Wednesday, January 22, 2025

రైతులు దేశ ద్రోహులా?

- Advertisement -
- Advertisement -

రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం కొనసాగుతూ ఉండటం దురదృష్టకరం. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతులను ‘జై కిసాన్’ అంటూ హీరోలుగా చూసిన దేశంలో నేడు ఖలిస్తాన్ మద్దతుదారులుగా చిత్రీకరించే దుస్థితికి దిగజారడానికి మించిన దేశద్రోహం మరొకటి ఉండదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన వివాదాస్పదమైన మూడు రైతు చట్టాల పట్ల చెలరేగిన రైతుల ఆగ్రహ జ్వాలలు సుమారు సంవత్సరం పాటు తీవ్ర నిరసనలకు దారితీయగా, స్వయంగా ప్రధాన మంత్రి జోక్యం చేసుకొని, ఆ చట్టాలను ఉపసంహరించుకొంటున్నట్టు పార్లమెంట్ లో ప్రకటించడంతో ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ గత మూడేళ్లలో ఆ దిశలో ఎటువంటి ప్రయత్నం జరగకపోవడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు.

తిరిగి ఇప్పుడు ‘చలో ఢిల్లీ’ పేరుతో రైతులు ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు రైతులు కొత్తగా ప్రభుత్వం ముందుకు ఈ డిమాండ్లు తీసుకురావడం లేదు. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు వీరిని రెచ్చగొడుతున్నాయంటూ బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా ప్రతిపక్షాలకు అంతటి బలం ఉంటే ఎన్నికల్లోనే తమ ప్రతాపం చూపే ప్రయత్నం చేసేవి గదా! చివరకు కనీసం మద్దతు ధర గురించి కేంద్ర ప్రభుత్వం నియమించిన ‘నిపుణుల కమిటీ’ సభ్యుడు ఒకరు ఒక టివి చర్చలో ఉద్యమిస్తున్న రైతులను ‘దేశద్రోహులు’ అని పేర్కొన్నారంటే ‘రైతు వ్యతిరేక’ వ్యక్తులు లేదా రైతుల సమస్యలపట్ల కనీసం అవగాహనలేని వ్యక్తులు నేడు కీలక స్థలం లో ఉండటంతో పరిస్థితులను అర్ధం చేసుకోలేకపోతున్నారు.
స్వాతంత్య్రం తర్వాత ప్రధాని పదవిలో ఉన్నవారిలో కేవలం ఇద్దరు మాత్రమే నిజమైన రైతులు లేదా వారి ప్రతినిధులు ఉన్నారని చెప్పవచ్చు. వారిలో అగ్రనేత చరణ్ సింగ్. ఆయన ప్రధానిగా పార్లమెంట్ ముఖం చూడకుండానే రాజీనామా చేశారు.

ఆ తర్వాత హెచ్‌డి దేవెగౌడ 11 నెలలకు మించి పదవిలో ఉండలేకపోయారు. మిగిలిన ప్రధానులు ఎవ్వరికీ రైతుల సమస్యలపట్ల సరైన అవగాహన లేకపోవడంతోనే వారిసమస్యలను కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల దృష్టిలో చూస్తున్నారు. అయితే, ఇందిరా గాంధీ ప్రధాని పదవి చేపట్టగానే మొదటి సారిగా అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ‘ఓ భిక్ష పాత్రతో భారత్ ప్రధాని అమెరికాకు వచ్చారు’ అని అక్కడి మీడియా పతాక శీర్షికతో వార్తలు రాయడంతో ఆమె అవమానంగా భావించారు. వెంటనే భారత్‌లో ఆహారోత్పత్తులు పెంచాలని దృఢమైన నిర్ణయం తీసుకొని, ఆహార విప్లవంను పట్టుదలతో సాధించారు. ఈ సందర్భంగా అధిక దిగుబడి వంగడాలు రూపొందించడంలో ఆమెకు బాసటగా ఎంఎస్ స్వామినాథన్ నిలిచారు. ఈ మధ్య ప్రధాని మోడీ దేశ అభివృద్ధికి నాలుగు ‘కులాలు’ తనకు ప్రధానం అంటూ యువత, మహిళలు, పేదలు, రైతులు అని చెప్పడం ద్వారా రైతుల అభ్యున్నతే తన ప్రాధాన్యతగా వెల్లడించారు. అయితే 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రకటించిన ప్రధాని ఇప్పుడా విషయం గురించి మాట్లాడటం లేదు.

