రబీ పంట చేతికొచ్చే సమయంలో నిర్మల్ జిల్లా, కడెం మండలంలోని సదర్‌మాట్ ఆయకట్ట నుండి కాలువ ద్వారా సరఫరా అయ్యే సాగునీటిని నిలిపివేస్తారేమోనని ఆందోళన చెందిన రైతులు బుధవారం ధరా, రాస్తారోకో చేపట్టారు. మండలంలోని లింగాపూర్, సారంగాపూర్, ఎల్లాపూర్, మాసాయిపేట, ఎలగడప, నచ్చన్న ఎల్లాపుర్ మల్లన్నపేట్, పాత మద్దిపడగ, కొత్త మదిపడగ, పెద్దూరు తండా, చిట్యాల, వకీల్ నగర్ తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు రాస్తారోకో నిర్వహించారు. పంటలు చేతికొచ్చే వరకు సాగునీటిని సరఫరా చేయాలని, సదర్‌మాట్ నుండి సాగునీటిని నిలిపివేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. సదర్‌మాట్ ఆయకట్ట అధికారులు బుధవారం నుండి సాగునీటిని నిలిపివేస్తారన్న విషయం తెలుసుకున్న రైతులు వరి పంటను కాపాడుకోవడం కోసం ఆందోళన చేపట్టారు.
ఈ నెలాఖరు వరకు సాగునీరు అందిస్తేనే పంట చేతికి వస్తుందని, ఇందుకు సరియైన హామీ వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న కడం తహసిల్దార్ ప్రభాకర్, ఎస్‌ఐ కృష్ణసాగర్ రెడ్డి ధర్నా చేస్తున్న రైతులను ఆందోళన విరమించాలని కోరారు. అయితే, సాగునీరు విడుదలపై స్పష్టమైన హామీ ఇస్తేనే విరమిస్తామని స్పష్టం చేయడంతో ఎస్‌ఐ ఫోన్‌లో స్థానిక ఎంఎల్‌ఎ ఎడ్మ బొజ్జు పటేల్‌కు సమాచారం అందించారు. ఎంఎల్‌ఎ కూడా ఫోన్ ద్వారా రైతులతో మాట్లాడి, పంట చేతికి వచ్చేవరకు సాగునీటిని విడుదల చేయిస్తానని, వచ్చేనెల రెండు వరకు సాగునీటి విడుదల సరఫరా చేయిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.