న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టి ఆరు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 26న దేశ వ్యాప్తంగా బ్లాక్‌డే పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీనిపై సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపునందుకుని 12 ప్రధాన ప్రతిపక్షాలు తమ మద్దతు ప్రకటించాయి. సోనియా గాంధీ (కాంగ్రెస్ ), దేవెడౌడ (జెడిఎస్)శరద్‌పవార్ (ఎన్‌సిపి),మమతాబెనర్జీ (టిఎంసి), ఉద్ధవ్ థాక్రే(శివసేన) స్టాలిన్ (డిఎంకె) హేమంత్ సోరెన్ (జెఎంఎం) ఫరూక్ అబ్దుల్లా (జెకెపిఎ) అఖిలేష్ యాదవ్ (ఎస్పి) తేజస్వియాదవ్ (ఆర్జెడి) డి రాజా (సిపిఐ)సీతారాం యేచూరి (సిపిఎం) సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు. కరోనాకు బాధితులవుతున్న రైతులను రక్షించడానికి వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలని, అలా చేస్తేనే భారత ప్రజలకు వారు అన్నం అందించ గలుగుతారని తాము సంయుక్తంగా ప్రధాని మోడీకి మే 12న విజ్ఞప్తి చేశామని ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతుధరకు చట్టపరమైన రక్షణ కల్పించాలని ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల మేరకు సంయుక్త కిసాన్ మోర్చాతో ప్రభుత్వం చర్చించాలని కోరారు.