హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయపార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో సమగ్ర వ్యవసాయ ప్రణాళికను పొందుపరచాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొతినేని సుదర్శన్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌తోపాటు పాల్గొన్న ప్రతినిధులు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వివరించారు.మ్యానిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై సూచనలు, సలహాలు చేశారు. రౌండ్ టేబుల్‌లో పాల్గొన్న వారినుంచి వచ్చిన ప్రధాన డిమాండ్లు…రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు రైతాంగ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అక్టోబర్ 20లోపు ఇవ్వాలి.అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి జిల్లా అధ్యక్షులకు వినతి పత్రాలు ఇవ్వాలి.ప్రస్తుతం ధరణిలో 20 లోపాలు ఉన్నట్లు అందరూ అంగీకరిస్తున్నారు.
సమగ్ర భూసర్వే నిర్వహించి ధరణిలో ఉన్న లోపాలన్నింటిని పరిష్కరించాలి.ప్రతి మూడు గ్రామాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించాలి. జిల్లా స్థాయిలో భూసార పరీక్షలు జరిపి పంటల ప్రణాళికను రూపొందించాలి. రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా పంటల ప్రణాళిక ఉండాలి. ఉపకరణాలను అందుబాటులో పెట్టాలి. రాష్ట్రానికి విత్తన చట్టం తప్పనిసరిగా ఉండాలి. నాణ్యతలేని విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. ఆ తర్వాత ఆయా కంపెనీల నుంచి వసూలు చేసుకోవాలి.వ్యవసాయ పరిశోధన కేంద్రాలను సమర్థవంతంగా పని చేయించాలి. నిధులు ఇవ్వాలి.రాష్ట్రంలోని వ్యవసాయ బావులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందుబాటులో ఉంచాలి. విద్యుత్ షాక్ వల్ల రైతులు, పశువులు చనిపోయినచో వారికి రూ.5 లక్షల వరకు పరిహారం చెల్లించాలి. ప్రతి రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలి. దళిత, గిరిజనులకు 15శాతం ప్రత్యేకించి రుణాలు ఇవ్వాలి. మొదటి రెండు సంవత్సరాలు వడ్డీ మాఫీ చేయాలి.ఆకాల వర్షాలు, అధిక వర్షాలు, వడగండ్ల వాన, కరువులు, అడవి జంతువుల నుంచి పంట నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వాలి. పంటలభీమా సౌకర్యం కల్పించాలి.
18 -75 ఏండ్ల వయస్సుగల రైతులకు రైతు బీమా వర్తింపజేయాలి. ప్రభుత్వమే బీమాను చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.రాష్ట్రంలో ధరల నిర్ణయాక కమీషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని అన్ని పంటలకు సమగ్ర ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం కలిపి నిర్ణయించే సూత్రం. (సి2శాతం+50శాతం) ప్రకారం మద్దతు ధరలను నిర్ణయించి కొనుగోళ్ళు చేయాలి.పశువులు, చేపలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు తదితర అనుబంధ రంగాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి.పశువైద్య శాలలు ఏర్పాటు చేయాలి. మొబైల్ పశువైద్య శాలను ఏర్పాటు చేయాలి.రాష్ట్రంలోని కౌలు రైతులను గుర్తించడానికి గ్రామ సభలు జరపాలి. 2011 చట్టం ప్రకారం గుర్తించిన వారికి రుణ అర్హత కార్డులు ఇవ్వాలి.ప్రభుత్వ పథకాలను కౌలు రైతులకు వర్తింపజేయాలి.2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి. పోడు భూములు సాగు చేస్తున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి.కేరళ తరహాలో రాష్ట్ర బడ్జెట్ మొత్తాలు సహకార వ్యవస్థలో డిపాజిట్లు చేయాలి.రైతులకు అదనపు ఆదాయం వచ్చే విధంగా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి.రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యావ శాఖకు కనీసం రూ.2వేల కోట్లు కేటాయించాలి.లిప్ట్ పథకాలకు విద్యుత్ సరఫరాను పెంచాలి. ప్రభుత్వమే నిర్వహించాలి.పేదలకు కమ్యూనిటీ బోర్లు వేసి ప్రభుత్వమే నిర్వహించాలి.రుణ విమోచన కమీషన్‌ను 10 ఎకరాల రైతుల వరకు విస్తరించి అమలు చేయాలి.
57 సంవత్సరాలకు పైబడిన రైతుకు ప్రతినెల రూ.5,000 పెన్షన్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకాలు కూడా అమలు చేయాలి. ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలి.వ్యవసాయోత్పత్తుల నిల్వకు గోదాంల సౌకర్యం కల్పించాలి. రైతుల వ్యవసాయోత్పత్తులను తాకట్టు పెట్టుకొని 75 శాతం రుణాలు ఇచ్చే ‘పథకాన్ని’ అమలు చేయాలి.అభివద్ధి కార్యక్రమాల కోసం భూ సేకరణ చేసే సందర్భంలో 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి.రైతుల సమస్యలను పరిష్కారించడానికి జిల్లా స్థాయిలో అఖిలపక్ష రైతు సంఘాలతో కమిటీ వేయాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి కశ్య పద్మ,అఖిల భారత ప్రగతిశీల రైతులసంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్, ఐద్వా ప్రధానకార్యదర్శి మల్లు లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్శింహారెడ్డి, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.జంగారెడ్డి, చైతన్యసేద్యం ఎడిటర్ ప్రసాదరావు, సీనియర్‌నేత బొంతల రామచంద్రరెడ్డి, మూడ్ శోభన్, కిసోర్ వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు బి.ప్రసాద్, ధర్మనాయక్ , పి.ఆశయ్య, మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.