చండీగఢ్: కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించడం సహా పలు తమ డిమాండ్ల సాధనకోసం మంగళవారం ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు రైతులు పోలుపునిచ్చిన నేపథ్యంలో పంజాబ్ నుంచి ఢిల్లీ దాకా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ‘ఢిల్లీ చలో’ ఆందోళనలకు వివిధ రాష్ట్రాలనుంచి దాదాపు 20 వేల మంది రైతులు ఢిల్లీవచ్చే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆందోళనను ఎలా నిర్వహించాలనే దానిపై రైతు సంఘాలు40 సార్లు రిహార్సల్స్ నిర్వహించాయని, అందులో పంజాబ్‌లో 30, హర్యానాలో పది రిహార్సల్స్ జరిగాయని ఆ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 13న జరిగే ఢిల్లీ చలో యాత్రలో 200కు పైగా రైతు సంఘాలు పాల్గొంటాయని ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా( నాన్ సొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఇప్పటికే ప్రకటించాయి.2000 2500 ట్రాక్టర్లను మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ తీసుకు వచ్చేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారని నిఘా వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలనుంచి రైతులుపెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాలు పంచుకోవడం కోసం బయలుదేరినట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి. పంజాబ్, హర్యానా, కర్నాటక, యుపి, కేరళ, కర్నాటక రాష్ట్రాలనుంచి కర్షకులు కారు బస్సులు, రైళ్లు తదితర మార్గాల్లో ఢిల్లీ చేరుకుంటారని కూడా పేర్కొన్నాయి. దీంతో హర్యానా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పంజాబ్ హర్యానా సరిహద్దులను మూసివేస్తూ పలు చోట్ల భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. పంజాబ్‌తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద హర్యానా పోలీసులు మూసి వేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెలను అడ్డుగా ఉంచారు. రోడ్లపై పదునైన ఇనుప మేకులను అమర్చారు. అల్లర్ల నిరోధక బలగాల వాహనాలను సైతం మోహరించారు. రాఫ్ దళాలతో సహా మూడంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. అత్యవసరమయితే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని ప్రజలకు సూచించారు.
ఢిల్లీలో నిషేధాజ్ఞలు
మరో వైపు రైతుల ‘ఢిల్లీ చలో మార్చ్’ దృష్టా ఢిల్లీ పోలీసులు నెల రోజుల నిషేధాజ్ఞలు విధించారు. సోమవారంనుంచి మార్చి 12 వరకు నగరంలో144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా ప్రకటించారు. పెద్ద సంఖ్యలో జనం గుమి కూడడంపైనా నిషేధం విధించినట్లు తెలిపారు. అరోరా ఇచ్చిన ఆదేశాల్లో ట్రాక్టర్లపైనా నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. నగరంలోకి ఆందోళనకారులు ప్రవేశించకుండా సింఘు, ఘాజీపూర్, టిక్రి సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
కనీస మద్దతు ధరలకు చట్టబద్ధ గ్యారంటీ కల్పించడంతో పాటుగా ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, రైతులు, రైతు కూలీలకు పింఛన్లు ఇవ్వాలని, వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, రైతులపై పోలీసు కేసులను ఉపసంహరించడంతో పాటుగా లఖింపూర్ ఖేరీ హింసాకాండల బాధితులకు న్యాయం చేయాలని, 2020లో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని తదితర డిమాండ్లతో రైతులు ఢిల్లీ చలో మార్చ్ చేపడుతున్నారు. ఇవేవీ తాము చేస్తున్న డిమాండ్లు కాదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలేనని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ అంటున్నారు.