చండీగఢ్ : అనేక డిమాండ్ల పరిష్కారం కోసం గురువారం రైతు సంఘాల నేతలు పంజాబ్ సిఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో భేటీ ఆయ్యారు. రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనల సమయంలో నమోదైన కేసులను ఎత్తి వేయాలని, హైవే ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు నష్ట పరిహారం చెల్లించాలని, రైతు వాహనాలకు టోల్ ఫీజు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. దీనిపై సిఎం చన్నీ రైతులతో సమావేశం బాగా జరిగిందని చెప్పారు. చాలా సమస్యలను పరిష్కరించినట్టు తెలిపారు. రెండు లక్షల వరకు రైతు రుణాలను మరో 10, 12 రోజుల్లో మాఫీ చేస్తామని చెప్పారు.రైతు వాహనాలకు టోల్ రుసుం నుంచి మినహాయింపుపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడతామని చెప్పారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వంతో తదుపరి సమావేశం ఈ నెల 29న జరుగుతుందని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) ఏక్తా ఉగ్రవాన్ పంజాబ్ అధ్యక్షుడు జోగిందర్ సింగ్ తెలిపారు.
Farmers meet with Punjab CM Channi