానికి చెందిన జాదవ్ దేవ్ రావు అనే రైతు పట్టణంలోని రిమ్స్ పక్కన ఉన్న ఐసిఐసి బ్యాంక్ నుంచి తమ భూమిని మా ర్టిగేజ్ చేయించి నాలుగేళ్ల క్రితం మూడున్నర లక్షల రుణాన్ని తీసుకున్నాడు. అప్పటినుంచి క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవల వాయిదా చెల్లించాల్సిన రూ.25 వేలను సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో బ్యాంక్ అధికారులు గ్రామానికి వెళ్లి అతనిని తీవ్రంగా వేధించడంతో ఆవేదన చెంది, శనివారం బ్యాంకుకు వచ్చి, మేనేజర్‌ను కలిసి బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత కొద్దిసేపటికి పురుగుల మందు డబ్బాతో బ్యాంకుకు చేరుకొని, దానిని తాగి అక్కడే కూర్చున్నాడు.
ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీగార్డు, బ్యాంకర్లు అతనిని ఆసుపత్రికి తరలించడంలో తాత్సారం చేయడంతో అక్కడే కుప్పకూలాడు. ఇదంతా అక్కడి సిసి కెమెరాలు రికార్డయింది. ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి సకాలంలో ఆస్పత్రికి తరలించడంలో చేసిన నిర్లక్ష్యం కారణంగా రైతు ప్రాణాలు కోల్పోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. నాలుగేళ్ల క్రితం భూమిని మార్టిగేజ్ చేయించి మూడున్నర లక్షల రుణాన్ని తీసుకున్నాడని, అప్పటినుంచి క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూనే ఉన్నాడని మృతుడి అన్న కుమారుడు జాదవ్ కృష్ణ సోదరుడు జాదవ్ హేమలల్లు తెలిపాడు. తమకు న్యాయం జరగాలని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంఎల్‌ఎ పాయల శంకర్ బ్యాంకుకు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం చేయడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం సరైనది కాదని, ఇకనైనా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా బ్యాంక్ అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు.