Friday, November 22, 2024

ఢిల్లీలో ఒత్తిడి గల్లీలో నిరసనలు

- Advertisement -
- Advertisement -

Farmers dharnas and protests across Telangana today

రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహం

రాష్ట్రమంతటా నేడు అన్నదాతల ధర్నాలు, నిరసనలు

హస్తినలో కేంద్రం పెద్దలను కలిసేందుకు మంత్రుల బృందం యత్నం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆరుగాలం శ్రమించి ధాన్యం పండిస్తున్న రైతుల పక్షాన నిలిచిన తెలంగాణ రాష్ట్ర సర్కారు సోమవారం నుంచి కేంద్రప్రభుత్వంపై పోరాటానికి ద్విముఖ వ్యూహాన్ని ఎంచుకుంది. రైతు సమస్యల పరంగా, ప్రభుత్వ పరంగా, రాజకీయంగా ముప్పేట దాడిని ఎంచుకుంది.. ఒకవైపు రాష్ట్ర మంత్రుల ప్రతినిధి బృందాల ద్వారా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ, మరోవైపు రాష్ట్రమంతటా గ్రామాల స్థాయిలోనే రైతులతో నిరసన కార్యక్రమాలకు సిద్దమయ్యింది. యాసంగిలో తెలంగాణ రైతులు పండించే ధాన్యం కొనుగోలు చేసేదిలేదని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్ర రైతాంగానికి వివరిస్తూ కేంద్రం పోరుకు వారిలో పెద్ద ఎత్తున కదలిక తెస్తోంది. ధాన్యం సేకరణ విధానాల్లో రాష్ట్రానికో తీరున వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తెలంగాణ రైతులతోనే కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పే ప్రయత్నాలు చేపట్టారు. ఇందులో భాగంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాల్లో భాగంగా పల్లెపల్లెనా ధర్నాలు చేపడుతున్నారు. వాడవాడలా దిష్టిబొమ్మలు తగులబెట్టి ఢిల్లీకి నిరసన సెగల వేడిని తాకించబోనున్నారు.

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి , ప్రాజెక్టుల్లో నీళ్లుండి కూడా తమ పొలాల్లో వరిసాగు చేసుకోలేని దుస్థితి కల్పించిన కేంద్ర పెద్దలకు తెలంగాణ రైతులు తమ ఆవేదన ..ఆందోళనల రూపంలో బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. యాసంగిలో పండించే ధాన్యం కొనుగోలుకు బాయిల్డ్ రైస్ నెపం పెట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండించే ఈ రకం ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని ప్రకటించింది. కేంద్ర చేసిన ఈ ప్రకటన తెలంగాణ వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరుగాలం శ్రమించి వరిసాగు చేసినా , కేంద్రం యాసంగి ధాన్యం కొనుగోలు చేయకపోతే తమ గతేంకావాలని రైతులు కేంద్రం నిర్ణయంపై రగిలిపోతున్నారు. ఈ పరిస్థితులన్నింటిని గమినించిన ముఖ్యమంత్రి కేసిఆర్ వరిసాగు ద్వారా రైతులు నష్టపోకుండా యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ ద్వారా గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు ఆవశ్యకతను రైతులకు విశదీకరించే ప్రయత్నాలు చేపట్టారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా కేంద్రం కలిసిరాకపోతుండటంతో ఇక రైతులతోనే కేంద్రానికి కనువిప్పు కల్పించేలా నిరసనస కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.

ఢిల్లీలో కేంద్రంపై వత్తిడి:

ధాన్యం కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునహ:సమీక్షించుకునేలా టిఆర్‌ఎస్ సర్కారు కేంద్రంపై వత్తిడి పెంచుతోంది. సిఎం కేఇఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు జగదీష్ రెడ్డి , వేము ప్రశాంత్ రెడ్డి , ఎర్రబెల్లి దయాకర్ రావు ,పువ్వాడ అజయ్ కుమార్ తదితరులతోపాటు పార్లమెంట్ సబ్యులతో కూడిన బృందం ఢిల్లీలో తమ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర మంత్రి పియూష్ గోయిల్ తదితరులతో భేటి అయ్యేందుకు అధికారుల ద్వారా అప్పాయింట్ మెంట్‌కు ప్రయత్నాలు చేస్తోంది. గత నెల్లో ఢిల్లీవెళ్లిన మంత్రుల బృందం వానాకాలం వరిసాగు లెక్కల్లో మొండి వైఖరితో ఉన్న కేంద్రానికి వాస్తవిక నివేదికల ద్వారా సాగులెక్కలు వివరించటంలో సక్సేస్ అయ్యింది. కేంద్రం కూడా తాము సేకరించిన సాగు లెక్కలు సవరించుకుంది.

అంతే కాకుండా ధాన్యం కొనుగోలులో లక్ష్యాలు పెంచాలని చేసిన తెలంగాణ మంత్రుల విజ్ణప్తికి కేంద్ర మంత్రి పీయూష్ గోయిల్ సానుకూలగా స్పందించిన్నట్టు పైకి కనిపించినా ధాన్యం సేకరణ లక్ష్యాలను పెంచుతూ ఇంతవరకూ ఆదేశాలు వెలువడలేదు. యాసంగిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో ముందుగానే చెప్పాలన్న తెలంగాణ ప్రతిపాదనకు కూడా కేంద్రం నుంచి సరైన సమాధానం రాలేదు. బాయిల్గ్ రైస్ కొనేది లేదని మాత్రమే ప్రకటించింది. ఈ నేపధ్యంలో తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కే్ంరద్రానికి గట్టిగానే వినిపించాలని రాష్ట్ర మంత్రుల బృందం నిర్ణయించుకుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడిని నేరుగా కలసి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగం సమస్యలు విన్నవించేందుకు నివేదికలు సిద్దం చేసుకున్నారు. కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖల మంత్రులతో కూడా సమావేశమై యాసంగి రైతుల సమస్యల తీవ్రత, రైతుల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాలతో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఒక్కసారిగా ఉడుకుపుట్టుబోతోంది. తమ పక్షనా నిలిచి పోరాటాలకు సిద్దమైన రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు సోమవారం నాటి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని ధర్నాలు విజయవంతం చేసేందుకు రైతులతోపాటు టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు , ప్రజులు , ప్రజాసంఘాలు, సిద్దమయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News