న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నప్పటకీ కొందరు రైతులను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చి వారు పండించిన పంటకు గిట్టుబాట లభించేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ప్రభుత్వం సేకరించిన తమ భూములకు నష్టపరిహారాన్ని పెంచాలని, పంటలకు కనీస మద్దతు ధర హామీ అమలుకు చట్టాన్ని చేయడం తదితర డిమాండ్లతో గురువారం ఢిల్లీ–ఎన్‌సిఆర్‌కు చెందిన వేలాదిమంది రైతులు డోడ్డెక్కిన నేపథ్యంలో రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. ఐసిఎఆర్‌ఢిల్లీ–ఐఎఆర్‌ఐ62వ స్నాతకోత్సవంలో శుక్రవారం ఆమె ప్రసంగిస్తూ రైతులు కేవలం అన్నదాతలు మాత్రమే కాదని,
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నందుకు జీవనదాతలు కూడానని ఆమె కీర్తించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తమకు తెలుసునని, ఇప్పటికీ చాలామంది రైతులు పేదరికంలో మగ్గుతున్నారని రాష్ట్రపతి అన్నారు. వారు పండించిన పంటలకు గిట్టుబాట ధర కల్పించి వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి మరింతగా మనం కష్టపడాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందనున్నదని, రైతులు అభివృద్ధిని తప్పకుండా చూడగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.