కల్వకుర్తి: గిట్టుబాటు ధర రాక కడుపు మండిన రైతులు రోడ్డెక్కారు. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోవడంతో ధర్నాకు దిగారు. ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే పంటకు కనీస ధర లభించడం లేదని పెట్టుబడి కూడా మిగలడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌కు 309 మంది రైతులు 3685 క్వింటాళ్ల వేరుశనగ పంటను అమ్మకానికి తెచ్చారు. అత్యధికంగా 7041, మధ్యంతర ధర 6100, కనిష్టంగా రూ. 4806ను వ్యాపారస్తులు రహస్య టెండర్ ద్వారా ధరలు నిర్వహించారు. వరసలు చెప్పిన ధరలకు భగ్గుమన్న వేరుశనగ రైతులు ఆగ్రహంతో మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ ఆఫీస్ ముందు బైఠాయించారు. మార్కెట్ శాఖ అధికారులు సరైన విధంగా స్పందించకపోవడంతో అటు నుంచి హైదరాబాద్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
నెల రోజుల్లో 2 వేల రూపాయల ధర తగ్గడంతో ఆందోళన చెందిన పల్లీ రైతులు మార్కెట్ అధికారులతో, వ్యాపారస్తులతో వాదనకు దిగారు. మార్కెట్లో వేరుశనగ ధర తగ్గిందని వ్యాపారులు చెప్పడంతో రుచించని రైతులు తీవ్రంగా మండిపడుతూ హైదరాబాద్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. పోలీసులు రైతులను సముదాయించి మార్కెట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. వ్యాపారస్తులతో, రైతులతో, మార్కెట్ అధికారులతో చర్చలు జరిపారు. కనిష్ట ధర ఉన్న వేరుశనగకు రూ.400, మధ్యస్థంగా ఉన్న పంటకు రూ.150, గరిష్టంగా ఉన్న ధరకు రూ.75 చొప్పున ధర పెంచినట్లు మార్కెట్ శాఖ అధికారులు ప్రకటించారు. రైతులు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మాజీ సర్పంచ్ ఆనంద్‌కుమార్, సిఐటియు నాయకులు ఇతర ప్రజా సంఘాల నాయకులు పెద్ద యాదవ్, ఆంజనేయులు తదితరులు రైతుల పక్షాన ధర్నాలో పాల్గొన్నారు.