Monday, December 23, 2024

కేంద్రం వల్లనే రైతులకు ఇక్కట్లు!

- Advertisement -
- Advertisement -

దేశ ప్రజల అవసరాలకు ఎంత మేరకు ఆహార ధాన్యాల అవసరం అవుతాయో కూడా మన కేంద్ర ప్రభుత్వం దగ్గర సరైన అంచనాలు లేవంటే, మోడీ పరిపాలన ఎంత అసమర్ధగా, ఎంత అధ్వానంగా పాలిస్తుందో దేశ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వంలో ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అంత అయోమయం మంత్రి మనకు ఎంత గాలించినా, ఈ దేశంలో కాదు గదా మరే దేశంలో కూడా దొరకడు. ఈ పెద్ద మనిషి రెండు, మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు మాటలు మార్చాడు.ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, బిఆర్‌ఎస్ ఎంపిలు ఎన్ని సార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ.. ‘మా రాష్ట్రంలో వరి పంట విస్తారంగా పండింది, కనుక దయ చేసి మీ ఎఫ్‌సిఐ ద్వారా ఆ ధాన్యాన్ని సేకరించవలసిందిగా’ అనేక సార్లు విజ్ఞప్తులు చేశారు. అప్పుడు ఇదే కేంద్రమంతి పీయూష్ గోయల్ 3, డిసెంబర్ 2021న, ఏ మన్నాడు అంటే ‘మా దగ్గరే అవసరానికి మించి గోదాముల్లో ధాన్యం నిల్వలు నాలుగు సంవత్సరాలకు సరిపడా ఉన్నాయనీ డాంబికాలు పలికాడు. పైగా మీ పంటను బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోండి’ అని హేళనగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఉచిత సలహా కూడా ఇచ్చాడు. అలాగే తెలంగాణలో మర ఆడించిన బియ్యం తీసుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరితే, కేంద్రం అనేక సార్లు కొర్రీలు పెట్టి నామమాత్రంగా కొనుగోలు చేసింది.

ఇప్పుడు బియ్యం కొరత ఏర్పడింది, కనుక బియ్యం కావాలని గగ్గోలు పెడుతున్నది. పైగా రైతులు తమ ధాన్యాన్ని అవసరం ఉన్న పొరుగు రాష్ట్రాలకూ, ఇతర దేశాలకు ఎగుమతులు చేయకుండా నిషేధం విధించింది. వాస్తవానికి ఇప్పుడు అమెరికాలో బియ్యం, గోధుమల నిల్వలు తరిగిపోయాయి. ముఖ్యంగా మన ప్రవాస తెలుగు ప్రజలకు బియ్యం కొరత ఏర్పడింది. ఇప్పుడు మన రైతులు అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలకు బియం ఎగుమతి చేస్తే మన తెలుగు రైతులకు మంచి లాభాలు వస్తాయి. ఈ తరుణంలో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించటాన్ని రైతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల రైతుల ప్రయోజనాలు దెబ్బ తిన్నాయి.

గతంలో మన కేంద్ర వ్యవసాయ మంత్రి పీయూష్ గోయల్ దేశంలో రైతులు పండించే వరి ధాన్యానికి అంతర్జాతీయంగా మార్కెట్ లేదు కనుక ఒక గింజ ను కూడా తెలంగాణ నుంచి తాము సేకరించేది లేదనీ ‘కరాఖండీ’ గా చెప్పాడు.పైగా వరి పండించ వద్దనీ సలహా కూడా ఇచ్చాడు. దానితో మన రైతులు కూడా వరి సాగును సగానికి తగ్గించారు.ఇప్పుడు దేశ, విదేశాల్లో వరికి బాగా డిమాండ్ పెరిగింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముందు చూపు లేని మోడీ సర్కార్ ‘ప్రజల ఆకలి’ తో ఆటలు ఆడుకొంటుంది. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే ధాన్యం ఉత్పత్తిని 200 శాతం పెంచగలిగింది. అలాంటప్పుడు కేంద్రం తలచుకుంటే ఇది ఎందుకు సాధ్యం కాదని? రైతులు ఒక ప్రక్క, వినియోగదారులు మరో ప్రక్క ప్రశ్నిస్తున్నారు. అలాగే, 2౦22 మార్చి 24 న ‘మీ రాష్ట్రంలోని ప్రజలకు నూకల తినటం అలవాటు చేయండి. అంతేకాని మేము నూకలు సేకరించే ప్రసక్తే లేదు’ అని ఇదే అసమర్ధ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ బీరాలు పలికాడు. అర్ధ సంవత్సరం దాటకుండానే నూకల ఎగుమతిపై కూడా నిషేధం విధించాడు.

