Friday, November 15, 2024

రైతు భగవత్ స్వరూపుడు: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నిర్మల్: రైతు భగవత్ స్వరూపుడని,  వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో తొలి ప్రాధాన్యం వ్యవసాయానికే .. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారు. అంబేద్కర్ భ‌వ‌న్ లో సోమ‌వారం నిర్వ‌హించిన‌ వానాకాలం పంట‌ల సాగు సన్నద్ధత- అవ‌గాహ‌న‌ సదస్సు లో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి మాట్లాడారు.  వ్యవసాయానికి నిర్మల్ ప్రాంతం పెట్టింది పేరు అని, ఆదిలాబాద్, పాలమూరు జిల్లాలకు ఎంతో సారూప్యత ఉందని ప్రశంసించారు.  పత్తి పంటకు ఈ సారి మద్దతుధరకు మించి రెట్టింపుగా రూ.12 వేల వరకు ధర పలికిందని, వేరుశెనగ మద్దతుధరకు మించి రూ.9,10 వేల వరకు ధర పలికిందన్నారు.

రైతులు ఈ సారి పత్తి, సోయాబీన్ సాగు మీద దృష్టి సారించాలని,  పత్తి సాగులో రైతులు విడిగా దొరికే విత్తనాలు, హెచ్ టీ కాటన్ విత్తనాలను ఉపయోగించవద్దన్నారు. రైతులు కొనుగోలు చేసిన ప్రతి దానికి ఖచ్చితంగా రశీదు తీసుకోవాలని సూచించారు.  భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఎక్కువగా ఎరువులు, రసాయనాలు వాడొద్దని,  వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులు, రసాయనాలను ఉపయోగించాలన్నారు.  ఎకరాకు 40 కిలోలకు మించి ఎంత యూరియా వేసినా అది వృధా అవుతుందన్నారు.  వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు విస్తృతంగా ఎరువులు, రసాయనాల వాడకంపై అవగాహన కల్పించాలని నిరంజన్ రెడ్డి సూచించారు.  రైతులకు ఒకసారి అవగాహన వస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటారని,  పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులను వాడి భూమిలో సారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలని,  వ్యవసాయాన్ని లాభసాటి చేయడం అంటే పంటల సాగులో పెట్టుబడులు తగ్గించుకోవడం, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయడం, పంటల దిగుబడి పెంచుకోవడం ద్వారా వ్యవసాయం లాభదాయకం అవుతుందన్నారు.

రైతులు స్వంత గ్రామాల్లోనే కాకుండా ఇతర గ్రామాలు, మండలాలు, జిల్లాలు పర్యటించి రైతుల విజయాలను గమనించాలన్నారు.  బియ్యం, కందిపప్పు తర్వాత మినుముల వినియోగం దేశంలో అత్యధికంగా ఉందని,  రైతులు దీని సాగుపై దృష్టి సారించాలన్నారు.  తెలంగాణ రైతుల ధాన్యం కొనలేక కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో సాహసంతో కొనుగోలుకు ముందుకువచ్చారన్నారు.  పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ సాగును రైతులు ఎంచుకోవాలని,  తెలంగాణలో ఈ ఏడాదికి 2 నుండి 2.5 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని,  దేశంలో బైబ్యాక్ గ్యారంటీ ఉన్న ఏకైక పంట ఆయిల్ పామ్ అని, అందుకే దీనిని ప్రోత్సహిస్తున్నామన్నారు.  పంట నాటిన తర్వాత నాలుగేళ్ల వరకు గొర్రెల పెంపకంతో పాటు అనేక అంతర పంటలు సాగుచేయొచ్చన్నారు.  ఎఇఒలతో క్షేత్రస్థాయిలో సమస్యలు, పంటల సాగు, రైతులతో అనుభవాలు, ప్రధాన పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, 2014 కంటే ముందు 2014 తర్వాత తెలంగాణ వ్యవసాయ సాగులో వచ్చిన మార్పులను అడిగి తెలుసుకోవాలన్నారు.

 ఈ కార్యక్రమంలో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ కె.విజ‌య‌ల‌క్ష్మి రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖా శ్యాంనాయ‌క్, రాథోడ్ బాపురావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, క‌లెక్టర్ ముశ్ర‌ఫ్ ఫారూఖీ అలీ, ఆదిల‌బాద్ క‌లెక్ట‌ర్ సిక్తా ప‌ట్నాయ‌క్, నిర్మ‌ల్ జిల్లా రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షులు న‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి, అగ్రోస్ ఎండి రాములు, రైతులు, వ్య‌వసాయ, ఇత‌ర శాఖ‌ల అధికారులు హాజ‌ర‌య్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News