మరోవంక, తన ప్రభుత్వం పట్ల రైతులు ఆగ్రహంతో ఉన్నారని గ్రహించి ఎన్నికలముందు హడావుడిగా చరణ్ సింగ్, స్వామినాథన్‌లకు ‘భారత్ రత్న’ లను ప్రకటించారు. కానీ రైతుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని రైతులలో ఇప్పటికీ విశేషమైన ప్రభావం గల చరణ్ సింగ్‌కు ‘భారత్ రత్న’ ప్రకటించడంతో పార్లమెంట్‌కు సొంతంగా ఎన్నిక కాలేక ఇబ్బందిపడుతున్న ఆయన మనుమడు జయంత్ చౌదరి ‘ఇండియా’ కూటమి నుండి నిష్క్రమించి ‘ఎన్‌డిఎ’ కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించారు. తద్వారా బిజెపి రాజకీయంగా లోక్‌సభ ఎన్నికలలో ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అయితే, కనీస మద్దతు ధరతో పాటు ఇతర డిమాండ్లపై ఇప్పటికి మూడు సార్లు కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నాయకులు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. తమ డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు దేశసరిహద్దులను మూసివేస్తూ కంచెలు వస్తున్నట్లుగా ఢిల్లీ చుట్టూ తీవ్రమైన నిర్బంధాలకు దిగుతున్నారు. భారీ ఎత్తున భద్రతా దళాలను మోహరింపచేసి రైతులు కదలకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు.

2020లో రైతుల మధ్య చీలికలు తీసుకొచ్చి, వారిలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు చేరిపోయారంటూ ప్రచారం చేస్తూ ఉద్యమాన్ని అణచివేయడం ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. దాంతో ఇప్పుడు ముందుగానే ప్రభుత్వం అప్రమత్తమై రైతులు అసలు ఢిల్లీకి రాకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం మద్దతు ధరను చట్టబద్ధం చేస్తే ఆహార ద్రవ్యోల్బణం పెద్ద ఎత్తున పెరుగుతుందని, ప్రభుత్వంపై రూ. 10 లక్షల కోట్లమేరకు అదనపు వ్యయం అవుతుందని నిరాధారమైన కథనాలు నేడు మీడియాలో వ్యాపిస్తున్నాయి. భారత్ ను 5 ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థగా, ప్రపంచంలో మూడో పెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుస్తామని చెబుతున్న ప్రధాని మోడీ రైతులను ఆర్ధికంగా బలోపేతం చేయకుండా సాధింపగలరా? ‘సబ్ కా సాత్ … సబ్ కా వికాస్’ తన లక్ష్యంగా ప్రధాని చెబుతున్నారు. దేశ జనాభాలో సగం మంది, అంటే 70 కోట్ల మందికి ఇంకా వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయ కుటుంబాల గురించిన తాజా సర్వే ప్రకారం ఒక్కో కుటుంబం సగటు వార్షిక ఆదాయం రూ. 10,218 మాత్రమే.

వారి వ్యవసాయేతర ఆదాయాలను పరిగణనలోకి తీసుకొని పక్షంలో రోజువారీ ఆదాయం రూ. 27 మాత్రమే. అంటే, దేశంలో అత్యంత పేదవారు రైతులే అని గ్రహించాలి. ప్రభుత్వం 23 పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తుంది. వాటిల్లో కేవలం బియ్యం, గోధుమలు మాత్రమే నియంత్రిత మార్కెట్లు ఉన్నాయి. పత్తి, చెరకు, పప్పుధాన్యాలు పాక్షికంగా కొన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. కేవలం 14% మంది రైతులకు మాత్రమే మద్దతు ధర లభిస్తున్నట్లు ప్రభుత్వం పార్లమెంట్‌లో ఇటీవల తెలిపింది. అంటే 86% మంది రైతులు మార్కెట్ దయాదాక్షిణ్యాలపై, పరోక్షంగా కమిషన్ ఏజెంట్‌పై ఆధారపడి ఉన్నారు. ఈ వ్యవస్థ తమకు లాభదాయకంగా ఉంటే నేడు రైతులు వీధులలోకి రావాల్సి వచ్చి ఉండెడిదికాదు. భారత ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించిన స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అనుసరించే మద్దతు ధరను చట్టబద్ధంగా అందించమని కోరుతున్నాను. ఆ విధంగా చేయడంతో ప్రభుత్వం చెబుతున్న మద్దతు ధర అందుబాటులో లేని 86% మంది రైతుల ఆదాయం పెరుగుదలకు దారితీస్తుంది.

