Sunday, January 19, 2025

హర్యానాలో రైతుల ఆందోళన..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పొద్దుతిరుగుడు పంటకు సరైన కనీస మద్దతుధర కల్పించలేదని నిరసిస్తూ హర్యానా రైతులు సోమవారం ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారి 44 ని దిగ్బంధం చేశారు. హర్యానా ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయం తమకు సంతృప్తి కల్పించలేదని వారు నిరసన వ్యక్తం చేశారు. కురుక్షేత్ర జిల్లా పిప్లి గ్రామం వద్ద మహాపంచాయత్ నిర్వహించి జాతీయ రహదారి 44ని దిగ్బంధం చేయడానికి రైతులు నిర్ణయించారు. దీంతో ఢిల్లీ ఛండీగఢ్ రూట్ లోని ట్రాఫిక్‌ను మళ్లించ వలసి వచ్చింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రైతు నాయకులు పొరుగు రాష్ట్రాల రైతు నేతలు పిప్లి ధాన్యం మార్కెట్ వద్ద జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఎంఎస్‌పి దిలావో, కిసాన్ బచావో అంటూ నినాదాలు చేశారు. భవంతర్ భర్పాయి యోజన (బిబివై) అనే ధర వ్యత్యాస చెల్లింపు పథకం కింద 36414 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటను 8528 మంది రైతులు పండించారు.

వీరికి మధ్యంతర సహాయంగా రూ.29.13 కోట్లను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ శనివారం డిజిటల్ రూపంలో విడుదల చేశారు. అయితే రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది మొదట్లో బిబివై పథకం కింద పొద్దుతిరుగుడు పంటను చేరుస్తామని ప్రకటించింది. ఈ పథకంలో కనీస మద్దతు ధర రాకుంటే ధర వ్యత్యాస పథకం కింద డబ్బు చెల్లిస్తారు. కానీ ఈ పథకం కింద కనీస మద్దతు ధర కన్నా తక్కువగా అమ్ముడు పోయే పొద్దుతిరుగుడు పంటకు క్వింటాలుకు రూ. 1000 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. దీనికి రైతులు సంతృప్తి పడడం లేదు. కనీస మద్దతు ధర కింద క్వింటాలుకు రూ. 6400 వంతున చెల్లించి పంటను కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రెజ్లర్ల ఆందోళనకు రాష్ట్ర రైతుల మద్దతును పొందిన ఒలింపియన్ రెజ్లర్ బజరంగ్ పునియా ఈ మహాపంచాయత్‌కు పాల్గొనడం విశేషం.

కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ సుదీర్ఘకాలం రైతుల ఆందోళనకు నాయకత్వం వహించిన రైతునేత రాకేష్ తికాయత్ కూడా పాల్గొన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలు, రైతులపై పోలీస్‌ల దౌర్జన్యాలు నిరసిస్తూ మహాపంచాయత్ లో రైతు నేతలు ప్రసంగించారు. కనీస మద్దతు ధరకు పొద్దుతిరుగుడు విత్తనాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల షాహబాద్ రైతుల ఆందోళనలో అరెస్టు చేసిన రైతునేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News