రాష్ట్రంలో ఈ ఏడాది పాటు అనేక వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్యర్ రావు అనానరు. బుధవారం గాంధీభవన్‌లో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను 30వ తేదీన మహబూబ్‌నగర్‌లో జరిగే రైతు సదస్సులో వివరించడం జరుగుతుందన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లో భారీ ఎత్తున వ్యవసాయ ప్రదర్శన ఉందన్నారు. మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాల వారీగా ఆయా ఇంచార్జ్ మంత్రులు ఈ కార్యక్రమాలను తీసుకోవాలన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహబూబ్‌నగర్ రైతు సదస్సు పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 12 నెలల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనంత గొప్ప కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిందన్నారు. ఇప్పటికే సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో వరంగల్‌లో, వేములవాడలో భారీ బహిరంగ సభలు నిర్వహించి విజయోత్సవాలను జరిపామన్నారు. 30న మహబూబ్‌నగర్‌లో పెద్ద ఎత్తున రైతు పండుగ నిర్వహిస్తున్నామని, ఈ రైతు ఉత్సవం గతంలో ఎవరు చేయలేనంత పెద్ద ఎత్తున జరగాలన్నారు. న భూతో న భవిష్యతి అన్నట్టుగా భారీ బహిరంగ సభ నిర్వహించి రైతులకు, వ్యవసాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు ప్రతి గ్రామంలో రైతులను మహబూబ్‌నగర్ తరలించాలని సూచించారు. అక్కడ జరిగే రైతు ఉత్సవాల్లో మన పెద్దలు చెప్పే కార్యక్రమాలు ప్రజలకు చేరే విధంగా చూడాలని సూచించారు.