ఇళ్లకు పయనమైన అన్నదాతలు
ఢిల్లీ సరిహద్దుల్లో పండగ వాతావరణం
ప్రక్రియ పూర్తి కావడానికి మూడు, నాలుగురోజులు: తికాయత్
న్యూఢిల్లీ: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు 15 నెలల పాటు రైతన్నలు చేపట్టిన సుదీర్ఘ నిరసనలు ముగిశాయి. రెండు రోజలు క్రితం చెప్పినట్లుగా శనివారం ఉదయంనుంచి వారు ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసనల వేదికలను ఖాళీ చేసి స్వస్థలాలకు పయనమయ్యారు. తమ ఆందోళనలను కొనసాగించడం కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను తొలగించడం మొదలైంది. వారు ఉపయోగించిన దిండ్లు, దుప్పట్లు, పివిసి షీట్లు, దోమతెరలు వంటి వాటిని చుట్టుపక్కల గ్రామాల్లోని పేదలకు పంచిపెట్టారు. అనంతరం రంగురంగుల లైట్లతో అలంకరించిన ట్రాక్టర్లు సొంత గ్రామాలకు పయనమయ్యాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘాజీపూర్ సరిహద్దు ప్రాంతంలో బయలుదేరిన ట్రాక్టర్లను సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ తికాయత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.‘ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పెద్ద సంఖ్యలో రైతులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి ఉంది.
ఇప్పటికే కొంత మంది ఇళ్లకు వెళ్లడం ప్రారంభించారు.ఈ ప్రక్రియ పూర్తి కావడానికి నాలుగైదు రోజులు పడుతుంది. ఈ రోజు సమావేశంలో మేమంతా మాట్లాడుకుంటాం. ప్రార్థనలు జరుపుతాం. మాకు సహకరించిన వారిని కలుస్తాం. నేను ఈ నెల 15న ఈ ప్రాంతాన్ని వీడతాను.్ర పభుత్వం తన హామీలను నెరవేర్చకపోతే మళ్లీ వస్తాం’ అని తికాయత్ చెప్పారు. ‘గత ఏడాదిగా సింఘు సరిహద్దు మా ఇల్లు అయింది. ఈ ఉద్యమం మమ్మల్ని ఒక్కటి చేసింది. కులం, తెగ, మతంతో సంబంధం లేకుండా మేమంతా సంఘటితంగా నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాం. ఈ ఉద్యమం ఫలితం ఇంతకన్నా గొప్పగా ఉంటుంది’ అని పంజాబ్‌లోని మోగా ప్రాంతానికి చెందిన కుల్జీత్ సింగ్ ఆలఖ్ అనే రైతు అన్నాడు. స్వగ్రామానికి తిరిగి వెళ్లడానికి ముందు ఆయన సహచర రైతులను ఆలింగనం చేసుకుని వీడ్కోలు చెప్పాడు.
వందల కొద్దీ మంచి జ్ఞాపకాలు. నల్ల చట్టాలపై విజయంతో తాము ఇళ్లకు తిరిగి వెళ్తున్నామని ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఇంటికి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్న జితేందర్ చౌదరి చెప్పాడు. గత ఏడాది కేంద్రం తీసుకు వచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ఆందోళనలకు ప్రభుత్వం దిగి వచ్చింది. ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. అలాగే రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు అంగీకరించడం, కనీస మద్దతు ధర చట్టబద్ధత వంటి అంశాలను చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంతో రైతులు నిరసన వేదికలను వీడేందుకు అంగీకరించారు. దానిలో భాగంగా వారు ఏడాది తర్వాత ఇళ్ల్లకు తిరిగి వెళ్తున్నారు. విజయంతో తిరిగి వస్తున్న రైతులకు ఘన స్వాగతం పలికేందుకు ఆయా గ్రామాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని కొందరు నాయకులు చెప్తున్నారు.