Wednesday, January 22, 2025

రైతన్నలారా తస్మాత్ జాగ్రత్త..!

- Advertisement -
- Advertisement -

రఘునాథపాలెం : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో రైతన్నలకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌పై విషం చిమ్మిన రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్‌లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ ఊరేగించి దహనం చేసి, తీవ్రంగా ఖండించారు. నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఆర్‌జేసి కృష్ణ, బి. రెడ్డి, నాగచంద్రారెడ్డి తదితరులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే చిమ్మ చీకటి అనే విషయాన్ని మరోసారి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేశారని, ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో రైతు సంక్షేమ పాలన అందించే దిశగా రైతుబంధు, విత్తనాలు, ఎరువులు, ఉచిత విద్యుత్ మరెన్నో సదుపాయాలతో రైతులను ప్రోత్సహిస్తూ యావత్ దేశంలోనే అత్యధిక వరి పంట సాగును సృష్టించి రైతు ప్రోత్సాహం కొనసాగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

రేవంత్‌రెడ్డి పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలు అంటున్నారన్నారు. ఈ రాష్ట్రంలో రైతులను అవహేళన చేస్తూ 24 గంటల కరెంట్ రైతులకు వద్దు, మూడు గంటల కరెంట్ రైతులకు సరిపోతుందని మాట్లాడటం పిసిసి ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి రైతులపై ఉన్న చిత్తశుద్ది తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే రైతులకు పవర్ కట్ అవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో రాత్రి కరెంట్ వలన కరెంట్ షాక్‌లు పాముకాటులు వంటి అనేక ఘటనలతో రైతులు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. రేవంత్‌రెడ్డి మాటలతో కాంగ్రెస్ పార్టీ రైతులకు వ్యతిరేకి అని మరోసారి ఋజువైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ దళారుల కోసం, బిజేపి పార్టీ ఆదాని, అంబాని కోసం పనిచేస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు కరెంట్ కోతలు ఎత్తివేయడం జరిగిందన్నారు.

విద్యుత్ పంపిణీ కోసం పెద్ద ఎత్తున సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బోర్లు బావుల ద్వారానే ఎక్కువ వ్యవసాయం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే రాష్ట్రం ఏర్పడే నాటికి 19 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండేవని, ఆరు లక్షల 89 వేల కనెక్షన్లు అదనంగా మంజూరు చేయటం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు 25 లక్షల 92 వేల కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. దేశంలో మరే రాష్ట్రం ఇలా ఉచిత విద్యుత్ 24 గంటలు ఇవ్వటం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితులు 2014లో ఒప్పంద సామర్ధం, 7,778 మెగావాట్ల నుండి నేడు 16,623 మెగావాట్లకు పెంచుకోగలిగామన్నారు. ఈ రీతిలో పెద్ద ఎత్తున ట్రాన్స్‌కో డిస్కౌంట్లకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించటం వలన ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వగలుగుతున్నామన్నారు. నీచ సంస్కృతి కలిసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు కొత్తపల్లి నీరజ, మందడపు లక్ష్మి, దండ జ్యోతిరెడ్డి, నాగండ్ల కోటేశ్వరరావు, షేక్ మగ్బుల్, కూరాకుల వలరాజు, పసుమర్తి రామ్మోహన్, సుడా డైరెక్టర్లు దొంగల తిరుపతిరావు, దేవ భక్తుని కిషోర్, మైనార్టి జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు తొగరు భాస్కర్, మహిళ నగర అధ్యక్షులు తన్నీరు శోభారాణి, నగర ప్రచార కార్యదర్శి, షకీనా, టిఏటియు ఆటో యూనియన్ అధ్యక్షులు పాల్వంచ కృష్ణ, కార్మిక సంఘం అధ్యక్షులు పాషా, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాకలపాటి శేషగిరి, రుద్రగాని ఉపేందర్, కన్నం ప్రసన్న, కృష్ణ, మాటేటి నాగేశ్వరరావు, చిరుమామిళ్ళ నాగేశ్వరరావు, డి. రవి నాయక్, పతిపాక రమేష్, లక్ష్మణ్ గౌడ్, ముజాహిద్, సలీం, కంచర్ల దయాకర్, లింగరాజు, ఎర్ర అప్పారావు, మిట్టపల్లి రవి, మాటేటి కిరణ్, బలుసు మురళీకృష్ణ, జక్కుల వెంకట రమణ, డోలే సాయికిరణ్, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, ఆటో యూనియన్ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News