Friday, November 15, 2024

ఎంపి అర్వింద్‌కు ప్రతిఘటన

- Advertisement -
- Advertisement -

Farmers blocking MP Arvind

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత
పార్లమెంట్ సభ్యుడి కారుపై దాడి
పసుపుబోర్డుపై చేసిన తప్పుకు అనుభవించాల్సిందే :
మంత్రి ప్రశాంత్‌రెడ్డి

మన తెలంగాణ/ఆర్మూర్ : నెగ్గిన ఐదు రోజుల్లోనే జిల్లాకు పసుపు బోర్డు తెస్తానన్న ఎంపి ‘గో బ్యాక్’ అంటూ నందిపేట మండల పర్యటనకు వచ్చిన నిజామాబాద్ ఎంపి అరవింద్‌కు రైతుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. మంగళవారం ఎంపి అరవింద్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లి పర్యటనకు వెళుతుండగా ఇస్సాపల్లి వద్ద రైతులు, టిఆర్‌ఎస్ నాయకులు అడ్డుకుని ఎంపి అరవింద్ గో బ్యాక్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపి అరవింద్ ఎన్నికలకు ముందు తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి రైతులకు మోసం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా అరవింద్ రాసి ఇచ్చిన బాండ్ పేపర్‌ను చూపిస్తూ ఈ బాండ్‌పేపర్‌కు ఎంపి ఏమి సమాధానం చెప్పాలని.. లేనిపక్షంలో రైతులతో కలిసి ఎంపి పర్యటనలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా, టిఆర్‌ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో వచ్చి ఎంపిని అడ్డుకోవడంతో అప్రమత్తమైన పోలీసుల ఎంపి అరవింద్‌ను చాకచక్యంగా వెనక్కి పంపించారు. ఆందోళనలో రైతులు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

అరవింద్ ధర్నా , రాస్తారోకో
కాగా, తనపై రైతుల ముసుగులో కొంతమంది టిఆర్‌ఎస్ నాయకులు దాడి చేశారంటూ మామిడిపల్లి చౌరస్తాలో ఎంపి అరవింద్ రాస్తారోకోకు కూర్చునారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఎంపిగా జిల్లాలో అభివృద్ధి పనులకు వెళుతుంటే టిఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం సబబుకాదన్నారు. తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను విచ్చలవిడిగా కొటడం, వాహనాలను ధ్వంసం చేయడాన్ని పోలీసులు అడ్డుకోకపోవడం శోచనీయమన్నారు. టిఆర్‌ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టకపోవడం తగదని అరవింద్ అన్నారు.

ఇదిలా ఉండగా.. ఎంపీ అరవింద్‌పై రైతులు జరిగిన దాడిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఎంపీ అరవింద్‌పై దాడి చేసింది పసుపు రైతులని, బండ్ పేపర్ మీద రాసి పసుపు బోర్డ్ తెస్తానని గెలిచాడని, రైతులకూ పసుపు పంట చేతికి వచ్చిందన్నారు. పసుపు బోర్డు రాకపోవడంతో రైతుల ఉగ్రరూపం బయటపడుతోందన్నారు. చేసింది పాపం.. ఆయన చేసిన తప్పుకు పరాభవం అనుభవించాల్సిందేనని చెప్పారు. పోలీసులు ఉదయం నుంచి ఎంపీకి రక్షణ కల్పిస్తున్నారని మంత్రి ప్రశాంత రెడ్డి తెలిపారు. కాగా, ఎంపి అరవింద్‌ను అడ్డుకున్నది తాము కాదంటూ రైతు సంఘాల నేతలు పేర్కొనారు. అరవింద్‌పై దాడికి రైతులకు ఎటువంటి సంబంధంలేదని రైతు నేతలు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News