నేడు చాలామంది వితండవాదన చేస్తున్నట్లు రైతుల ఆదాయం పెరగడం ప్రభుత్వానికి భారం కాబోదు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు, అత్యంత బలీయంగా మారేందుకు దారితీస్తుంది. రైతుల కొనుగోలుశక్తీ పెరిగితే అన్ని వ్యాపార రంగాలు పుంజుకుంటాయి. కేవలం జనాభాలో 4 లేదా 5 శాతంగా ఉన్న ఉద్యోగుల జీతాలను 7వ వేతన సంఘం గణనీయంగా పెంచితే వారి కొనుగోలు శక్తీ పెరిగి ఆర్థికాభివృద్ధికి దారి తీస్తున్నట్లు సంబరపడిపోయాము. దేశ జనాభాలో 50 శాతంగా ఉన్న రైతుల కొనుగోలు శక్తీ మద్దతు ధర కారణంగా పెద్ద ఎత్తున పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధి ఊహించనంత వేగవంతం కాగలదని గ్రహించాలి. మద్దతు ధరను చట్టబద్ధం చేయడంతో మన ఆర్థిక వ్యవస్థపై ఉండే సానుకూల ప్రభావాన్ని గుర్తించకుండా, ప్రభుత్వంలోని పెద్దలు, ఆర్ధిక నిపుణులు, మీడియా మార్కెట్‌లపై ఎక్కువగా విశ్వాసం వ్యక్తం చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. లోపభూయిష్టమైన మార్కెట్ ల కారణంగానే దశాబ్దాలుగా మన రైతులు ప్రపంచంలో మరే దేశంలో కనీవినీ ఎరుగనంతటి దోపిడీకి గురవుతున్నారని మరచిపోతున్నారు. రైతుల నిరసనలు కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కావని గ్రహించాలి.

జనవరిలో 17 ఐరోపా దేశాల్లో రైతుల నిరసనలు కొనసాగాయి.ఇంకా స్పెయిన్, పోలాండ్, ఇటలీ వంటి దేశాలలో కొనసాగుతున్నాయి. వారి ప్రధాన డిమాండ్ కూడా వ్యవసాయ ఉత్పత్తులకు నిర్దుష్టమైన ధర కల్పించడమే. అయితే, ఐరోపా దేశాల్లో మాదిరిగా భారత రైతులు ప్రభుత్వమే తమ ఉత్పత్తులు అన్నింటిని కొనుగోలు చేయమని కోరడం లేదు. మార్కెట్‌లలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు నిర్దుష్టమైన సూచికగా ఒక ధరను చట్టబద్ధంగా నిర్ణయించమని కోరుతున్నారు. వారి డిమాండ్లను సానుభూతితో పరిశీలించే ప్రయత్నం చేయకుండా వారిని దేశద్రోహులనో, తీవ్రవాదుల మద్దతుదారులు అనో, ప్రతిపక్షాలు వదిలిన బాణాలనో దుర్మార్గంగా నిందించడం బాధ్యతా రహితమే అవుతుంది. ఈ సందర్భంగా రైతులను నిట్టనిలువుగా దోపిడీకి గురిచేస్తున్న కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతుల డిమాండ్లు సహజంగానే కార్పొరేట్ సంస్థలను కలవరానికి గురిచేస్తున్నాయి. పరిశ్రమలకు ముడి సరుకులను రైతులు సరఫరా చేయాల్సిందే. వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ ధరలు చెల్లిస్తే తమ లాభాలు తగ్గిపోతాయని వారు ఆందోళన చెందడం సహజమే.

అందుకనే వారు రైతుల ఉద్యమం పట్ల విష ప్రచారం సాగిస్తున్నారు. వారి కుట్రలో ప్రభుత్వం, మీడియా భాగస్వామి కావడం దేశ ప్రయోజనాల దృష్ట్యా సమంజసం కాదని గ్రహించాలి. కేవలం కార్పొరేట్ కంపెనీల విచ్చలవిడి లాభాలను కొనసాగేటట్లు చేయడం కోసం దేశ జనాభాలో సగం మందిగా ఉన్న రైతులను మరింత పేదలుగా మార్చేందుకు ఒక దేశంగా సిద్ధపడాలా? రైతులు దుర్భర జీవనం సాగిస్తుంటే మనది ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ కలిగే ప్రయోజనం ఏమిటి? ఇవే నేడు దేశం ముందున్న మౌలిక ప్రశ్నలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News