Monday, January 20, 2025

మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు బీజేపీ పుణ్యమే : మంత్రి జూపల్లి కృష్ణారావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః దేశంలో రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా మహారాష్ట్రలోనే జరుగుతున్నా మహాయుతి కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సోయాబీన్, పత్తి రైతులకు సరైన ధర కల్పించేందుకు కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయిగాం నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. మీనల్ నిరంజన్ పాటిల్ తరపున మంత్రి జూపల్లి సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. మహా వికాస్ అఘాడీ అధికారంలోకి రాగానే తెలంగాణ తరహాలో గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో మీనల్‌ను గెలిపించాలని కోరారు. అదీవాసీలు, దళితులు, పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలవాలని అన్నారు. బీజేపీ కూటమి అవలంబిస్తున్న విధానాల వల్ల దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే రైతులు ఆత్యహత్యలు చేసుకుంటున్నారని, నీటి కొరత, పంటలకు కనీస మద్దతు ధరలు లేకపోవడం, ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరు అడ్డుపడ్డా కుల గణన జరుగుతుంది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్లుగా ఈ దేశంలో ఎవరు అడ్డుపడినా కుల గణన జరిగి తీరుతుందని, గడ్కరి, నరేంద్ర మోడీ కూడా ఆపలేరని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కుల గణన అంశంపై దేశానికి దిశా దశగా నిలుస్తుందని తెలిపారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా రాజుర ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క తో కలిసి ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంవీఏ కూటమి అధికారంలోకి రాగానే తెలంగాణ తరహాలో గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. ప్లానింగ్ శాఖ ద్వారా కుల గణన విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటికీ 50 శాతానికి పైగా సర్వే పూర్తయిందని తెలిపారు. ప్రజలే ముందుకు వచ్చి సర్వేలో తమ వివరాలు నమోదు చేయించుకుంటున్నారని తెలిపారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బిజెపి, బిఆర్‌ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఐక్యం చేసే పార్టీ అని అన్నారు. రాజుర నియోజకవర్గంలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ కూటమి కుల గణన చేపడుతుందని, జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు సంక్షేమ ఫలాలు అందిసామని తెలిపారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందజేస్తుంది. హిందూ ముస్లింల పేరుతో ప్రజలను చీల్చి బిజెపి రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్‌దే అధికారం

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పొరుగున ఉన్న బల్లార్షా, చంద్రపూర్ , రజురా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సోమవారం నాడు ప్రచారం చేశారు. రాజూర కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ భారీ బహిరంగ సభలో ప్రసగించారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ దోటేను మరో సారి ఆశీర్వదించాలని కోరారు.

మహారాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం పలికారు. దేశానికి, మహారాష్ట్రకు ప్రమాదకారిగా బీజేపీ మారిందని హెచ్చరించారు. కుటుంబాలను, పార్టీలను, సమాజాన్ని చీలుస్తూ విధ్వంస రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుందని రోపించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే తెలంగాణ తరహాలోనే గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా, సరిహద్దులో గల మహారాష్ట్ర గ్రామాల అభివృద్దికి అన్ని రకాలుగా సహకరిస్తామని మంత్రి సీతక్క హమీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News