తిరిగి జులై 6, 2022న ‘దేశంలో వరి సాగు తగ్గింది. భవిష్యత్తులో బియ్యం కొరత ఏర్పడుతుంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార కొరత రాకుండా మీ రైతులను వరి సాగు చేసేలా ప్రోత్సహించండి’ అని నాలుక మడత తిప్పాడు. ఎప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికీ అర్ధం కాదు. కేంద్ర మంతి ఇంత అయోమయంలో ఉంటే ఏలా? ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం బాస్మతియేతర బియ్యం ఎగమతిపై 20 శాతం పన్నును విధించింది. దీనిపై విమర్శలు రావటంతో ఆ నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అనాలోచిత, అసమర్ధ నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రాలకు పెను శాపం గా మారనుంది. ఎగుమతి నిషేధించిన కొన్ని రకాలను తెలంగాణలో అధికంగా పండిస్తున్నారు. వీటిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తారు. తద్వారా రైతులకు మద్దతుకు మించి ధర లభిస్తున్నది. కానీ ఇప్పుడు ఎగుమతులు నిషేధం విధించడంతో వ్యాపారులు అధిక ధర వెచ్చించి ఈ రకం ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. దీంతో రైతులను నష్టపోయే ప్రమాదం ఉందని వాదాన్ని వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తత్తరపాటు నిర్ణయాలు దేశంలోని భారతీయులనే కాకుండా విదేశాల్లో ఉంటున్నటువంటి భారత పౌరులను కూడా తీవ్ర బాధలకు గురిచేస్తుంది. బియ్యం ఎగుమతి నిషేధం విధించడంతో అమెరికాలోనే భారతీయులకు ముఖ్యంగా బియ్యం అధికంగా తినే తెలుగువారు హాహాకారాలు చేస్తున్నారు. ఇక ముందు బియ్యం దొరక్కపోవచ్చు అన్న భయంతో షాపింగ్ మాల్స్‌పై పడి బస్తాలకు, బస్తాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతలలో మాల్స్‌లో బియ్యం నో స్టాక్ అని బోర్డులు కనిపిస్తున్నాయి. అనేక మాల్స్‌లో బియ్యం కొనేందుకు ప్రజల కిలోమీటర్ల దూరంలో నిలబడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అమెరికాలోని ఓహీయోలోని మేషన్ పట్టణంలో ఉన్న స్టోర్లలో ‘ఒక కొనుగోలుదారునకు ఒక్కటే బియ్యం బ్యాగు విక్రయిస్తామని’ షరతు విధించారు. బాస్మతి రైస్‌తో పాటు అన్ని రకాల బియ్యం శుక్రవారం కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయని మాల్స్ యజమానులు చెబుతున్నారు. బియ్యం కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడటంతో మాల్స్‌లో రెండు రోజుల్లోనే బియ్యం ధరలు 11 శాతం పైగా పెరిగాయి. భారతీయులు అత్యధికంగా ఉండే టెక్సాస్‌లో 20 పౌండ్ల సాధారణ బియ్యం సంచి 34 డాలర్లకు అంటే (రూ.2,787. 68) రూపాయలకు అమ్ముతున్నారని ఓ కొనుగోలుదారుడు వాపోయాడు. భారత్ బియ్యం ఎగుమతులను నిషేధించడం ప్రపంచం మొత్తంపై ప్రభావం పడుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. అత్యధికంగా బియ్యం ఉత్పత్తిదారు అయినటువంటి చైనాలో కూడా వాతావరణం అనుకూలించక దిగుబడి బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తెలివిగా, జాతీయ, అంతర్జాతీయ పంటలపై దృష్టిపెట్టి మన రైతుల పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించేలా చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని గుర్తెరగాలి.

డా. కోలాహలం రామ్ కిశోర్ , 9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News