రూ.50 వేల వరకు రైతు రుణమాఫీని లాంఛనప్రాయంగా 15న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్
16 నుంచి రైతుల ఖాతాల్లో జమ, 6లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.2006కోట్లు, బిఆర్‌కె భవన్‌లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటన, మాఫీ మొత్తం రైతులకు చెల్లించడంలో ఎటువంటి ఇబ్బంది పెట్టవద్దని, వేరే ఖాతాల్లోకి సొమ్మును బదలాయించరాదని బ్యాంకర్లకు స్పష్టం చేసిన మంత్రి, మార్గదర్శకాలు జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల 16వ తేదీ నుంచి రైతుల ఖాతాలో రుణమాఫీ నగదు మొత్తం జమకానుంది. రూ.50 వేల వరకు రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నగరంలోని బిఆర్‌ఆర్‌కె భవన్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. 42 బ్యాంకుల అధికారులు భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రూ. 50 వేల లోపు రైతు రుణమాఫీపై కేబినెట్ సమావేశంలో సిఎం ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆగష్టు 15 వ తేదీన సిఎం కెసిఆర్ లాంఛనంగా రూ. 50 వేలలోపు రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారని ఆయన తెలిపారు. ఆగష్టు 16 వ తేదీ నుంచే ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,006 కోట్లు జమ అవుతాయని ఆయన తెలిపారు. బ్యాంకర్లు , ప్రభుత్వ అధికారుల సమన్వయంతో రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అయ్యేలా చూడాలని, దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లకు ఆయన సూచించారు.
రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అవ్వగానే ముఖ్యమంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు సందేశాలు వెళ్లాలన్నారు. రైతు రుణమాఫీతో పాటు కొత్త పంట రుణానికి అర్హులన్న సందే శం తప్పకుండా ఉండాలని మంత్రి సూచించారు. రైతుల ఖాతాల్లో జమ అ యిన రుణమాఫీ మొత్తాన్ని మరే ఇతర ఖాతా కింద జమ చేయవద్దని, రైతులకు ఇబ్బందులు సృష్టించవద్దని ఆయన ఆదేశించారు. రుణ మాఫీ లబ్ధిదారులైన రైతుల ఖాతాలను జీరో చేసి కొత్త పంట రుణం ఇవ్వాలన్నారు.
ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలి
మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతులరుణ మాఫీ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలన్నారు. బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణ మాఫీ మొత్తం చేరేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ తరుపున సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ
రైతు రుణమాఫీకి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఈనెల 15వ తేదీ నుంచి రూ.50 వేలలోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఈ దశలో రూ.50 వేల లోపు రుణాలున్న 6 లక్షల మంది రైతాంగానికి రుణమాఫీ చేయడంలో భాగంగా రూ.1,850 కోట్లను విడుదల చేస్తూ శుక్రవా రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2018లో జారీ చేసిన మార్గదర్శకాలను రుణమాఫీకి ప్రాతిపాదికన తీసుకోనుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు వేర్వేరుగా జిఓ 401, 402 లను జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ పథకంలో భాగంగా ఒక దశ రూ.25 వేల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిన విషయం తెలిసిందే.