రహదారిపై రాస్తారోకో చేస్తున్న మామునూరు గ్రామస్థులు
తెగేసి చెప్పిన ‘మామునూరు’ భూ బాధితులు
భూ సర్వేకు వచ్చిన అధికారులను నిలదీసిన రైతులు, మహిళలు
గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు
హామీలను మరిచిన నేతలు..అధికారులని మండిపాటు
మామునూరుకు బైపాస్ రోడ్డు వేసేది లేదనే ఎంఎల్‌ఎ ప్రకటనతో మరింత ఆగ్రహం
వరంగల్ =నెక్కొండ రహదారిపై గుంటూరుపల్లిలో ఆందోళన
పరిస్థితి ఉద్రిక్తం..అడ్డుకున్న పోలీసులు
సర్వే చేయకుండానే వెళ్లిపోయిన ఆర్‌డిఒ, తహశీల్దార్, అధికారులు
వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్‌పోర్టు కోసం ఎకరానికి రూ.5 కోట్లు ఇస్తేనే భూములు ఇస్తామని భూ బాధితులు సర్వే కోసం మంగళవారం వచ్చిన అధికారులకు తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా భూ సర్వేకు వచ్చిన అధికారులను రైతులు నిలదీశారు. అధికారులూ..గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వరంగల్ =నెక్కొండ రహదారిపై గుంటూరుపల్లిలో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు ఇలావున్నాయి. వరంగల్= నెక్కొండ ప్రధాన రహదారిపై గుంటూరుపల్లిలో మామునూరు ఎయిర్‌పోర్టు కోసం భూములు కోల్పోతున్న రైతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టారు. గో బ్యాక్.. గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ సర్వేకు వచ్చిన అధికారులను ఉద్దేశించి రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.5 కోట్లు ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు అధికారులకు తెగేసి చెప్పారు. అధికారులు ఎంతగా సర్దిచెప్పినా రైతులు ససేమిరా అనడంతో 253 ఎకరాలకు భూ సర్వేకు వచ్చిన ఆర్‌డిఒ సత్యపాల్‌రెడ్డి, ఖిలా వరంగల్ తహసీల్దార్ నాగేశ్వర్‌రావుతోపాటు మరికొంతమంది అధికారులు సర్వే చేయకుండా వెళ్లిపోయారు.
గతంలో మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎంఎల్‌ఎ రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఆర్‌డిఒ సత్యపాల్‌రెడ్డి రైతులతో మాట్లాడినప్పుడు భూమికి బదులు భూమి ఇప్పిస్తామని, భూములు కోల్పోతున్న రైతులకు నష్టం కలుగకుండా పరిహారం అందిస్తామని భరోసి ఇచ్చారు. గుంటూరుపల్లి నుంచి మామునూరు సమీపంలో బైపాస్ రోడ్డు వేయిస్తామని రైతులకు మాట ఇచ్చారు. వారిచ్చిన మాటలు నమ్మిన రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇప్పుడు అదే ప్రజాప్రతినిధులు, అధికారులు పరిహారం ఎకరానికి ఇంత ఇస్తామని హామీ ఇవ్వకుండా గుంటూరుపల్లి నుంచి మామునూరుకు బైపాస్ రోడ్డు వేసేది లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహంతో ఎయిర్‌పోర్టుకు భూములు ఇచ్చేది లేదని తెగేసి చెపుతున్నారు. ఎంఎల్‌ఎ రేవూరి ప్రకాశ్‌రెడ్డి సోమవారం హన్మకొండలోని తన నివాసంలో గుంటూరుపల్లి రైతులతో మాట్లాడుతూ.. అధికారులు భూ సర్వేకు వస్తారని, వారికి సహకరించాలని కోరారు. ఎకరానికి పరిహారం ఎంత ఇస్తారని రైతులు అడుగగా ఇప్పుడు ఆ మాటలు వద్దని చెప్పారని, గుంటూరుపల్లి నుంచి మామునూరుకు బైపాస్ రోడ్డు వేయాలని రైతులు అడుగగా రోడ్డు వేసేది లేదని చెప్పడంతో ఆగ్రహంతో రగిలిపోయి ఓట్లు వేసి గెలిపిస్తే ఎంఎల్‌ఎ అలా మాట్లాడటం బాధాకరమని మండిపడ్డారు.
ఒకపక్క తాము భూములు కోల్పోతున్నామని, మరోపక్క ప్రజాప్రతినిధి ఈ రకంగా అవమానిస్తున్నారని రైతులు బాధతో తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నామని, మంత్రి, ఎంఎల్‌ఎ అధికారులు తలో మాట మాట్లాడటంతోనే అంతా కలిసి తమను గందరగోళంలోకి నెట్టేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎయిర్‌పోర్టు కోసం భూములు ఇచ్చే దానికి తాము సిద్ధంగా ఉన్నా తమ డిమాండ్లు పరిష్కరిస్తే భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. చదువుకున్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని రైతులు అధికారులను వేడుకున్నారు. గాడపల్లిలో సుమారు 15 మంది ఇళ్లు కోల్పోతున్నారని, వారికి భూమికి బదులు భూమితో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా ‘మీరు సర్వేకు సహకరించండి.. అన్ని విషయాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం’ అని ఆర్‌డిఒ చెప్పగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమ డిమాండ్లు నెరవేరిస్తే తామే దగ్గరుండి భూ సర్వే చేయిస్తామని చేతులెత్తి దండు పెడుతున్నామని వేడుకున్నారు.
అధికార పార్టీలోనే ఆధిపత్యంతోనే ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసం రైతులను ఉసిగొల్పుతున్నారని రైతులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. అధికారులు, నేతల విరుద్ధ ప్రకటనలతో తాము భూములు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, మంత్రి కొండా సురేఖ, ఎంఎల్‌ఎ రేవూరి ప్రకాశ్‌రెడ్డి రైతులతో విడివిడిగా మాట్లాడి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తే భూములు ఇచ్చే దానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ ధర్నాకు భారీగా భూ నిర్వాసితులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ పోలీసులు తరలివచ్చి శాంతియుతంగా రైతులతో మాట్లాడి.. మీ సమస్యను అధికారులు పరిష్కరిస్తారని చెప్పడంతో శాంతించి రైతులు వెళ్లిపోయారు.