సమస్యల పరిష్కారానికి రైతు వేదికలు ఉపయోగపడతాయి
సిఎం కెసిఆర్ తీసుకున్న ఆయిల్‌పాం సాగు గొప్ప నిర్ణయం
నాబార్డ్ చైర్మన్ డా చింతల గోవిందరాజులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల రైతాంగానికి మరింత మేలు జరుగుతుందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పదని నాబార్డ్ చైర్మన్ డా చింతల గోవిందరాజులు అభివర్ణించారు. పంట మార్పిడి విధానంతో రైతులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ సాగుపై తారమతి పేట అబ్దుల్లాపూర్‌మెట్‌లోని నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో అవగాహన శిక్షణ కేంద్రాన్ని నాబార్డ్ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి రైతు వేదికలు ఉపయోగపడతాయన్నారు. ఇప్పటికే రాష్ట్రం నీలి విప్లవంతో పాటు శ్వేత విప్లవం వైపు అడుగులు వేస్తోందన్నారు.
ఇక సిఎం కెసిఆర్ తీసుకున్న ఆయిల్‌పాం సాగు నిర్ణయంతో రాష్ట్రంలో బ్రౌన్ విప్లవం రానుందన్నారు. వ్యవసాయ రంగంలో రైతుకు అవకాశాలతో పాటు అవగాహన పెరిగిందన్నారు. సమీకృత వ్యవసాయం వైపు రైతులు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రమంతా ప్రస్తుతం నీళ్లతో నిండి ఉందన్నారు. తెలంగాణలో ఆయిల్ ఫాం సాగు విస్తీర్ణం పెంచడం గొప్ప నిర్ణయమన్నారు. ఇతర దేశాల నుంచి లక్షా 10 కోట్ల విలువ గల వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నామని, దేశానికి అవసరమైన వంట నూనెల ఉత్పత్తి లేదన్నారు.
ఇతర నూనె గింజల సాగుతో పోల్చుకుంటే ఆయిల్ పాం సాగుతో దిగుబడితోపాటు రైతుకు ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ఆయిల్ పాం సాగులో నాలుగైదు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రానున్న రోజుల్లో క్రూడాయిల్ ఉత్పత్తి రంగంలో దుబాయి తరువాత తెలంగాణ ఉంటదన్నారు. ఆయిల్ పాం సాగుతో రానున్న పది సంవత్సరాల్లో రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. అంతర్ పంటల్లో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశాలు నాబార్డ్ కల్పిస్తోందన్నారు. యాంత్రీకరణ, సాంకేతికత తో వ్యవసాయం మరింత సులభతరమయ్యిందన్నారు.